Indian Citizens: ఆ హీరో ఈ హీరోయిన్ వద్దే వద్దు
ABN , Publish Date - Apr 24 , 2025 | 01:10 AM
పాకిస్థానీ నటులు ఇమాన్వీ, ఫవాద్ ఖాన్‌లపై సోషల్‌మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో వీరి సినిమాల విడుదలపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి
కశ్మీర్‌లోని పహల్గామ్‌లో టూరిస్టులపై కొంతమంది తీవ్రవాదులు అమానుషంగా దాడి జరిపిన నేపథ్యంలో ప్రస్తుతం రెండు చిత్రాలపై సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ జరుగుతోంది. అందులో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ఫౌజీ’ చిత్రం ఒకటైతే, మరొకటి వాణీ కపూర్ నటిస్తున్న హిందీ చిత్రం ‘అబిర్ గులాల్’. ఫౌజీ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న ఇమాన్వీ, ‘అబిర్ గులాల్’లో హీరోగా నటిస్తున్న ఫవాద్ ఖాన్... ఇద్దరూ పాకిస్థాన్ వారు కావడమే ఈ చర్చకు కారణం. వీరిద్దరినీ సినిమాల నుంచి తొలగించాలనీ, భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఏ ఒక్క పాకిస్థానీ నటుడికి కానీ నటికి కానీ అవకాశం ఇవ్వకూడదని వాదిస్తున్నారు. దేశంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాకిస్థాన్‌కు చెందిన నటీనటులను భారతీయ సినిమాల్లో ప్రోత్సహించడం సరికాదని నెటిజన్లు అంటున్నారు. ఇమాన్వీ కరాచీలో పుట్టారు. ఆమె తండ్రి ఇక్బాల్ ఒకప్పుడు పాకిస్థాన్ మిలటరీలో ఉన్నత అధికారిగా పని చేసిన విషయాన్ని నెటిజన్లు ప్రస్తావిస్తూ ఇమాన్వీని ‘ఫౌజీ’ చిత్రం నుంచి తొలగించాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇమాన్వీ తన కుటుంబంతో కలసి ప్రస్తుతం అమెరికాలో ఉంటోందనీ, కళాకారులను వారి జాతీయత ఆధారంగా విమర్శించడం తగదని సోషల్ మీడియాలోనే మరో వర్గం వాదిస్తోంది.
ఇక ఫవాద్ ఖాన్ నటించిన ‘అబిర్ గులాల్’ చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్తయింది. మే 9న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. క్రాస్ బోర్డర్ లవ్‌స్టోరీగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి ఎస్ బాగ్డీ దర్శకుడు. ‘పాకిస్థానీ నటుడు మనకు అవసరమా’ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ సినిమాను మహారాష్ట్రలో విడుదల చేయకుండా అడ్డుకుంటామని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన ఇప్పటికే హెచ్చరించింది. ఇటువంటి ఉద్రికత్తల నేపథ్యంలో ఈ పాకిస్థానీ హీరోహీరోయిన్ల వ్యవహారం ఏమవుతుందో చూడాలి.