ఆస్కార్ వేడుకలు.. అనోరాకు అగ్రస్థానం
ABN , Publish Date - Mar 04 , 2025 | 06:21 AM
ప్రపంచ సినీ రంగంలో ఉన్నత పురస్కారంగా భావించే 97వ ఆస్కార్ అవార్డుల వేడుక కన్నులపండువగా సాగింది. అమెరికాలోని లాస్‌ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో...
ప్రపంచ సినీ రంగంలో ఉన్నత పురస్కారంగా భావించే 97వ ఆస్కార్ అవార్డుల వేడుక కన్నులపండువగా సాగింది. అమెరికాలోని లాస్‌ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఆదివారం సాయంత్రం (భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం) నిర్వహించిన ఈ కార్యక్రమానికి కానన్ ఓబ్రియాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఆయన భారతీయులను ఉద్దేశించి హిందీలో మాట్లాడడంతో పాటు ‘బ్రేక్ ఫాస్ట్ చేశారా’ అని అనడం అందర్నీ ఆకట్టుకుంది.
ఈ వేడుకలో అందర్నీ ఆశ్చర్యపరిచిన చిత్రం ‘అనోరా’. చిన్న చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా ఐదు అకాడమీ అవార్డులను దక్కించుకుంది. ఉత్తమ చిత్రం, ఎడిటింగ్, స్ర్కీన్ ప్లే, దర్శకుడు, నటి విభాగంలో పురస్కారాలు దక్కించుకుంది. దర్శకత్వంతో పాటు ఎడిటింగ్, స్ర్కీన్ ప్లే అందించిన సీన్ బేకర్.. ఒకే చిత్రానికి నాలుగుసార్లు అవార్డు అందుకున్న మొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. వాల్ట్ డిస్నీ గతంలో వేర్వేరు సినిమాల ద్వారా నాలుగు అవార్డులను అందుకున్న సంగతి తెలిసిందే. సీన్ బేకర్ ఈ అవార్డును వేశ్యలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ థియేటర్ల మనుగడను కాపాడాల్సిన అవసరాన్ని చెప్పారు.
ఉత్తమ నటుడిగా అడ్రియన్ బ్రాడీ
బ్రాడీ కార్బెట్ తెరకెక్కించిన ‘ద బ్రూటలిస్ట్’ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నారు అడ్రియన్ బ్రాడీ. ఆయనకు ఇది రెండో ఆస్కార్ పురస్కారం. 2002లో రోమన్ పొలాన్‌స్కీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పియానిస్ట్’ అతి పిన్న వయస్కుడిగా తొలిసారి ఆస్కార్‌ను అందుకున్నారు. ఈ రెండు సినిమాలు హోలోకాస్ట్ నేపథ్యంలో రూపొందినవే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాధించిన విజయాలు, ఘనతలు శాశ్వతం కాదని తెలిపారు. అలాగే, ‘ద రియల్ పెయిన్’ చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటుడిగా అవార్డును అందుకున్నారు కీరన్‌కైల్ కల్కిన్.
ఉత్తమ నటిగా మైకీ మ్యాడిసన్
‘అనోరా’ చిత్రానికి ఉత్తమ నటిగా పురస్కారం అందుకున్నారు మైకీ మ్యాడిసన్. ఈ రొమాంటిక్ కామెడీ డ్రామాలో ఆమె వేశ్య పాత్రలో నటించారు. ఈ అవార్డును అందుకోవడం కలలా ఉందని మ్యాడిసన్ చెప్పారు. అలాగే, ‘ఎమిలియా పెరెజ్’ చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటిగా జో సాల్డాన అవార్డును అందుకున్నారు. అత్యధిక నామినేషన్లతో రేసులో నిలిచిన నాన్ ఇంగ్లీష్ చిత్రం ‘ఎమీలియా పెరెజ్’ కేవలం రెండు అవార్డులతో సరిపెట్టుకుంది. పది నామినేషన్లు సాధించిన ‘బ్రూటలిస్ట్’ చిత్రం మూడు అవార్డులు పొందింది. ‘డ్యూన్ 2’ చిత్రం రెండు అవార్డులను సొంతం చేసుకుంది.
అనూజకు నిరాశ
భారత్ తరపున ఆస్కార్ నామినేషన్ పొందిన లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ ‘అనూజ’ చిత్రానికి నిరాశ ఎదురైంది. ఈ విభాగంలో పోటీపడుతున్న చిత్రాలను ఓడించి, ‘ఐ యామ్ నాట్ ఏ రోబో’ లఘు చిత్రం పురస్కారాన్ని కైవసం చేసుకుంది.
విజేతల వివరాలు
ఉత్తమ చిత్రం: అనోరా
ఉత్తమ దర్శకుడు: సీన్ బేకర్ (అనోరా)
ఉత్తమ నటుడు: అడ్రియన్ బ్రాడీ (ద బ్రూటలిస్ట్)
ఉత్తమ నటి: మైకీ మ్యాడిసన్(అనోరా)
ఉత్తమ సహాయ నటుడు: కీరన్‌కైల్ కల్కిన్
(ద రియల్ పెయిన్)
ఉత్తమ సహాయ నటి:
జో సాల్డాన (ఎమిలియా పెరెజ్)
ఉత్తమ ఎడిటింగ్ : అనోరా (సీన్ బేకర్)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: ద బ్రూటలిస్ట్ (లాల్ క్రాలే)
ఆస్కార్ గెలుపులో తెలంగాణ వాసి పాత్ర
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్‌లో పురస్కారం పొందిన ‘డ్యూన్ 2’ చిత్రం వీఎ్‌ఫఎక్స్ టీమ్‌లో తెలంగాణ వాసి ఉండడం విశేషం. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మునిసిపాలిటీ అమినాపురంకు చెందిన ఎడ్ల సుమంత్‌రెడ్డి ఈ చిత్రానికి ఆరు క్యారెక్టర్లను డిజైన్ చేశారు. ఈ సందర్భంగా పలువురు ఆయనను అభినందించారు.
కేసముద్రం (ఆంధ్రజ్యోతి)