NTR Charity Activities: జాతీయ రక్షణ నిధి కోసం ఎన్టీఆర్‌ తొలి అడుగు

ABN , Publish Date - May 10 , 2025 | 04:47 AM

1965లో పాకిస్థాన్‌ దాడి సమయంలో ఎన్టీఆర్‌ జాతీయ రక్షణ నిధి కోసం తొలిగా స్పందించి విరాళాలు సేకరించారు.తరువాత తుపాన్లు, ఉప్పెన బాధితుల కోసం కూడా ఎన్టీఆర్‌ వినోద ప్రదర్శనలు నిర్వహించి ప్రజల మనసులు గెలుచుకున్నారు.

రిగ్గా అరవై ఏళ్ల కిత్రం అంటే 1965లో మనదేశంపై పాకిస్థాన్‌ తొలిసారిగా దాడి చేసిన తరుణంలో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి మొదట స్పందించిన వ్యక్తి ఎన్టీఆర్‌. ఆయన స్వచ్చందంగా ముందుకు వచ్చి జాతీయ రక్షణ నిధి కోసం విరాళాలు సేకరిస్తామని ఆనాటి పత్రికల ద్వారా ప్రకటించి మిగిలిన వారిలో స్ఫూర్తి నింపారు. చిత్ర పరిశ్రమలోని తన సహచర నటీనటులను సంప్రదించి, ఆంధ్రప్రదేశ్‌ ప్రజారక్షణ కమిటీ సహాయంతో మే 16, 17, 18 తేదీల్లో విజయవాడ, హైదరాబాద్‌, కర్నూలు పట్టణాల్లో ఎన్టీఆర్‌ సారథ్యంలో నటీనటులు వినోద ప్రదర్శనలు నిర్వహించి, విరాళాలు సేకరించారు.

ఎన్టీఆర్‌తో పాటు ఎస్వీ రంగారావు, జగ్గయ్య, కాంతారావు, గుమ్మడి, రాజనాల, సత్యనారాయణ, పద్మనాభం, సావిత్రి, జమున, రాజసులోచన, కన్నాంబ, లక్ష్మీరాజ్యం,, రేలంగి, గిరిజ.. వంటి ప్రముఖ తారలు విరాళాల సేకరణలో ఉత్సాహంతో పాల్గొన్నారు. వినోద ప్రదర్శనలతో అలరించారు. అప్పటివరకూ తెర మీద మాత్రమే కనిపించే తమ అభిమాన తారలు ఇలా తమ ఊరికి వచ్చి విరాళాలు సేకరించడం, వినోద ప్రదర్శనలు ఇవ్వడంతో జనం ఆనందానికి అవధులు లేవు. అందుకే తారలకు విరాళాలు అందివ్వడానికి పోటీ పడేవారు. ఆ రోజుల్లోనే మొత్తం ఎనిమిది లక్షల రూపాయలు వసూలు చేసి నాటి ప్రధానమంత్రి లాల్‌బహదూర్‌ శాస్త్రికి అందజేశారు ఎన్టీఆర్‌.

అదే స్ఫూర్తితో 1969లో తుపాను బాధితుల కోసం వారం రోజుల పాటు భిక్షా యాత్ర నిర్వహించారు ఎన్టీఆర్‌. ఆ రోజుల్లో ఆర్టిస్టులు, ఇతరులు కలిపి మొత్తం 180 మంది ఎన్టీఆర్‌ వెనుక నడవడం విశేషం. అలాగే 1977లో దివిసీమ ఉప్పెన వల్ల భారీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగినప్పుడు తను సోదరుడిగా భావించే అక్కినేని నాగేశ్వరరావుతో కలసి విరాళాలు సేకరించి, వినోద ప్రదర్శనలు ఇచ్చి రూ 15 లక్షల రూపాయలు వసూలు చేసి, ప్రభుత్వానికి అందజేశారు ఎన్టీఆర్‌. అలా ప్రజాహిత కార్యక్రమాల్లో పాల్గొని తను రాజకీయాల్లోకి ప్రవేశించడానికి చాలా ముందుగానే ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకొన్నారు ఎన్టీఆర్‌.

Updated Date - May 10 , 2025 | 04:53 AM