అసలైన ప్రజానేత ఎన్టీఆర్
ABN, Publish Date - May 12 , 2025 | 05:04 AM
అరేబియా ఎడారులతో సహా ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజానీకం ఎక్కడున్నా.. కులమతాలకు అతీతంగా తెలుగు వారి గుండెల్లో చిరస్మరణీయుడిగా కొలువైన విలక్షణ కథా నాయకుడు...
అరేబియా ఎడారులతో సహా ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజానీకం ఎక్కడున్నా.. కులమతాలకు అతీతంగా తెలుగు వారి గుండెల్లో చిరస్మరణీయుడిగా కొలువైన విలక్షణ కథా నాయకుడు, అసలైన ప్రజా నాయకుడు దివంగత ఎన్టీఆర్ అని ఆయన తనయుడు నందమూరి రామకృష్ణ అన్నారు. సౌదీ అరేబియాలోని దమ్మాం నగరంలో తెలుగు ప్రవాసీ సంఘం, సౌదీ అరేబియా తెలుగు సంఘాల సమాఖ్య (సాట్స్) ఆధ్వర్యంలో జరిగిన ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎల్లకాలం ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న ఎన్టీఆర్ కొడుకుగా జన్మించడం తన అదృష్టమని అన్నారు.
ఏ ప్రాంతంలో ఉన్నా అందరూ ఐక్యతగా తెలుగుతేజాన్ని చాటి చెప్పడం ద్వారా ఎన్టీఆర్ ఆశయాలను అమలు చేసిన వారవుతామని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, ఎన్టీఆర్ సాహిత్య కమిటీ అధ్యక్షుడు టి.డి.జనార్దన్ అన్నారు. సౌదీ అరేబియాలో తమ సంస్థ కార్యకలాపాల గురించి సాట్స్ అధ్యక్షుడు కోనేరు ఉమామహేశ్వరరావు వివరించారు. కార్యక్రమంలో సినీ నటి ప్రభతోపాటు, దేశవ్యాప్తంగా సుదూర ఎడారి ప్రాంతాల నుంచి వచ్చిన తెలుగు ప్రవాసీ ప్రముఖులు పాల్గొన్నారు.
నందమూరి రామకృష్ణ
గల్ఫ్ ప్రతినిధి (ఆంధ్రజ్యోతి)