ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం రహదారికి నేమ్‌ బోర్డు ఆవిష్కరణ

ABN , Publish Date - Feb 12 , 2025 | 02:16 AM

దివంగత సినీ నేపథ్యగాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కీర్తివిశేషాలు, సేవలకు గుర్తుగా ఆయన నివసించిన రోడ్డుకు ఆయన పేరే పెడుతూ తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన...

  • డిప్యూటీ సీఎం ఉదయనిధి, పలువురు మంత్రుల హాజరు

దివంగత సినీ నేపథ్యగాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కీర్తివిశేషాలు, సేవలకు గుర్తుగా ఆయన నివసించిన రోడ్డుకు ఆయన పేరే పెడుతూ తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రోడ్డుకు ‘నేమ్‌ బోర్డు’ను మంగళవారం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఉదయనిధి లాంఛనంగా ఆవిష్కరించారు. ఎస్పీబీ జీవించివున్న సమయంలో స్థానిక నుంగంబాక్కం, కామ్‌ధర్‌ నగర్‌ మెయిన్‌ రోడ్డులో నివసించేవారు. ఆయన మరణించిన తర్వాత ఆయన జ్ఞాపకార్థం కామ్‌ధర్‌ మెయిన్‌ రోడ్డుకు తన తండ్రి పేరు పెట్టాలని ఎస్పీబీ తనయుడు ఎస్పీ చరణ్‌ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ వినతిపై సీఎం స్టాలిన్‌ సానుకూలంగా స్పందించి ఆ రోడ్డుకు ఎస్పీబీ పేరు పెడుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ రోడ్డు పేరు తెలుపుతూ ఏర్పాటు చేసిన నేమ్‌ బోర్డును డిప్యూటీ సీఎం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కేఎన్‌ నెహ్రూ, పీకే శేఖర్‌బాబు, ఎం.సుబ్రమణ్యం, నగర మేయర్‌ ఆర్‌ ప్రియ, నగర కమిషనర్‌ కుమారగురుభరణ్‌, డిప్యూటీ మేయర్‌ మహేష్‌ కుమార్‌, ఎస్పీ సతీమణి ఎస్పీబీ సరస్వతి, కుమారుడు ఎస్పీ చరణ్‌, కుమార్తె ఎస్పీ పల్లవి, సోదరి ఎస్పీ శైలజ, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సహజంగా తమిళుల పేర్లకు చివరన ‘ఎన్‌’ అక్షరం వుంటుంది. సుబ్రమణ్యం అని వుంటే సుబ్రమణ్యన్‌ అని గానీ, లేదా సుబ్రమణియం అని గానీ వుండడం కద్దు.


ఆంగ్ల అక్షరాల్లోనూ అలాగే వుంటుంది. కానీ ఎస్పీబీ కుటుంబ సభ్యుల వినతి మేరకు ప్రభుత్వం ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం రోడ్‌’ అనే పెట్టింది. అంతేగాక తమిళనాట పేర్ల మధ్యలో సహజంగా ‘హెచ్‌’ కూడా ఉండదు. కానీ బాలసుబ్రహ్మణ్యం మధ్యలో ఆంగ్ల అక్షరం ‘హెచ్‌’ కూడా పెట్టడం విశేషం.

చెన్నై (ఆంధ్రజ్యోతి)


మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read : పీజీ మెడికల్ సీట్లలో స్థానికత కోటా విచారణకు అనుమతించిన సుప్రీంకోర్టు

Also Read: వీఐపీల భద్రత కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం

Also Read: బెల్ట్ షాపులు నిర్వహిస్తే.. కేసు నమోదు

For Telangana News And Telugu News

Updated Date - Feb 12 , 2025 | 02:16 AM