Hero Nagarjuna: మన వాళ్లకు శక్తిమంతులైన హీరోలు కావాలి

ABN , Publish Date - May 03 , 2025 | 06:47 AM

హీరో నాగార్జున భారతీయ ప్రేక్షకులు శక్తిమంతులైన హీరోలను ఎక్కువగా ఇష్టపడతారని చెప్పారు. "పుష్ప-2" లాంటి సినిమాలు దేశవ్యాప్తంగా ఆదరణ పొందడానికి భారతీయ హీరోలకు సామాన్యులైన శక్తులు ఉండటం ముఖ్యమని అభిప్రాయపడ్డారు.

భారతీయ ప్రేక్షకులు శక్తిమంతులైన హీరోలను చూడటానికి ఇష్టపడతారని హీరో నాగార్జున అభిప్రాయపడ్డారు. ముంబైలో జరుగుతున్న వేవ్స్‌ సమావేశంలో శుక్రవారం జరిగిన ఒక చర్చలో ఆయన పాల్గొన్నారు. ‘‘మన దేశంలో చాలా మంది ప్రజలకు రోజువారీ జీవితంలో చాలా ఒత్తిడి ఉంటుంది. సినిమాలను చూస్తే వారికి ఆ ఒత్తిడి పోతుంది. అందుకే వారు సినిమాల్లో మ్యాజిక్‌ కోరుకుంటారు. ఒక హీరో 20 మందిని ఎలా కొట్టగలుగుతాడని కొందరు అడుగుతారు. హాలీవుడ్‌లో మార్వెల్‌లాంటి సినిమాల్లో కూడా అదే చేస్తారు. కానీ వాళ్లకు సూపర్‌ పవర్స్‌ ఉన్నట్లు చూపిస్తారు. మన హీరోలకు అలాంటి ప్రత్యేక శక్తులు ఉండవు. ఒక సామాన్యుడు అసామాన్యంగా ప్రవర్తిస్తే మన ప్రేక్షకులకు నచ్చుతుంది..’’ అని నాగార్జున వ్యాఖ్యానించారు. ‘పుష్ప-2’ లాంటి సినిమాలకు దేశవ్యాప్తంగా ఆదరణ లభించటానికి ఇదే కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘పుష్ప’ తెలుగులో కన్నా హిందీలో ఎక్కువ వసూళ్లు సాధించింది. తెలుగులో ‘పుష్ప’లాంటి సినిమాలు ఇంతకు ముందూ వచ్చాయి. కానీ బిహార్‌, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌లలో ‘పుష్ప’లోని పుష్పరాజ్‌,, ‘కేజీఎ్‌ఫ’లో రాకీ.. ‘బాహుబలి’లో ప్రభాస్‌ లాంటి హీరోలను చూడాలనుకుంటున్నారు.. అందుకే ఈ సినిమాలు అక్కడ పెద్ద హిట్‌ అయ్యాయి’’ అని ఆయన పేర్కొన్నారు.


మాతృభాష పట్ల అభిమానం.. సొంత సంస్కృతి పట్ల మమకారం ఉన్న దర్శకుల చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తారన్నారు. ‘‘బాహుబలి సినిమాలో ప్రతి ఫ్రేమ్‌ను రాజమౌళి- తెలుగు సినిమాలాగే తీసారు. దానిని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆదరించారు. కథను మంచిగా చెప్పగలిగితే - అందరూ ఆదరిస్తారు’’ అని నాగార్జున పేర్కొన్నారు. తాను తన సినిమాలు తెలుగులో హిట్‌ కావాలని కోరుకుంటానని.. తెలుగులో హిట్‌ అయితే ఇతర భాషల్లో కూడా తప్పనిసరిగా హిట్‌ అవుతాయని అభిప్రాయపడ్డారు. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌, తమిళ నటి ఖుష్బు సుందర్‌, హీరో కార్తీలు కూడా ఈ చర్చలో పాల్గొన్నారు.

Updated Date - May 03 , 2025 | 06:48 AM