నా కెరీర్‌లో నిలిచిపోయే క్యారెక్టర్‌

ABN , Publish Date - May 20 , 2025 | 04:39 AM

‘‘భైరవం’ సినిమాలో గజపతి వర్మ లాంటి క్యారెక్టర్‌ ఇప్పటివరకు చేయలేదు. ఈ సినిమా నా కెరీర్‌లో ప్రత్యేకంగా నిలుస్తుంది’ అని అన్నారు హీరో మంచు మనోజ్‌. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, మంచు మనోజ్‌, నారా రోహిత్‌ హీరోలుగా...

‘‘భైరవం’ సినిమాలో గజపతి వర్మ లాంటి క్యారెక్టర్‌ ఇప్పటివరకు చేయలేదు. ఈ సినిమా నా కెరీర్‌లో ప్రత్యేకంగా నిలుస్తుంది’ అని అన్నారు హీరో మంచు మనోజ్‌. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, మంచు మనోజ్‌, నారా రోహిత్‌ హీరోలుగా విజయ్‌ కనకమేడల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘భైరవం’. డా.జయంతిలాల్‌ గడా సమర్పణలో కె.కె.రాధామోహన్‌ నిర్మించారు. ఈనెల 30న చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే మంగళవారం మంచు మనోజ్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘‘భైరవం’ సినిమాలో ప్రతీ క్యారెక్టర్‌కి ప్రాధాన్యం ఉంటుంది. ఎవరి స్ర్కీన్‌ స్పేస్‌ వారిదే. ప్రతి ఒక్కరు అద్భుతంగా నటించారు. శ్రీ చరణ్‌ అద్భుతమైన స్వరాలు సమకూర్చారు. మంగళవారం ఒక ప్రత్యేక పాట విడుదల కాబోతోంది. మా నాన్నగారి జీవన ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. నిజాయితీగా ఉండడం ఆయన దగ్గరే చూసి నేర్చుకున్నాను. నాకు మా ఫాదరే హీరో. ఈ పుట్టినరోజు నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది. భవిష్యత్తులో కొత్త రకం సినిమాలు చేయాలనుంది. అలాగే పిల్లల కోసం ఒక సినిమా తీయాలనుంది. ఎప్పుడైనా అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను’ అని అన్నారు.


శివుడిని శివయ్యా అని పిలిస్తే రాడు

‘భైరవం’ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో మంచు మనోజ్‌ మాట్లాడుతూ ‘ఈ మధ్యకాలంలో ఎన్నో జరిగాయి. ఎన్నో చూశాను. కట్టుబట్టలతో రోడ్డు మీదకు తెచ్చారు. నేను ఊరు వెళ్లొచ్చేసరికి నా పిల్లల వస్తువులతో సహా అన్నీ రోడ్డు మీద పెట్టారు. బయటకు వెళ్లడానికి కార్లు లేకుండా తీసుకెళ్లిపోయారు. కానీ.. నాకు ఆ శివుడు అభిమానుల రూపంలో వచ్చి 20 కార్లు పెట్టించాడు. శివుడిని శివయ్యా... అని పిలిస్తే రాడు. ఆయన్ని మనసారా తలచుకుంటే మా దర్శకుడి రూపంలోనో.. మీ అందరి రూపంలోనో వస్తాడు’ అని అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. మంచు విష్ణుని ఉద్దేశించే మనోజ్‌ ఇలా వ్యంగ్యంగా మాట్లాడి ఉంటారని అభిమానుల మధ్య చర్చ సాగుతోంది.

Updated Date - May 20 , 2025 | 04:39 AM