Karnataka Film Chamber Letter: కమల్ సినిమాలను నిషేధించాలి
ABN , Publish Date - Jun 01 , 2025 | 03:33 AM
కన్నడ భాషపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కమల్ హాసన్ క్షమాపణ చెప్పకపోతే ఆయన సినిమాలను నిషేధించాలని కర్ణాటక ఫిల్మ్ చాంబర్ డిమాండ్ చేసింది. మంత్రి శివరాజ్ తంగడగి, సీఎం సిద్దరామయ్యతో చర్చిస్తామని తెలిపారు.
కర్నాటక మంత్రికి ఫిల్మ్‌చాంబర్ లేఖ
కమల్ హాసన్ క్షమాపణ చెప్పకుంటే ఆయన సినిమాలను నిషేధించాలని కోరుతూ కన్నడ సాంస్కృతిక శాఖ మంత్రి శివరాజ్ తంగడగికి కర్ణాటక ఫిల్మ్ చాంబర్ లేఖ రాసింది. ఈ అంశంపై మంత్రి శివరాజ్ తంగడగి స్పందిస్తూ, ఇతర భాషల నటులు కన్నడ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని అన్నారు. విధానసౌధలో మంత్రి శనివారం మీడియాతో మాట్లాడారు. కమల్ సీనియర్ నటుడైనా, భాష గురించి అనుచితంగా మాట్లాడితే సహించేది లేదని అన్నారు. ఈ అంశంపై సీఎం సిద్దరామయ్యతోనూ, సీనియర్ నటుడు శివరాజ్‌కుమార్‌తోనూ చర్చిస్తానని అన్నారు. థగ్‌లైఫ్ సినిమా కోసం వచ్చిన సమయంలో కమల్‌హాసన్ మాట్లాడుతూ, తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందని అన్నారు. ఈ వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. జూన్ 5న సినిమా విడుదల కానుంది. కమల్ వ్యాఖ్యలు ఇప్పటికే వివాదాస్పదం అయ్యాయని, అందుకు ఆయన క్షమాపణ చెప్పాల్సిందేనని ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు నరసింహులు అన్నారు. జూన్ 5లోగా స్పందించకుంటే ఆయన నటించిన సినిమాను రాష్ట్రంలో ప్రదర్శించేందుకు అవకాశం ఇచ్చేది లేదని డిస్ట్రిబ్యూటర్‌లు స్పష్టం చేశారని తెలిపారు.
-బెంగళూరు (ఆంధ్రజ్యోతి)