జూనియర్‌ తొలి గీతం

ABN, Publish Date - May 20 , 2025 | 04:44 AM

కర్ణాటక మాజీ మంత్రి, పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్‌ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయం అవుతున్న లవ్‌ అండ్‌ ప్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘జూనియర్‌’. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల...

కర్ణాటక మాజీ మంత్రి, పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్‌ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయం అవుతున్న లవ్‌ అండ్‌ ప్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘జూనియర్‌’. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కథానాయిక. వారాహి చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మిస్తున్నారు. జూన్‌ 18న తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కాబోతోంది. బెంగళూరులో నిర్వహించిన కార్యక్రమంలో ఈ చిత్రం నుంచి ‘లెట్స్‌ లివ్‌ దిస్‌ మూమెంట్‌’ అనే తొలి పాటను చిత్రబృందం విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో దేవీశ్రీ ప్రసాద్‌ మాట్లాడుతూ ‘ఈ వేడుక చూస్తుంటే ఒక లైవ్‌ కాన్సర్ట్‌ చేస్తున్న ఆనందం కలిగింది. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. శ్రీరమణి అద్భుతమైన సాహిత్యం రాశారు’ అని అన్నారు. హీరో కిరీటి రెడ్డి మాట్లాడుతూ ‘నా తొలి సినిమాకి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించడం చాలా ఆనందంగా ఉంది. శ్రీలీల, జెనీలియాతో కలసి పనిచేయడం గొప్ప భాగ్యంగా భావిస్తున్నాను’ అని అన్నారు. ‘ఈ సినిమాలోని ప్రతి పాట ప్రత్యేకమైనదే. మరిన్ని అద్భుతమైన పాటలు రాబోతున్నాయి’ అని చిత్ర దర్శకుడు రాధాకృష్ణ తెలిపారు. కాగా, ఈ సినిమాతో జెనీలియా మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నారు. అలాగే కన్నడ నటుడు డా.రవిచంద్రన్‌ ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.

Updated Date - May 20 , 2025 | 04:44 AM