జనసేన ఇన్‌చార్జిపై వేటు

ABN , Publish Date - May 28 , 2025 | 04:45 AM

ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమా విడుదల నేపథ్యంలో జూన్‌ 1 నుంచి థియేటర్ల బంద్‌కు నిర్ణయించారన్న వివాదానికి సంబంధించి జనసేన రాజమండ్రి సిటీ నియోజకవర్గ ఇన్‌చార్జి, సినీ...

ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమా విడుదల నేపథ్యంలో జూన్‌ 1 నుంచి థియేటర్ల బంద్‌కు నిర్ణయించారన్న వివాదానికి సంబంధించి జనసేన రాజమండ్రి సిటీ నియోజకవర్గ ఇన్‌చార్జి, సినీ డిస్ర్టిబ్యూటర్‌ అనుశ్రీ(అత్తి) సత్యనారాయణను ఆ పార్టీ నాయకత్వం సస్పెండ్‌ చేసింది. ఈ మేరకు జనసేన పార్టీ కాన్‌ఫ్లిక్ట్‌ మేనేజ్మెంట్‌ హెడ్‌ వేములపాటి అజయ్‌కుమార్‌ పేరిట సత్యనారాయణకు లేఖ పంపారు. ‘అవాంఛనీయమైన థియేటర్ల బంద్‌ పిలుపు నిర్ణయంలో మీరూ భాగస్వాములేనని మీపై తీవ్రమైన ఆరోపణలు వచ్చినందున పార్టీలో మీ సభ్యత్వాన్ని రద్దు చేయడంతోపాటు మిమ్మల్ని పార్టీ రాజమండ్రి నగర నియోజకవర్గం ఇన్‌చార్జి బాధ్యతల నుంచి తొలగిస్తున్నాం. వచ్చిన ఆరోపణలు సత్యమో కాదో మీరు నిరూపించుకునేవరకూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలి’ అని అందులో ఆదేశించారు. బంద్‌ పిలుపు వెనుక నలుగురు వ్యక్తులు ఉన్నారని ప్రచారం జరగడం, దానిపై పవన్‌ కల్యాణ్‌తోపాటు రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేశ్‌ కూడా స్పందించడం.. ఈ వివాదం వెనుక ఎవరు ఉన్నారనే దానిపై రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి ఆధ్వర్యంలో విచారణ కూడా జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు సోమవారం మాట్లాడుతూ.. అసలు బంద్‌ విషయం ప్రస్తావనకు తెచ్చింది గోదావరి జిల్లాలకు చెందిన జనసేన నేత, సినిమా థియేటర్ల యజమాని అనుశ్రీ సత్యనారాయణేనని ఆరోపించారు.


వాస్తవానికి ఈ వివాదం వచ్చిన తర్వాత సత్యనారాయణ చాలాసార్లు విలేకరులతో మాట్లాడుతూ.. బంద్‌ను వ్యతిరేకించారు. పైగా ఆయన పవన్‌ కల్యాణ్‌కు బాగా సన్నిహితుడు. పార్టీ ఆవిర్భావం నుంచి జనసేనలోనే ఉన్నారు. 2019 ఎన్నికల్లో రాజమండ్రి సిటీ నుంచి పార్టీ అభ్యర్థిగా కూడా పోటీ చేశారు. అప్పటి నుంచి నియోజకవర్గ ఇన్‌చార్జిగాకొనసాగుతున్నారు. ఆయన సస్పెన్షన్‌ చర్చనీయాంశమైంది.

రాజమహేంద్రవరం (ఆంధ్రజ్యోతి)

Updated Date - May 28 , 2025 | 04:45 AM