అమెరికాలో మన సినిమాలకు దెబ్బ
ABN , Publish Date - May 06 , 2025 | 05:29 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాజాగా విదేశీ సినిమాలపై కొరడా ఝళిపించారు. అమెరికాలో నిర్మించని సినిమాలపై 100 శాతం సుంకాలను విధించనున్నట్టు పేర్కొన్నారు. హాలీవుడ్ ప్రస్తుతం సంక్షోభంలో...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాజాగా విదేశీ సినిమాలపై కొరడా ఝళిపించారు. అమెరికాలో నిర్మించని సినిమాలపై 100 శాతం సుంకాలను విధించనున్నట్టు పేర్కొన్నారు. హాలీవుడ్ ప్రస్తుతం సంక్షోభంలో ఉందని.. నానాటికీ ఇబ్బందుల్లో కూరుకుపోతోందని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. ‘‘అమెరికా సినీ పరిశ్రమ అత్యంత వేగంగా మరణానికి చేరువ అవుతోంది’’ అని సంచలన వ్యాఖ్య చేశారు.
‘‘విదేశీ గడ్డపై నిర్మించిన సినిమాలకు తక్షణమే 100 శాతం సుంకాలు విధించాలని నిర్ణయించా. వాణిజ్య విభాగం, వ్యాపార ప్రతినిధులు తగు విధంగా చర్యలు తీసుకోవాలి. అన్ని సినిమాలకూ ఇది వర్తిస్తుంది. మనం కోరుకునేది.. అమెరికాలోనే మళ్లీ సినిమా నిర్మాణాలు జరగాలి’’ అంటూ తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో పోస్టు చేశారు.
కొరవడిన స్పష్టత
అమెరికాలో విడుదల చేసే విదేశీ చిత్రాలకే ఈ టారి్‌ఫలు అమలు చేస్తారా? లేక విదేశాల్లో నిర్మించే అమెరికా సినిమాలపైనే వేస్తారా అన్నదానిపై స్పష్టత కొరవడింది. అయితే హాలీవుడ్ వెలుపల షూటింగ్ చేసే సినిమాలకు, టెలివిజన్ కార్యక్రమాలకు కొన్ని నగరాలు భారీ ఎత్తున పన్ను మినహాయింపులు కల్పిస్తున్నాయి. దీంతో ఇటీవల చాలా నిర్మాణ సంస్థలు తమ కార్యకలాపాలను హాలీవుడ్ నుంచి టొరంటో(కెనడా), డబ్లిన్(ఐర్లాండ్) వంటి నగరాలకు తరలించాయి. ఈ క్రమంలోనే ట్రంప్ తాజా నిర్ణయం తీసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, కారిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసోమ్ స్పందిస్తూ.. తమ రాష్ట్రంలో సినిమాలు తీసేవారికి భారీ పన్ను రాయితీలను పునరుద్ధరిస్తామని ప్రకటించారు.
భారత్‌పై తీవ్ర ప్రభావం
అమెరికాలో మన సినిమాలకు మంచి క్రేజీ ఉంటుంది. చాలా సినిమాలను భారత్‌లో కంటే ఒక రోజు ముందుగానే అక్కడ విడుదల చేస్తారు. రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్‌తో పాటు బాలీవుడ్‌కి చెందిన డుంకీ, జవాన్ చిత్రాలు ఇక్కడ భారీ వసూళ్లు రాబట్టాయి. ఇటీవలె విడుదలైన ‘ఛావా’ కేవలం రెండు వారాల్లో 5 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ సాధించింది. దీన్ని బట్టి అమెరికాలో మన సినిమాల పట్ల ఉన్న క్రేజీ అంతా ఇంతా కాదని అర్థమవుతోంది. ‘‘బాలీవుడ్ సినిమా అయినా టాలీవుడ్ చిత్రమైనా ఓవర్సీస్ కలెక్షన్లపైనే ఆధారపడే రోజులివి. ఇప్పుడు వంద శాతం సుంకాలు అమలైతే భారతీయ చలన చిత్రపరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకమవుతుంది’’ అని ఓ తెలుగు నిర్మాత ఆందోళన వ్యక్తం చేశారు. ఉదాహరణకు బయ్యర్ ఓ భారతీయ సినిమాను ఒక మిలియన్ డాలర్లకు కొన్నాడనుకుందాం. వంద శాతం సుంకాలు అమల్లోకి వస్తే సదరు బయ్యర్ మరో మిలియన్ డాలర్లు అక్కడి ప్రభుత్వానికి చెల్లించాల్సి వస్తుంది. ఇది బయ్యర్‌కు భారమవుతుంది. ఆ భారాన్ని ప్రేక్షకులపై వేస్తాడు. ప్రస్తుతం అమెరికాలో భారతీయులు ఎక్కువగా నివసిస్తున్న రాష్ట్రాల్లో టిక్కెట్ రేట్లు 14 డాలర్ల నుంచి 20 డాలర్ల మధ్య ఉన్నాయి.. వంద శాతం సుంకాలు గనుక అమల్లోకి వస్తే అప్పుడు 14 డాలర్లుగా ఉన్న టిక్కెట్ రేటును 28 డాలర్లకు పెంచక తప్పదు. స్థానిక పన్నుల్ని కూడా కలిపితే కనీస టిక్కెట్ రేటు 30 డాలర్లకు చేరుకుంటుంది. అప్పుడు 30 డాలర్ల టిక్కెట్‌పై స్థానిక పన్నులు, డిస్ట్రిబ్యూటర్ షేర్, థియేటర్ ఓనర్ షేరు పోగా నిర్మాతకు 15 డాలర్లు(50 శాతం) మిగులుతాయి అదే వంద శాతం ట్యాక్స్ అమల్లోకి వస్తే కేవలం 5 నుంచి 10 డాలర్లు మాత్రమే మిగులుతాయి. అంటే ఆదాయం సగానికి పడిపోతుందన్నమాట. తెలుగు సినిమానే ఉదాహరణగా తీసుకుంటే మన నైజాం ఏరియాలో ఓ సూపర్ డూపర్ హిట్ సినిమాకు ఎంత ఆదాయం వస్తుందో దాదాపుగా అంతే ఆదాయం అమెరికాలో షోల ద్వారా నిర్మాతలకు లభిస్తోంది. ‘ట్రంప్ తాజా నిర్ణయంపై వ్యాఖ్యానించడం తొందరపాటే అవుతుంది. ఎందుకంటే గత ముప్పై, నలభై రోజులుగా ఆయన తీసుకుంటున్న అనేక నిర్ణయాలు పలు మార్పులు చేర్పులకు గురయ్యాయి. ఇదీ అంతే అని అనుకుంటున్నాను. ఒక వేళ అమల్లోకి వస్తే అమెరికాలో థియేట్రికల్ బిజినెస్ కుప్పకూలే ప్రమాదముంది’ అని ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు షిబాసిస్ సర్కార్ వ్యాఖ్యానించారు. కాగా, ట్రంప్ నిర్ణయం వల్ల హీరోల రెమ్యూనరేషన్లు, సినిమాల బడ్జెట్లు కూడా తగ్గే అవకాశం ఉంది.
బయ్యర్లలో భయాందోళనలు
ట్రంప్ తాజా ప్రకటనతో ఓవర్సీస్ బయ్యర్లలో ఆందోళన మొదలైంది. ఇప్పటికే చేసుకొన్న ముందస్తు ఒప్పందాల కారణంగా వారు తీవ్రంగా నష్టపోతారు. హరిహర వీరమల్లు, కింగ్‌డమ్, కుబేర, వార్-2, విశ్వంభర వంటి భారీ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. వీటిలో చాలా సినిమాలకు యూఎ్‌సలో డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ కూడా ఖరారైంది ‘‘ట్రంప్ అసంబద్ధ నిర్ణయాలతో ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న భారత చలన చిత్ర రంగం ఒక్కసారిగా కుప్పకూలుతుంది. దీనిని ఎవరూ రక్షించలేరు.’’ అని నిర్మాత వివేక్ అగ్నిహోత్రి వాఖ్యానించారు.
చైనా ఇప్పటికే..
కరోనా అనంతరం అమెరికా చిత్రరంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. సినిమాలు తీసేవారు తగ్గిపోగా.. ధియేటర్‌కు వచ్చి వీక్షించే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టింది. దీనికితోడు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు ప్రజలు అలవాటు పడ్డారు. దీంతో ధియేటర్లు బోసిపోతున్నాయి. ఇక, దీనికితోడు ట్రంప్ అమలు చేస్తున్న వాణిజ్య విధానాలు కూడా సినీ రంగంపై ప్రభావం చూపుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. కాగా, చైనా నెల రోజుల కిందటే అమెరికా సినిమాలపై చర్యలు ప్రారంభించింది. తక్కువ సంఖ్యలోనే అగ్రరాజ్యానికి చెందిన సినిమాలను చైనాలో ప్రదర్శిస్తున్నారు. చైనా మీద కోపంతోనే ట్రంప్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడనే టాక్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.