Vijay Deverakonda: ప్రపంచవ్యాప్తంగా మనకు గుర్తింపు వచ్చింది

ABN , Publish Date - May 03 , 2025 | 05:54 AM

ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమాలకు గౌరవం పెరిగిందని, దక్షిణాది, ఉత్తరాది హీరోలు కలిసి పనిచేస్తే మరింత పెద్ద సినిమాలు వస్తాయని విజయ్‌ దేవరకొండ అభిప్రాయపడ్డారు. భారతీయ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు అందుతున్నందుకు రాజమౌళి, షారుక్ ఖాన్, అల్లు అర్జున్ వంటి ప్రముఖులపైన ఉన్న ప్రభావం గురించి చర్చించారు.

సినిమా- సాఫ్ట్‌ పవర్‌ అనే అంశంపై శుక్రవారం వేవ్స్‌ అంతర్జాతీయ సమావేశంలో జరిగిన చర్చలో - హీరో విజయ్‌ దేవరకొండ, బాలీవుడ్‌ నటి కరీనాకపూర్‌, హిందీ దర్శకుడు కరణ్‌ జోహార్‌ పాల్గొన్నారు. భారతీయ సినిమాలను, కథలను ప్రపంచవ్యాప్తంగా అందరూ గుర్తిస్తున్నారని విజయ్‌ దేవరకొండ పేర్కొన్నారు. ‘‘కశ్మీర్‌.. ముస్సొరీ వంటి ప్రాంతాలకు వెళ్తే అక్కడ చాలా మంది గుర్తుపడుతున్నారు. పదేళ్ల క్రితం దక్షిణాది నటులను ఎక్కువగా గుర్తుపట్టేవారు కాదు. ప్రస్తుతం పరిస్థితులు మారాయి. వారు మమల్ని గుర్తుపడుతున్నారంటే దానికి కారణం సినిమా మాత్రమే! ’’ అని విజయ్‌ అభిప్రాయపడ్డారు. తనకు చిన్నతనం నుంచి అమెరికా గురించి తెలుసునని.. అమెరికాలో ఉన్న 10 ప్రధాన నగరాలు కూడా తెలుసునని.. దానికి కారణం సినిమాలేనని విజయ్‌ పేర్కొన్నారు. దక్షిణాది, ఉత్తరాదికి చెందిన స్టార్స్‌ కలిసి పనిచేస్తే భారీ సినిమాలు వస్తాయన్నారు. ‘‘షారుక్‌ఖాన్‌ సినిమా రూ. వెయ్యి కోట్లు కలెక్ట్‌ చేసింది.. అల్లు అర్జున్‌ ‘పుష్ప’ రూ. వెయ్యి కోట్లు కలెక్ట్‌ చేసింది.. ఇలాంటి ఇద్దరు స్టార్స్‌ కలిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు..’’ అన్నారు. ఆగస్టు నెలలో జూనియర్‌ ఎన్టీఆర్‌, హృతిక్‌ రోషన్‌ నటించిన ‘వార్‌ 2’ సినిమా విడుదల అవుతోందని.. ఉత్తరాది, దక్షిణాది హీరోలు కలిస్తే ఎలా ఉంటుందనే విషయానికి ఇదొక ఉదాహరణగా నిలుస్తుందని కరణ్‌ జోహర్‌ పేర్కొన్నారు. ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమాలకు ఆదరణ పెరిగిందని.. రాజమౌళి లాంటి దర్శకుల సామర్థ్యాన్ని ప్రపంచమంతా గుర్తిస్తోందని కరణ్‌జోహార్‌ పేర్కొన్నారు. ‘‘ప్రస్తుతం దక్షిణాది.. ఉత్తరాది సినిమాలనేవి ఏమి లేదు. భారతీయ సినిమా మాత్రమే ఉంది.


దీనిని అందరూ గుర్తించాలి. అందరూ కలిసినప్పుడే మన భారతీయ సినిమాలను ముందుకు తీసుకువెళ్లగలుగుతాం’’ అన్నారు. భారతీయ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఎప్పటి నుంచో గుర్తింపు ఉందని కరీనా కపూర్‌ పేర్కొన్నారు. ‘‘లండన్‌లో ఒక సారి ట్యాక్సీలో వెళ్తున్నా. ఆ ట్యాక్సీ డ్రైవర్‌ మా తాతగారు రాజ్‌కపూర్‌ సినిమాలోని - ‘మేరా జూతా హై జపానీ..’ పాట హిందీలో పాడి వినిపించాడు. నాకు చాలా గర్వంగా అనిపించింది..’’ అని ఆమె తన అనుభవాన్ని వివరించారు. ప్రముఖ దర్శకుడు స్పీల్‌బర్గ్‌ కూడా మన హిందీ సినిమాలు చూస్తారని కరీనా కపూర్‌ పేర్కొన్నారు.

Updated Date - May 03 , 2025 | 05:58 AM