Hit -3: హిట్టే అంటున్న మేకర్స్...

ABN , Publish Date - May 05 , 2025 | 02:07 PM

విడుదలైన నాలుగు రోజుల్లోనే 'హిట్ -3' రూ. 101 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా డివైడ్ టాక్ తో కూడా స్థాయి ఓపెనింగ్స్ రాబట్టడం విశేషమే.

ఏ నమ్మకంతో అయితే నేచురల్ స్టార్ నాని (Nani), శైలేష్ కొలను (Sailesh Kolanu) 'హిట్ 3' (Hit -3) సినిమా చేశారో ఆ లక్ష్యం నెరవేరిపోయింది. 'హిట్ -3' సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా... నాలుగు రోజుల్లో ఈ సినిమా 101 కోట్ల గ్రాస్ ను వరల్డ్ వైడ్ వసూలు చేసింది. తెలుగుతో పాటు 'హిట్ -3' ఇతర భారతీయ భాషల్లోనూ విడుదలైంది. అంతేకాదు... సినిమా విడుదలకు ముందు కాళ్ళకు బలపాలు కట్టుకుని మరి నాని, హీరోయిన్ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) విశేషంగా ప్రచారంలో పాల్గొన్నారు.

'హిట్, హిట్ -2' తర్వాత దర్శకుడు శైలేష్ కొలను మూడో చిత్రంగా వెంకటేశ్ (Venkatesh) తో 'సైంథవ్' (Saindhav) మూవీని చేశాడు. లాస్ట్ ఇయర్ సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా పరాజయం పాలైంది. అందులోనూ మితిమీరిన హింసను చూపించారనే విమర్శలు వచ్చాయి. దాంతో 'హిట్ -3' స్క్రిప్ట్ విషయంలో శైలేష్ కొలను మరింత పకడ్బందీగా ప్లాన్ చేశాడని, అతన్ని నమ్మిన నాని సరిగ్గా దాన్ని ఎగ్జిక్యూట్ చేశాడని, అదే 'హిట్ -3' సక్సెస్ కు కారణమైందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.


విశేషం ఏమంటే... 'హిట్ -3'లో మితిమీరిన హింస ఉందని కొందరు చెబుతున్నా సినీ రంగ ప్రముఖులు దీనికి లభిస్తున్న స్పందన పట్ల హర్షం వెలిబుచ్చుతున్నారు. నాని స్వయంగా చిన్న పిల్లలను, మరి పెద్దవారినీ ఈ సినిమాకు దూరంగా ఉండమని నిజాయితీగా చెప్పడం కూడా ప్లస్ అయ్యింది. ఇది ఒక వర్గం వారి కోసం తీసిన సినిమా మాత్రమే అని నానీ అండ్ టీమ్ మొదటి నుండి చెబుతూ వచ్చింది. అయినా కూడా నానిలోని సాఫ్ట్ కార్నర్ ను ఇష్టపడే వారికి ఈ మూవీ నచ్చలేదు, ఇంతలా రక్తపాతాన్ని వెండితెరపై పారించాల్సిన పనేమిటని ఎదురు ప్రశ్నించారు. ఇదే సమయంలో మలయాళ చిత్రం 'మార్కో' (Marco), హిందీ సినిమాలు 'యానిమల్ (Animal), కిల్ (Kill)' వంటివి చూసి ఆదరించిన వారు... తెలుగులోనూ అలాంటి బ్లడ్ బాత్ మూవీగా 'హిట్ -3' వచ్చిందని అనుకున్నారు. ఏదేమైనా... మేకర్స్ కోరుకున్నట్టుగా 'హిట్ -3' వంద కోట్ల క్లబ్ లో కేవలం నాలుగు రోజుల్లో చేరిపోయింది. ఇక రెండు వందల కోట్ల క్లబ్ లో చేరడానికి ఎన్ని రోజులు పడుతుందో చూడాలి.

Also Read: Babil Vs Sai rajesh: బాలీవుడ్‌ బాబిల్‌ వివాదం.. సాయిరాజేశ్‌ ఫైర్‌

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 05 , 2025 | 02:52 PM