Minister Kandula Durgesh: హరిహర వీరమల్లుపై ఆ నలుగురి కుట్ర
ABN , Publish Date - May 24 , 2025 | 01:44 AM
హరిహర వీరమల్లు విడుదలను అడ్డుకునేందుకు నాలుగు పెద్ద నిర్మాతలు కుట్ర పన్నారని మంత్రి కందుల దుర్గేష్ హోంశాఖకు ఫిర్యాదు చేశారు. థియేటర్ల మూసివేత వెనుక దాగున్న కుట్రను విచారించాలని కోరారు.
తేల్చాలంటూ హోం శాఖకు ఏపీ మంత్రి కందుల దుర్గేష్ ఫిర్యాదు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమా విడుదలకు ముందే థియేటర్లు మూసివేయాలంటూ నలుగురు పెద్ద నిర్మాతలు ఒత్తిడి చేశారని, వారి సంగతి తేల్చాలంటూ ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ హోం శాఖకు ఫిర్యాదు చేశారు. జూన్ 12న ‘హరిహర వీరమల్లు’ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు మూసి వేయాలనే ఒత్తిడి వెనుక దాగున్న కుట్రను వెలికి తీయాలంటూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజీత్‌కు మంత్రి కందుల దుర్గేష్ ఫిర్యాదు చేశారు. తెలుగులో పెద్ద నిర్మాతలుగా పేరున్న ఆ నలుగురు ఇటీవల ఒక చోట సమావేశం అయ్యారని, వారు పన్నిన కుట్రలో భాగమే థియేటర్ల మూసివేత అని ఫిర్యాదులో పేర్కొన్నారు. స్పందించిన హోంశాఖ ముఖ్య కార్యదర్శి నిష్పక్షపాత దర్యాప్తునకు ఆదేశిస్తామంటూ మాటిచ్చినట్లు సినిమాటోగ్రఫీ వర్గాలు తెలిపాయి. ఆ నలుగురు నిర్మాతల్లో ఒకరు పవన్ కల్యాణ్ సమీప బంధువు కాగా మరొకరు విశాఖపట్నంలో భారీ స్టూడియో నిర్మించిన ప్రొడ్యూసర్, ఇంకొకరు తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్ నుంచి పెద్ద సినిమాలు నిర్మించే స్థాయికి ఎదిగిన నిర్మాతగా సినీ పరిశ్రమలో ప్రచారం జరుగుతోంది. నాలుగో నిర్మాత ఎవరన్నది తేలాల్సి ఉంది.
-అమరావతి (ఆంధ్రజ్యోతి)