Gaddar Awards 2024: గద్దర్‌ తెలంగాణ సినీ పురస్కారాలు 2024

ABN , Publish Date - May 30 , 2025 | 05:56 AM

గద్దర్‌ తెలంగాణ సినీ పురస్కారాలు 2024

Gaddar Awards 2024

ఉత్తమ చిత్రాలు.. కథ కమామిషు

ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ చిత్రాల అవార్డుల్లో ‘కల్కి 2898’, ‘పొట్టేల్‌’, ‘లక్కీ భాస్కర్‌’ సినిమాలు వరుసగా మొదటి, ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నాయి. ఈ మూడూ భిన్నమైన జానర్‌కు చెందినవి. ఒక దానితో మరోదానికి అసలు పోలిక ఉండదు. ఒక సినిమా ప్రేక్షకుల్ని కల్పిత ప్రపంచంలోకి తీసుకెళ్తే, మరొకటి 1970-80 మధ్య కాలంలో తెలంగాణ గ్రామీణ జీవన చిత్రాన్ని ఆవిష్కరింపజేస్తుంది. చివరిది మధ్య తరగతి మనస్తత్వాలను ఎండగడుతుంది.


నిజానికి ఇది చిన్న కథ కాదు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల్లో మూడింటిని సొంతం చేసుకొని మరొక్కసారి అందరి దృష్టిని ఆకర్షించింది ‘35 చిన్న కథ కాదు’ అనే సినిమా. దీన్ని నంద కిశోర్‌ ఇమాని తెరకెక్కించారు. రానా దగ్గుబాటి, సృజన్‌ యరబోలు, సిద్ధార్థ్‌ రాళ్లపల్లి నిర్మించారు. ఉత్తమ బాలల చిత్రంగా ఎంపికవడంతో పాటు ఇందులో నటించిన నివేదా థామస్‌ ఉత్తమ నటిగా, మాస్టర్‌ అరుందేవ్‌ పోతుల, బేబీ హారిక ఉత్తమ బాల నటులుగా అవార్డులు కైవసం చేసుకున్నారు. పాటలు, యాక్షన్‌, రొమాన్స్‌ వంటి కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉంటేనే సినిమా కాదని, మంచి కంటెంట్‌ ఉన్న చిన్న సినిమా సైతం సూపర్‌ హిట్‌ అవుతుందని ఈ చిత్రం నిరూపించింది. నిజానికి ఇది చిన్న కథ కాదు. చాలా పెద్ద కథ. ఇందులో పిల్లలతోపాటు తల్లిదండ్రులు, సమాజం నేర్చుకోవాల్సిన ఎన్నో విషయాలను చర్చించారు. ప్రస్తుత విద్యా విధానం ఎలా ఉంది? ఎలా సాగితే పిల్లలకు ఉపయోగం అని తెలియజేసే సినిమా ఇది. ఈ చిత్రానికి ఉత్తమ కేటగిరీలో మూడు అవార్డులు రావడం చిన్న సినిమాకు లభించిన పెద్ద గౌరవం అనే చెప్పాలి.


ఆర్థిక మోసాల నేపథ్యం

1990 నాటి ఆర్థిక మోసాల నేపథ్యంలో వచ్చిన చిత్రం ‘లక్కీ భాస్కర్‌’. తెలుగు తెరపై ఈ తరహా కథ ఇప్పటి వరకు రాలేదనే చెప్పాలి. బాగా చదువుకున్న వారికి కూడా అర్థం కాని బ్యాంకింగ్‌ మోసాలను సాధారణ మధ్యతరగతి ప్రజలకు సైతం అర్థమయ్యేలా దర్శకుడు వెంకీ అట్లూరి తెరపై అద్భుతంగా ఆవిష్కరించారు. బ్యాంకింగ్‌ వ్యవస్థ, స్టాక్‌ మార్కెట్‌, మధ్య తరగతి మనస్తత్వాలు.. ఈ మూడింటినీ మేళవిస్తూ చిత్ర కథ సాగుతుంది. కథ, పాత్రలు, తెరపై సన్నివేశాలు అన్నీ ప్రేక్షకులకు సులభంగా కనెక్ట్‌ అయ్యేలా ఉంటాయి. ముఖ్యంగా ఈ చిత్రానికి సంభాషణలు బాగా ప్లస్‌ అయ్యాయి. ‘ఒక రోజులో అరగంట నాకు నచ్చినట్టుగా సాగలేదని, రోజంతా ఏడుస్తూ కూర్చోవాలా’, ‘గెలుపు తర్వాత ఓటమి, ఓటమి తర్వాత గెలుపు’ వంటి సంభాషణలు ప్రేక్షకుల్ని ఆలోచింపజేస్తాయి.

చదువు గొప్పదనాన్ని చాటింది

తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో ఒకప్పుడు రాజ్యమేలిన పటేల్‌ వ్యవస్థలో ప్రజల జీవన విధానాన్ని ‘పొట్టేల్‌’ చిత్రంలో చక్కగా తెరకెక్కించారు దర్శకుడు సాహిత్‌. 1970-80 మధ్య కాలంలో సాగే కథ ఇది. గ్రామ పటేల్‌ని ఎదిరించి తన కూతుర్ని చదివించుకోవాలనుకునే ఓ తండ్రి తపన, తాపత్రయాన్ని తెరపై చక్కగా ఆవిష్కరించారు. పటేళ్ల పెత్తనం, మూఢ నమ్మకాలు, సమాజంలో ఉన్న అసమానతలను కళ్లకు కట్టినట్లు చూపిస్తూనే దర్శకుడు చదువు గొప్పదనాన్ని చాటి చెప్పాడు.


హాలీవుడ్‌ స్థాయిలో విజువల్స్‌

ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. మన పురాణాల ప్రకారం మహా విష్ణువు పదో అవతారమే కల్కి. కలియుగం చివరి పాదంలో దేవుడు కల్కి రూపంలో వచ్చి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసి అవతారం చాలిస్తాడని చెబుతున్నాయి. ఈ పాయింట్‌నే దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ప్రధాన ఇతివృత్తంగా ఎంచుకొని అద్భుతమైన కథ సృష్టించారు. దానికి సాంకేతికత జోడించి ‘కల్కి 2898 ఏడీ’ని రూపొందించారు. ఈ చిత్రంలో కాశీ, కాంప్లెక్స్‌, శంబాలా అనే మూడు ప్రపంచాలు ఉంటాయి. ఈ మూడింటి మధ్య జరిగే కథే ఈ సినిమా. ఇందులో విజువల్స్‌ని హాలీవుడ్‌ చిత్రాలకు ఏ మాత్రం తగ్గకుండా తెరకెక్కించారు. హాలీవుడ్‌ సినిమాల స్ఫూర్తితో కూడిన పాత్రలు, కల్పిత ప్రపంచాలు ఈ సినిమాలో మనకు కనిపిస్తాయి.

ప్రభుత్వ గుర్తింపు ఎంతో విలువైనది

గద్దర్‌ సినీ పురస్కారాలకు ఎంపికైన వారందరికీ హృదయపూర్వక అభినందనలు. రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు ఎంతో విలువైనది. సృజనాత్మక రంగంలో ఉన్న నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఎంతగానో ప్రేరణనిస్తుంది. ఒక గొప్ప అద్భుత సంప్రదాయాన్ని తెలంగాణ ప్రభుత్వం పునరుద్ధరించడం, ఇండస్ట్రీకి గొప్ప ప్రోత్సాహాన్ని ఇస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు, అధికారులు, అవార్డుల కమిటీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా.

చిరంజీవి


అభిమానులకు అంకితం

తొలిసారి ప్రకటించిన ‘గద్దర్‌ తెలంగాణ సినీ పురస్కారాలు 2024’లో ఉత్తమ నటుడి పురస్కారం నాకు దక్కినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇది నాకు దక్కిన నిజమైన గౌరవం. అందుకు తెలంగాణ ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ‘పుష్ప 2’ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా నన్ను ఎంపికచేసినందుకు సంతోషంగా ఉంది. దర్శకుడు సుకుమార్‌, నిర్మాతలతో పాటు ‘పుష్ప 2’ చిత్రబృందానికి ఈ ఘనత దక్కుతుంది. అలాగే నా అభిమానుల ప్రోత్సాహమే ప్రతిసారి నాలో స్ఫూర్తిని నింపుతోంది. అందుకే ఈ పురస్కారాన్ని వారికి అంకితమిస్తున్నా.

అల్లు అర్జున్‌

విజేతలకు అభినందనలు

చిత్ర పరిశ్రమను ప్రోత్సహించేందుకు ఈ ఏడాది నుంచి తెలంగాణ ప్రభుత్వం సినీ పురస్కారాలను ఇవ్వడం మంచి పరిణామం. ‘గద్దర్‌ తెలంగాణ సినీ పురస్కారాలు-2024’ విజేతలందరికీ అభినందనలు. ‘దేవర’ చిత్రానికి నృత్యరీతులు సమకూర్చిన గణేశ్‌ ఆచార్య ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా ఎంపికైనందుకు ఆనందంగా ఉంది.

ఎన్టీఆర్‌


గద్దర్‌ సినీ పురస్కారాల్లో మా ‘లక్కీ భాస్కర్‌’ చిత్రం ఏకంగా నాలుగు విభాగాల్లో అవార్డులను దక్కించుకున్నందుకు ఆనందంగా ఉంది. ఇది చిత్రబృందానికి గర్వకారణం. ఈ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు, తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు.

సూర్యదేవర నాగవంశీ

మా ‘కమిటీ కుర్రాళ్లు’ చిత్రబృందానికి ఇది గొప్ప విజయం. ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రం, ఉత్తమ నూతన దర్శకుడు పురస్కారాలు దక్కడం ఆనందాన్నిచ్చింది. ఇది మా గుర్తింపును, గౌరవాన్ని మరింత పెంచింది.

నిహారిక కొణిదెల

‘కల్కి 2898 ఏడీ’ చిత్రబృందానికి ఇవి గర్వకారణమైన క్షణాలు. గద్దర్‌ సినీ పురస్కారాలు 2024లో ఉత్తమ చిత్రంగా నిలిచినందుకు ఎంతో ఆనందంగా ఉంది. వైజయంతీ మూవీస్‌ సుదీర్ఘ సినీ ప్రయాణానికి దక్కిన మరో గొప్ప గౌరవం ఇది. తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు.

వైజయంతి మూవీస్‌

మా బేనర్‌లో తెరకెక్కిన ‘ఆయ్‌’ సినిమాకు ఉత్తమ ప్రజాధరణ చిత్రంగా, ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్‌’ చిత్రానికి గాను ఉత్తమ సహాయనటిగా శరణ్య ప్రదీ్‌పకు పురస్కారాలు దక్కినందుకు ఆనందంగా ఉంది. ఈ క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేం.

గీతా ఆర్ట్స్‌ 2

గద్దర్‌ సినీ పురస్కారాలు - 2024లో ‘క’ చిత్రానికి గాను స్పెషల్‌ జ్యూరీ పురస్కారానికి ఎంపికవడం మాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాం.

దర్శకులు సందీప్‌, సుజిత్‌

Updated Date - May 30 , 2025 | 06:29 AM