సారీ సార్ షో లేదు
ABN , Publish Date - May 22 , 2025 | 06:21 AM
ఐదేళ్ల క్రితం 3500 వరకూ ఉన్న సింగిల్ స్ర్కీన్లు ఇప్పుడు 1300కు తగ్గిపోయాయి. సమీప భవిష్యత్‌లోనూ ఈ పరిస్థితి మారేలా కనిపించడం లేదు. థియేటర్లలో సినిమాలు చూసే ప్రేక్షకుల సంఖ్య తగ్గడం ఓ కారణమైతే, వసూళ్లలో...
పెద్ద సినిమా వసూళ్లలో వాటాపైనే ఎగ్జిబిటర్ల ఆశలు
అద్దె అయితే రూ. వేలల్లో, వాటా అయితే రూ. లక్షల్లో ఆదాయం
మల్టీప్లెక్స్‌ల బాటలోనే ఆదాయాన్ని పంచాలంటున్న ఎగ్జిబిటర్లు
నేడు తుది నిర్ణయం
‘ఇకపై సినిమా ప్రదర్శనలకు అద్దె ప్రాతిపదికన థియేటర్లను ఇవ్వడం ఆపేస్తున్నాం. సినిమాకు వచ్చిన వసూళ్లను బట్టి వాటాలు పంచాలి. ఈ ఒప్పందానికి నిర్మాతలు, పంపిణీదారులు అంగీకరిస్తే సరే. లేదంటే జూన్ 1 నుంచి థియేటర్లను మూసేస్తాం’... ఇదీ ఇటీవలే రెండు తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు హైదరాబాద్‌లో సమావేశమై తీసుకున్న నిర్ణయం. ఆకాశాన్నంటిన అగ్రతారల పారితోషికాలు, పాన్ ఇండియా పేరుతో తడిసి మోపడవుతున్న నిర్మాణ వ్యయం, థియేటర్లపై ప్రేక్షకుల శీతకన్ను లాంటి సమస్యలతో ఇప్పటికే ఇండస్ట్రీ కుదేలైంది. సమ్మెకు ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్లైంది.
మిగులుతుంది అని ఎగ్జిబిటర్లు అసంత ృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఐదేళ్ల క్రితం 3500 వరకూ ఉన్న సింగిల్ స్ర్కీన్లు ఇప్పుడు 1300కు తగ్గిపోయాయి. సమీప భవిష్యత్‌లోనూ ఈ పరిస్థితి మారేలా కనిపించడం లేదు. థియేటర్లలో సినిమాలు చూసే ప్రేక్షకుల సంఖ్య తగ్గడం ఓ కారణమైతే, వసూళ్లలో న్యాయమైన భాగం తమకు దక్కకపోవడం వల్ల నష్టాలు వచ్చి సింగిల్ స్ర్కీన్లు మూసేయాల్సి వస్తోందనేది ఎగ్జిబిటర్ల వాదన. తమకు రాబడి పెరిగితే థియేటర్లను మూసేయకుండా ఎలాగోలా నెట్టుకొస్తామని ఎగ్జిబిటర్లు చెబుతున్నారు. వసూళ్లలో వాటాల విధానం వల్ల ఇరుపక్షాలు లాభపడడమే కాదు ఇండస్ట్రీ కూడా పదికాలాలు పచ్చగా ఉంటుందని వారు అంటున్నారు. చాలాకాలంగా మల్టీప్లెక్స్‌ల్లో వాటాల విధానమే అమల్లో ఉంది. ఒప్పందాన్ని బట్టి వచ్చిన వసూళ్లలో 45-55 లేదా 40-60 నిష్పత్తిలో పంచుకుంటున్నారు. ఇప్పుడు ఇదే విధానాన్ని తమకి కూడా వర్తింపజేయాలనేది సింగిల్ ీస్క్రన్ల యజమానుల డిమాండ్.
టికెట్ రేట్లు పెంచినా అద్దె పెరగలేదు
సినిమాకు వసూళ్లు ఎంత వచ్చినా థియేటర్ల అద్దెను మాత్రం నిర్మాతలు, పంపిణీదారులు పెంచడం లేదని, ప్రభుత్వాల నుంచి జీవోలు తెచ్చుకొని టికెట్ ధరలు భారీగా పెంచుకొని వారు లాభపడుతున్నారని. అందులో తమకు మాత్రం ఎలాంటి వాటా దక్కడం లేదని థియేటర్ల యజమానులు వాపోతున్నారు. ‘పెద్ద సినిమాలకు వచ్చిన వసూళ్లను నిర్మాతలు, పంపిణీదారులు పూర్తిగా తమ జేబుల్లో వేసుకుంటున్నారని. ఇదే విధానం కొనసాగితే మున్ముందు మరిన్ని సింగిల్ స్ర్కీన్లు మూతపడడం ఖాయమని చెబుతున్నారు. ‘తాము కూర్చున్న కొమ్మనే వారు నరుక్కుంటున్నారు. అదనపు షోలు, బెనిఫిట్ షోల వల్ల మాకు పైసా ఆదాయం లేదు. టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వాల నుంచి జీవోలు తెచ్చుకుంటున్న నిర్మాతలు థియేటర్ల అద్దెను మాత్రం పెంచడం లేదు’ అని ఎగ్జిబిటర్లు చెబుతున్నారు. షేరింగ్ విధానంలో అయితేనే థియేటర్లను ఇస్తామని లేదంటే థియేటర్లను మూసేస్తాం తప్ప అద్దె విధానంలో మాత్రం ఆడించం అని ఇప్పటికే గోదావరి జిల్లాల్లో థియేటర్ల యజమానులు తేల్చిచెప్పారు. ఈ విషయం మీద ఇప్పటికే పలు సార్లు చర్చలు జరిగాయి. గురువారం జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.
పంపిణీదారుడిదే పై చేయి
ఒప్పంద పత్రంలోనే పంపిణీదారులు తమకు అనుకూలంగా ఉండేలా రెంట్/పర్సంటేజీ విధానంలో చెల్లింపులు అని రాసుకుంటున్నారు. అవకాశాన్ని బట్టి దాని అర్థాన్ని అన్వయించుకుంటున్నారు. ఒక పెద్ద సినిమా విడుదలై రూ. 40 లక్షల వసూళ్లు వస్తే ఎగ్జిబిటర్‌కు రూ. లక్ష ఇస్తున్నారు. రూ. 39 లక్షలు నిర్మాతలు, పంపిణీదారులు తీసుకుంటున్నారు. అక్కడ అద్దె విధానంలో లెక్క గట్టి చెల్లింపులు చేస్తున్నారు. అదే ఏదైనా చిన్న సినిమాకు రూ. 40 వేల వసూళ్లు వస్తే మాత్రం రూ. 20 వేలు ఇస్తున్నారు. అదేమంటే 50-50 పర్సంటేజీ అంటున్నారు. ప్రింట్ సిస్టమ్ ఉన్నప్పుడు ఎగ్జిబిటర్ నష్టపోతే ఆ నష్టపోయిన సొమ్మును కట్టి పంపిణీదారుడు తన ప్రింట్ తీసుకెళ్లేవాడు. ఇప్పుడు ఆ అవకాశమూ ఎగ్జిబిటర్లకు లేదు.
12 టికెట్లు తెగితేనే షో
‘ఈ ఏడాది సంక్రాంతి పండుగ తర్వాత పైసా ఆదాయం చూడలేదు. ఫిబ్రవరి నుంచి విపరీతమైన నష్టాలు వస్తున్నాయి. నెల నెలా రెండు మూడు లక్షల రూపాయల వరకూ నష్టపోతున్నాం. అదే వాటాల విధానంలో అయితే సినిమా దెబ్బతిన్నా ఎంతో కొంత చేతికొస్తుంది’ అంటున్నారు ఎగ్జిబిటర్లు. ‘హైదరాబాద్‌లోని మెయిన్ థియేటర్లలో సైతం 12 టికెట్లు తెగితేనే షో వేస్తున్నాం. లేకపోతే వేయడం లేద’ని ఓ సీనియర్ ఎగ్జిబిటర్ చెప్పారు. ‘కనీసం పదిమంది పైన వస్తేనే షో వేస్తాం లేదంటే వేయం’ అని ప్రేక్షకులకు ముందే చెప్పి టికెట్లు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. షో పడకపోతే డబ్బు వాపసు ఇస్తున్నారు. షో పడుతుందో లేదో అనే సందేహంతో అరగంట ముందే ఏసీ వేస్తే వృథా అవుతుందని ఆపుతున్నామని వారు చెప్పారు.
ఇటీవలే ఓ అగ్ర కథానాయిక నిర్మించిన లో బడ్జెట్ చిత్రం విడుదలైంది. ఆ సినిమా ఒక థియేటర్‌లో 8 రోజులు నడిస్తే జనాల్లేక 17 ఆటలు బంద్ చేశారు. అంటే రోజూ రెండు షోలు రద్దయ్యాయి. హైదరాబాద్‌లోని మెయిన్ సెంటర్లలో ఉన్న థియేటర్లలో ప్రదర్శనకు కనీసం 12 మంది ప్రేక్షకులు కూడా రావడం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మల్టీప్లెక్స్‌లో కూడా ఇదే పరిస్థితి. వాటికి రోజుకు ఐదు షోలకు అనుమతులు ఉన్నా అందులో సగం షోలు కూడా పడట్లేదు. మల్టీప్లెక్స్‌ల్లో బుకింగ్ కౌంటర్ దగ్గరకు వెళ్లిన ప్రేక్షకులకు ‘సారీ సార్ షో లేదు’ అనే సమాధానం తరచూ ఎదురవుతోంది.
నేడు తుది నిర్ణయం
ముందు కనీసం రెండు మూడు నెలలయినా పర్సంటేజీ విధానంలో ఆడించి చూస్తే అవగాహన వస్తుంది. బాగుంటే ఫర్వాలేదు లేదంటే సూపర్‌మార్కెట్లకో, గోడౌన్లకో కిరాయికి ఇచ్చుకోక తప్పదంటున్నారు ఎగ్జిబిటర్లు. బుధవారం డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు విడివిడిగా సమావేశమయ్యారు. డిస్ట్రిబ్యూటర్ల సమావేశంలో షేరింగ్ విధానంపై ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం. తొందపడి ఓ నిర్ణయానికి రావొద్దు, సావధానంగా చర్చించి ఓ నిర్ణయానికి వద్దాం అని పంపిణీదారులు ఎగ్జిబిటర్లను కోరారు. నిర్మాత దిల్‌రాజు, సురేశ్‌బాబు, నాగవంశీ, దానయ్య, సునీల్ నారంగ్, ఏఎం రత్నం తదితరులు సమావేశమై ఎగ్జిబిటర్ల సమస్యలపై చర్చించారు. పరిశ్రమకు చెందిన అన్ని విభాగాలతో ఓ కమిటీ వేసి, అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకోవాలని నిర్మాతలు ప్రతిపాదించారు. నిర్మాతల మండలి గురువారం మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకోనుంది. తర్వాత రెండు మూడు రోజుల్లో నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్ల ఉమ్మడి సమావేశం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నేతృత్వంలో జరుగుతుంది. ఆ సమావేశం పూర్తయ్యాకనే మీడియా ముందుకొచ్చి వివరాలను ప్రకటించాలని, అప్పటివరకూ ఎక్కడా దీనిపై స్పందించకూడదనిని నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు, నిర్ణయం తీసుకున్నారు.
ఇటీవలే ఓ యువ హీరో నిర్మించిన మిడ్‌రేంజ్ సినిమా విడుదలైంది. 50-50 పర్సంటేజీ విధానంలో ఆ హీరో, పంపిణీదారుడు కలసి ఎగ్జిబిటర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. తొలి రోజు ఆటకు రూ. 4 లక్షల చొప్పున వసూళ్లు వచ్చాయి. ఒప్పందం ప్రకారం చెరో రెండు లక్షలు తీసుకోవాలి. కానీ వసూళ్లు ఎక్కువగా వచ్చాయని చెప్పి ఎగ్జిబిటర్‌కు రూ. లక్ష చేతులో పెట్టి రూ. 3 లక్షలు డిస్ట్రిబ్యూటర్ తీసుకున్నారు. చేసేదేం లేక ఎగ్జిబిటర్ మిన్నకున్నాడు.
హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ థియేటర్‌లో పెద్ద హీరో సినిమాకు బెనిఫిట్ షో వేస్తే రూ. 13 లక్షల వసూళ్లు వచ్చాయి. కానీ థియేటర్ యజమానికి మాత్రం ఒప్పందం ప్రకారం ఆటకు రూ. 20 వేలు చొప్పున కిరాయి మాత్రమే దక్కింది. మిగిలిన సొమ్మంతా డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల చేతికివెళ్లింది. అదే 40 శాతం వాటా గనుక ఇస్తే రూ. 5 లక్షల వరకూ ఎగ్జిబిటర్‌కు వస్తాయి. అంతా నిర్మాతలు, పంపిణీదారులకే దక్కితే మాకేం మిగులుతుంది అని ఎగ్జిబిటర్లు అసంత ృప్తి వ్యక్తం చేస్తున్నారు.