Cine week : ప్రతి శనివారం ఇక సినీ వారం
ABN, Publish Date - Feb 23 , 2025 | 04:57 AM
సర్వ కళల సమాహారం సినిమా.. తెరపై తమ పేరు చూసుకోవాలనుకునే కళాకారుల చిరకాల ఆకాంక్షను నెరవేర్చుకోవాలంటే ఎక్కడో సాయం అందాలి.. సినీ రంగం వైపు అడుగులు వేస్తున్న...
సర్వ కళల సమాహారం సినిమా.. తెరపై తమ పేరు చూసుకోవాలనుకునే కళాకారుల చిరకాల ఆకాంక్షను నెరవేర్చుకోవాలంటే ఎక్కడో సాయం అందాలి.. సినీ రంగం వైపు అడుగులు వేస్తున్న ఔత్సాహికుల కళాత్మకతను, సృజనాత్మకతను గుర్తించే వారుండాలి. ఈ ప్రయత్నంలో ఉన్న వారికి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ మంచి అవకాశం కల్పిస్తోంది. రవీంద్రభారతిలోని థియేటర్‌కు పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ గా నామకరణం చేసి యువతరం తీసిన షార్ట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీలను ఈ వేదికపై ప్రదర్శింపజేస్తున్నారు.
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సంచాలకుడు మామిడి హరికృష్ణ నేతృత్వంలో 2016లో సినివారం పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ‘ప్రతి శనివారం సినివారం’ పేరిట ప్రారంభమైన ఈ వేదికపై వందలాది లఘు చిత్రాలను ప్రదర్శించారు. తెలుగు సినిమా రంగానికి చెందిన దిగ్గజ దర్శకులను ఆహ్వానించి ఈ వేదికపై చర్చా గోష్టి నిర్వహించారు. ప్రముఖ దర్శకులు శేఖర్ కమ్ముల, వంశీ పైడిపల్లి, హరీష్ శంకర్, ఎన్.శంకర్, నర్సింగరావు, తరుణ్ భాస్కర్, వేణు ఊడుగుల, ప్రవీణ్ సత్తారు, శ్రీనాథ్, సందీప్ రెడ్డి వంగా, సంకల్ప్ రెడ్డి, వీ.ఎన్.ఆదిత్య, బాహుబలి రచయిత విజయేంద్రప్రసాద్ వంటి ప్రముఖలతో ఔత్సాహిక కళాకారులతో ఇంటరాక్షన్ నిర్వహించారు. ఈ ప్రయాణంలో భాగంగా సినివారం ఇప్పుడు 3వ వెర్షన్‌ను పునః ప్రారంభించింది.
సినివారం టు సినిమా దర్శకులుగా..
సినివారం వేదికగా తమ షార్ట్ ఫిల్మ్‌లను ప్రదర్శించిన వారు పెద్ద సినిమాలతో దర్శకులుగా తెలుగు చిత్రసీమకు పరిచయం అయ్యారు. ఇప్పటివరకూ 15మంది దర్శకులు సినీ ఇండస్ట్రీకి పరిచయం కావడం విశేషం. వీరి ఫోటోలు పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ హాల్‌లో ఏర్పాటు చేశారు. తరుణ్‌భాస్కర్ (పెళ్ళిచూపులు), కేవీఆర్ మహేంద్ర(దొరసాని), సాహిత్ మోత్కూర్ (సవారి), ఉదయ్ గుర్రాల (మొయిల్), బడుగు విజయ్‌కుమార్ (తమసోమ జ్యోతిర్గమయా), వేణు ముల్కల (విశ్వక్), సంపత్ కుమార్ (సూరాపానం), గంగాధర్ అద్వైత (సురభి 70ఎంఎం), సూర్యతేజ(ఫోకస్), ధ్రువ (కిరోసిన్), జాన్ జక్కి (2020గోల్‌మాల్), అక్షరకుమార్ (షరతులు వర్తిస్తాయి), నవీన్ కుమార్ గట్టు (శరపంజరం) వంటి వారు తెలుగు సినిమా రంగానికి దర్శకులుగా పరిచయమయ్యారు.
సినివారం కోసం సంప్రదించండిలా..
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రతి శనివారం సినివారం పేరిట రవీంద్రభారతిలోని పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్‌లో లఘు చిత్రాలను ప్రదర్శిస్తారు. దీని కోసం రవీంద్రభారతి ప్రాంగణంలోని భాషా సాంస్కృతిక కార్యాలయంలో సంప్రదించవచ్చు. తమ సినిమా వివరాలతో అక్కడ నమోదు చేసుకోవాలి. లఘు చిత్రాల సంఖ్యను బట్టి ప్రతి శనివారం ఒకటి లేదా రెండు సినిమాలు ప్రదర్శిస్తారు. అక్కడికి రెగ్యులర్‌గా వచ్చే ప్రేక్షకులతో పాటు సినిమాకు సంబంధించిన ప్రేక్షకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. కార్యాలయంలో నమోదు చేయడం కుదరని వారు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నమోదు చేసుకోవచ్చు.
రవీంద్రభారతి (ఆంధ్రజ్యోతి)
సినిమా కలను సినివారంతో సాకారం చేసుకోండి
సినిమాలు, కళల ద్వారా మన సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవించే ప్రతిభావంతుల కోసం సినివారం తలుపులు తెరిచి ఉంటాయి. మీ చలన చిత్రాలకు వేదికనందించి మీ సృజనాత్మకతను ప్రపంచానికి పరిచయం చేస్తాం. ప్రస్తుతం తెలంగాణ నేపథ్యమున్న కథలు, సినిమాలు...కళాకారులు, టెక్నిషియన్‌లు విజయాలు సొంతం చేసుకుంటున్నారు. తెలంగాణ ప్రతిభ లక్ష్యంగా 2016లో సినివారం ప్రారంభించాం ఈ ఎనిమిదేళ్లలో వందల లఘు చిత్రాలను తెరపై ప్రదర్శించడంతో పాటు సినీ రంగ నిపుణులతో నేరుగా పరిచయం చేసే కార్యక్రమాలు చేపట్టాం
మామిడి హరికృష్ణ, సాంస్కృతిక శాఖ సంచాలకుడు
ఈ వార్తలు కూడా చదవండి...
Read Latest AP News And Telugu News