సినిమా వాళ్ల నట్లు, బోల్టులు టైట్‌ చేస్తా

ABN , Publish Date - Mar 04 , 2025 | 06:11 AM

శాండల్‌వుడ్‌ నటీ నటులపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నడ భూమి, భాషను నటీనటులు పట్టించుకోవడం లేదని, అలాంటి వాళ్ల నట్లు, బోల్ట్‌లు...

సినిమా వాళ్ల నట్లు, బోల్టులు టైట్‌ చేస్తా

- కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌

శాండల్‌వుడ్‌ నటీ నటులపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నడ భూమి, భాషను నటీనటులు పట్టించుకోవడం లేదని, అలాంటి వాళ్ల నట్లు, బోల్ట్‌లు టైట్‌ చేస్తానని హెచ్చరించారు. బెంగళూరులో జరుగుతున్న చలనచిత్రోత్సవంలో అనేక మంది శాండల్‌వుట్‌ నటీ నటులు పాల్గొనడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. విధానసౌధలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘రాష్ట్రానికి అన్యాయం జరిగినప్పుడు ఇండస్ట్రీ నుంచి ఎవరూ మద్దతు ఇవ్వడం లేదు. మన నీరు, మన హక్కు పోరాటంలో సినిమా వాళ్లెవరూ పాల్గొనలేదు’ అని అన్నారు. దీంతో సోషల్‌ మీడియాలో వ్యతిరేకత రావడాన్ని గమనించిన డీకే తన వ్యాఖ్యలను సమర్ధించుకుంటూ ‘ సినిమా ప్రముఖులు ఏమి కావాలంటే అది చేసుకోని, ధర్నాలు చేసినా ఫర్వాలేదు. నా మాటల్లో నిజాలున్నాయి’ అని అన్నారు. డిప్యూటీ సీఎం వ్యాఖ్యలను కర్ణాటక ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు నరసింహులు ఖండించారు. ఆయన అధికార దర్పంతో అలా అని ఉండవచ్చని అన్నారు.



రష్మికకు గుణపాఠం చెప్పాల్సిందే

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రవిగౌడ గణిగ

కర్ణాటకలో జన్మించి, కిరిక్‌ పార్టీ సినిమా ద్వారా నటిగా వృత్తిని ప్రారంభించిన రష్మికా మందన్న, కన్నడ అంటే తెలియదని చేసిన వ్యాఖ్యలపై మండ్య జిల్లా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రవిగౌడ గణిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెకు తగిన గుణపాఠం చెప్పాల్సిందేనని అన్నారు. విధానసౌధలో సోమవారం మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ, గత ఏడాది చలనచిత్రోత్సవాలకు రష్మికను ఆహ్వానించామని, సమయం లేదని చెప్పి ఆమె హాజరు కాలేదన్నారు. ఓ ఎమ్మెల్యే రష్మిక ఇంటికి 10-12 సార్లు వెళ్లి ఆహ్వానించారని అన్నారు. ‘హైదరాబాద్‌లో నివసిస్తున్నా, అక్కడికి రాలేను’ అంటూ పరుషంగా సమాధానమిచ్చారని చెప్పారు. కాగా, రష్మిక వ్యాఖ్యలపై కర్ణాటక రక్షణ వేదిక (కరవే) అధ్యక్షులు నారాయణగౌడ తీవ్రంగా మండిపడ్డారు.

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి)


Updated Date - Mar 04 , 2025 | 06:11 AM