పవన్‌ కల్యాణ్‌ మాకు పెద్దన్న ఆయన తిట్టినా పడతాం

ABN , Publish Date - May 27 , 2025 | 03:18 AM

‘‘కొవిడ్‌లో తప్పితే అంతకుముందెన్నడూ థియేటర్లను బంద్‌ చేయలేదు. ‘జూన్‌ 1 నుంచి థియేటర్లు బంద్‌’ అనే విషయం ప్రజల్లోకి తప్పుగా వెళ్లింది. ఈ విషయంలో చొరవ తీసుకుని వివాదానికి తెరదించిన ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి...

‘‘కొవిడ్‌లో తప్పితే అంతకుముందెన్నడూ థియేటర్లను బంద్‌ చేయలేదు. ‘జూన్‌ 1 నుంచి థియేటర్లు బంద్‌’ అనే విషయం ప్రజల్లోకి తప్పుగా వెళ్లింది. ఈ విషయంలో చొరవ తీసుకుని వివాదానికి తెరదించిన ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్‌కి కృతజ్ఞతలు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ నటించిన ‘హరిహర వీరమల్లు’ చిత్రాన్ని ఆపే దమ్ము ఎవ్వరికీ లేదు. ఇకనైనా ఈ సమస్యను ముగిద్దాం’’ అని తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్‌, నిర్మాత దిల్‌రాజు హితవు పలికారు. థియేటర్ల బంద్‌ విషయంతో పాటు ఏపీ ప్రభుత్వం, సినీ పరిశ్రమ మధ్య నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘‘ఏప్రిల్‌ 19న తూర్పు గోదావరిలోని పంపిణీదారులు, ఎగ్జిబిటర్ల మధ్య ఓ సమావేశం జరిగింది. అందులో సినిమాలు పర్సెంటేజ్‌ విధానంలో ఆడితే తమకు లాభదాయకంగా ఉంటుందని థియేటర్‌ ఓనర్స్‌ చెప్పారు. ప్రస్తుతం ఏడాదికి 150 సినిమాలు విడుదలవుతుంటే, 90 శాతం పర్సెంటేజీ విధానంలోనే ప్రదర్శితమౌతున్నాయి. సహజంగానే పెద్ద సినిమాలకు మొదటివారం రెంట్‌ ఇస్తున్నాం. ఆ తర్వాత పర్సెంటేజీ ఇస్తున్నాం. ఇది కొందరు ఎగ్జిబిటర్స్‌కు నచ్చడం లేదు. దీంతో వారు ఈ విషయంలో సమస్యలు లేవనెత్తి, అభ్యంతరం వ్యక్తం చేయడం మొదలు పెట్టారు. అలా, తూర్పు గోదావరి ఎగ్జిబిటర్స్‌ తమ ఆలోచనను హైదరాబాద్‌లోని ఎగ్జిబిటర్స్‌కు తెలిపారు. దీనిపై ఏప్రిల్‌ 26న జరిగిన గిల్డ్‌ మీటింగ్‌లో చర్చించాం. గిల్డ్‌ సమావేశ సమయానికి ‘హరిహర వీరమల్లు’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ కాలేదు. కాబట్టి ఇది ఆ సినిమాకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం అనేది కరెక్ట్‌ కాదు. తెలంగాణలో 370 సింగిల్‌ స్ర్కీన్లు ఉంటే ఎస్వీసీసీ సహా మా వద్ద ఉన్నవి 30 మాత్రమే. ఏషియన్‌ ఫిల్మ్స్‌ సునీల్‌ నారంగ్‌, సురేశ్‌ బాబుకు 90 ఉన్నాయి. మిగిలిన వాటిని ఓనర్స్‌ లేదా వారికి సంబంధించిన వారు మాత్రమే నడుపుతున్నారు. ‘ఆ నలుగురు’ అంటూ మాపై ఇష్టమొచ్చినట్లు ప్రచారం చేస్తున్నారు. ‘ఆ నలుగురి’లో నేను లేను. మా గిల్డ్‌ మీటింగ్‌ తర్వాత తెలంగాణలోని సింగిల్‌ థియేటర్స్‌ ఓనర్స్‌ కూడా పర్సంటేజ్‌ గురించి శిరీ్‌షను అడిగారు. ఆయన ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే మే 18న ఏపీ, తెలంగాణ ఎగ్జిబిటర్స్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఆ రోజున మీటింగ్‌లో ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకోకుండానే ‘జూన్‌ 1 నుంచి థియేటర్స్‌ బంద్‌’ అనే ప్రచారం మొదలైంది. ఈ నెల 30న జరిగే చాంబర్‌ ఈసీ మీటింగ్‌ ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి తుది నిర్ణయం తీసుకుంటారు’’ అని దిల్‌ రాజు తెలిపారు.


‘నిర్మాతలంతా కలసి ఎగ్జిబిటర్లుకు సమస్యలు ఉన్నాయని అంగీకరించారు. జాయింట్‌ మీటింగ్‌లో ఓ పరిష్కారానికి వద్దామని నిర్ణయించుకున్నాం. ఈ నెల 24 అందుకే జాయింట్‌ మీటింగ్‌ పెట్టాం. అంతలోపే సమస్యను పవన్‌కల్యాణ్‌గారి చిత్రంపైకి డైవర్ట్‌ చేశారు. థియేటర్ల బంద్‌ విషయం పవన్‌కల్యాణ్‌గారి దగ్గరికి నెగెటివ్‌ కోణంలో వెళ్ళింది. అందుకే ఆయన ఆగ్రహానికి గురయ్యారు. అయినా, ఆయన తిట్టినా మేం పడతాం. పెద్దన్న స్థానంలో ఉన్న ఆయనకు ఆ హక్కు ఉంది’ అన్నారు దిల్‌ రాజు.

Updated Date - May 27 , 2025 | 03:18 AM