BalaKrishna : ఆ ఆలోచన నుంచే డాకు మహరాజ్‌ కథ పుట్టింది

ABN , Publish Date - Jan 11 , 2025 | 03:24 AM

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘డాకూ మహారాజ్‌’ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం జరిగిన ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో థియేట్రికల్‌ ట్రైలర్‌ విడుదల చేశారు. ‘

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘డాకూ మహారాజ్‌’ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం జరిగిన ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో థియేట్రికల్‌ ట్రైలర్‌ విడుదల చేశారు. ‘రాయలసీమ మాలూమ్‌ తేరే కో.. ఓ మేరా అడ్డా ’, ‘ఎవరన్నా చదవడంలో మాస్టర్స్‌ చేస్తారు. నేను చంపడంలో చేశా’ అంటూ బాలకృష్ణ చెప్పిన పవర్‌ఫుల్‌ డైలాగులతో ఈ ట్రైలర్‌ ఆకట్టుకుంటోంది. అదిరిపోయే యాక్షన్‌ సన్నివేశాలు, కట్టి పడేసే భావోద్వేగాలతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ‘డాకూ మహారాజ్‌’ చిత్రాన్ని తీర్చిదిద్దారని ఈ ట్రైలర్‌ చూడగానే అర్థమవుతుంది. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ‘తిరుమలలో తొక్కిసలాట ఘటన నన్నెంతో కలచివేసింది. ఆ ఘటనలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. అటువంటి బాధాకర సంఘటన చోటు చేసుకోవడంతో అనంతపురంలో తలపెట్టిన వేడుకలను రద్దు చేశాం. నా అభిమానులు క్రమశిక్షణ కలిగిన సైనికులు. అందుకే వారు మా నిర్ణయాన్ని స్వాగతించారు’ అన్నారు. ‘డాకు మహారాజ్‌’ చిత్రం గురించి మాట్లాడుతూ ‘నేను అప్పట్లో చేసిన ‘ఆదిత్య 369’ చిత్రంలో కృష్ణదేవరాయల పాత్ర చిరస్థాయిగా నిలిచిపోయింది. అలాంటి పాత్ర చేస్తే బాగుంటుందనే ఆలోచన నుంచి ‘డాకు మహారాజ్‌’ కథ పుట్టింది. మూడు వరుస విజయాల తర్వాత వస్తున్న ఈ సినిమా కూడా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఇక ముందు కూడా ఇలాగే మరిన్ని మంచి సినిమాలతో మీ ముందుకు వస్తాను’ అన్నారు.


దర్శకుడు కొల్లి బాబీ మాట్లాడుతూ ‘అభిమానుల కోసం కొత్తగా ఏదైనా చేయాలని తపించే వ్యక్తి బాలయ్య. అందుకే నా టీమ్‌తో కలసి ఎంతో శ్రద్ధగా ఈ స్ర్కిప్ట్‌ సిద్ధం చేశా. బాలకృష్ణగారితో ఒకసారి కలసి పని చేస్తే ఆయనని ప్రేమిస్తాం, అభిమానిస్తాం ఆయనతో మళ్లీ మళ్లీ కలసి పని చేయాలని అనిపిస్తుంది’ అన్నారు.

‘వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ రోజు టికెట్‌ బుకింగ్స్‌ ఓపెన్‌ చేశాం. అందరూ టికెట్స్‌ బుక్‌ చేసుకుని బాలకృష్ణగారికి మంచి ఓపెనింగ్స్‌ ఇస్తారని ఆశిస్తున్నాం’ అన్నారు నిర్మాత నాగవంశీ. ఈ చిత్ర బృందం సృష్టించిన డాకు మహారాజ్‌ ప్రపంచం గొప్పది, చాలా కొత్తగా ఉంటుందని సంగీత దర్శకుడు థమన్‌ చెప్పారు గొప్ప విజువల్స్‌ వల్లే మంచి సంగీతం ఇవ్వగలిగానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రగ్యా జైస్వాల్‌, ఊర్వశి రౌతేలా, శ్రధ్దా శ్రీనాథ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 11 , 2025 | 03:24 AM