శివాజీ గణేశన్‌ ఇంటి జప్తునకు కోర్టు ఆదేశం

ABN , Publish Date - Mar 04 , 2025 | 06:13 AM

‘నడిగర్‌ తిలగం’ దివంగత శివాజీ గణేశన్‌ ఇంటిని జప్తు చేయాలని మద్రాస్‌ హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీచేసింది. శివాజీ గణేశన్‌ మనవడు దుష్యంత్‌...

‘నడిగర్‌ తిలగం’ దివంగత శివాజీ గణేశన్‌ ఇంటిని జప్తు చేయాలని మద్రాస్‌ హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీచేసింది. శివాజీ గణేశన్‌ మనవడు దుష్యంత్‌ (రామ్‌ కుమార్‌ కుమారుడు), భార్య అభిరామి, మరికొందరు కుటుంబ సభ్యులు భాగస్వాములుగా ఉన్న ఈసాన్‌ ప్రొడక్షన్స్‌ నిర్మాణ సంస్థ.. ‘జగజాల కిల్లాడి’ అనే సినిమా నిర్మాణం కోసం ధనభాగ్యం ఎంటర్‌ప్రైజెస్‌ నుంచి రూ.3.74 కోట్ల రుణం తీసుకొని చెల్లించలేదు. దీంతో ధనభాగ్యం ఎంటర్‌ప్రైజెస్‌ హైకోర్టును ఆశ్రయించింది. మధ్యవర్తిగా రిటైర్డ్‌ న్యాయమూర్తి రవీంద్రన్‌ను హైకోర్టు నియమించింది. తీసుకున్న రుణం, దానికి వడ్డీ కలిపి రూ.9.39 కోట్లు చెల్లించాలని, ‘జగజాల కిలాడి’కి సంబంధించిన అన్ని హక్కులను ధనభాగ్యంకు అప్పగించాలని 2024 మే 4వ తేదీన మధ్యవర్తి రవీంద్రన్‌ ఆదేశించారు. సినిమా రైట్స్‌ తమకు అప్పగించాలని ధనభాగ్యం ఎంటర్‌ప్రైజెస్‌ కోరగా, చిత్ర నిర్మాణం పూర్తి కాలేదని నిర్మాతలు తెలిపారు. దీంతో ధనభాగ్యం ఎంటర్‌ప్రైజెస్‌ మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. శివాజీ గణేశన్‌ ఇంటిని జప్తు చేయాలని న్యాయమూర్తి అబ్దుల్‌ ఖుద్దూస్‌ ఆదేశించారు.

చెన్నై(ఆంధ్రజ్యోతి)

Updated Date - Mar 04 , 2025 | 06:13 AM