కమల్‌హాసన్ నుంచి స్ఫూర్తిపొందా
ABN , Publish Date - May 02 , 2025 | 02:04 AM
ప్రపంచ ఆడియో వీడియో ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (వేవ్స్)ను గురువారం ప్రధాని మోదీ ముంబైలో ప్రారంభించారు. 100కు పైగా దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటున్న ఈ సమావేశాలు నాలుగో తేదీ వరకు జరుగుతాయి. వినోద రంగంలో....
ప్రపంచ ఆడియో వీడియో ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (వేవ్స్)ను గురువారం ప్రధాని మోదీ ముంబైలో ప్రారంభించారు. 100కు పైగా దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటున్న ఈ సమావేశాలు నాలుగో తేదీ వరకు జరుగుతాయి. వినోద రంగంలో మన దేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు వేవ్స్‌ను ఒక వేదికగా ప్రభుత్వం తయారుచేసింది. ఈ కార్యక్రమంలో షారూక్‌ఖాన్, ఆమీర్‌ఖాన్, రజనీకాంత్, చిరంజీవి, మోహన్‌లాల్, నాగార్జున, అల్లు అర్జున్, అక్షయ్‌కుమార్, హేమమాలిని, దీపిక పదుకోణ్, ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్, రాజమౌళి, కార్తీక్ ఆర్యన్, శ్రీలీల, రాజ్‌కుమార్‌రావు, కబీర్ బేడీ సహా అనేక మంది సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆస్కార్ విజేత కీరవాణి ప్రత్యేకంగా రూపొందించిన గీతంతో ప్రారంభమైంది. శ్రేయో ఘోషల్, చిత్ర, మంగ్లీ, లిక్సిక ఆలపించారు. ఆ తరువాత ఈ ఏడాది శతజయంతి జరుపుకొంటున్న- గురుదత్, భానుమతి, సలీల్ చౌదరీ ల స్టాంపులను వారి కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రధాని ఆవిష్కరించారు. భానుమతి మనమరాలు మీనాక్షి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అమితాబ్ బచ్చన్, మిధున్ చక్రవర్తి, కమల్‌హాసన్ వంటి నటుల నుంచి తాను స్ఫూర్తి పొందానని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. గురువారం ముంబైలో జరిగిన వేవ్స్ కార్యక్రమం సందర్భంగా జరిగిన చర్చలో ఆయన మోహన్‌లాల్, హేమమాలినితో కలిసి పాల్గొన్నారు. దీనిని బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ నిర్వహించారు. ‘‘నేను సినిమా రంగంలోకి వచ్చే సరికి ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబు వంటి అనేక మంది నటులు అగ్రస్థానాల్లో ఉన్నారు. ‘నేను వాళ్లంతటి స్టార్‌ని అవుతానా?’ అని అనుకుంటూ ఉండేవాడిని, వాళ్లను చూసి భయపడటం కన్నా- నేను వాళ్ల కన్నా అదనంగా ప్రేక్షకులకు ఏం అందించగలను?’ అని ఆలోచించేవాడిని. 1977లో నేను ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చదువుకుంటున్నప్పుడు మిథున్ చక్రవర్తి నటించిన ‘మృగయా’ సినిమా విడుదలయింది. అందులో ఆయనకు ఎటువంటి మేకప్ లేదు. చాలా సహజమైన పాత్ర అది. ఆ సినిమా నాపై ప్రభావం చూపించింది. ఆ తర్వాత నేను ఎక్కువ మేకప్ వేసుకోవటం మానేశాను. మన చుట్టూ పక్కల ఉండే యువకుడిలా కనిపించాలనుకొనేవాడిని. అమితాబ్ బచ్చన్ వల్ల కూడా నేను స్పూర్తి పొందాను. ఆ సమయంలో ఫైట్స్ చిత్రీకరణలో డూప్‌లను పెట్టుకొనేవారు. కానీ షోలే సినిమా చూసిన తర్వాత - ఎంత కష్టమయినా నా ఫైట్స్ నేనే స్వయంగా చేయాలని నిర్ణయించుకున్నా. ఇక డ్యాన్స్ విషయానికి వస్తే- కమల్‌హాసన్ నా కన్నా కొద్దిగా సీనియర్. తనలా డ్యాన్స్ చేయాలని అనుకొనేవాడిని. ఇతరుల నుంచి స్ఫూర్తి పొందటం.. కష్టపడి పనిచేయటం.. కొత్తగా చేయాలనే తపనతోనే నా ప్రస్థానం సాగింది’’ అన్నారు.
చిరంజీవి ప్రభావం నాపై చాలా ఉంది
‘‘వేవ్స్’ నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. చిన్నప్పటినుంచి నాకు డ్యాన్స్ అంటే ఇష్టం. సినీ ప్రయాణంలో ఎన్నో సవాళ్లు అధిగమించాను. నాకు సినిమా తప్ప మరో ప్రపంచం లేదు. ఎంతోమంది ఆదరాభిమాణాలతో ఈ స్థాయికి చేరుకున్నా. సాధించాల్సింది ఇంకా చాలా ఉంది’’ అని అల్లు అర్జున్ అన్నారు. వేవ్స్ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘చిరంజీవిగారే నాకు స్ఫూర్తి. ఆయన ప్రభావం నాపై చాలా ఉంది. అట్లీతో నేను చేస్తున్న చిత్రం ఎంతో ప్రత్యేకంగా ఉండబోతోంది. ఆయన చెప్పిన కథ అద్భుతంగా ఉంది. భారీ హంగులతో ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచబోతోంది’’ అని తెలిపారు.
అల్లు అర్జున్
కోట్ల కథలు మనకున్నాయి
వినోద రంగంలో ప్రపంచంలో అగ్రగామిగా ఎదిగే సామర్థ్యం మన దేశానికి ఉందని దర్శకుడు రాజమౌళి అభిప్రాయపడ్డారు. ‘‘మన దగ్గర కొన్ని కోట్ల కథలు ఉన్నాయి. వేల కళారూపాలు ఉన్నాయి. సంస్కృతి వైభవానికి సంబంధించిన విషయంలో ప్రపంచంలో ఏ దేశం మనతో పోటీ పడలేదు. అయినా అంతర్జాతీయంగా మనం అమెరికా, చైనా, ఉత్తర కొరియా, వంటి దేశాలతో పోటీ పడలేకపోతున్నాం. మన శక్తిపై నాకు ఎటువంటి అనుమానం లేదు. మనకు ఒక లాంచ్‌ప్యాడ్ కావాలి. అది వేవ్స్ రూపంలో మనకు లభించింది’’ అని పేర్కొన్నారు.
రాజమౌళి