ముగిసిన కేన్స్‌ వేడుక విజేతగా ఇరానియన్‌ చిత్రం

ABN , Publish Date - May 26 , 2025 | 04:48 AM

ఈ నెల 13న అట్టహాసంగా ప్రారంభమైన 78వ కేన్స్‌ చిత్రోత్సవం శనివారం ముగిసింది. కేన్స్‌లో అత్యుత్తమ సినీ పురస్కారమైన ‘గోల్డెన్‌ పాల్మ్‌’ని అందుకోవడానికి...

ఈ నెల 13న అట్టహాసంగా ప్రారంభమైన 78వ కేన్స్‌ చిత్రోత్సవం శనివారం ముగిసింది. కేన్స్‌లో అత్యుత్తమ సినీ పురస్కారమైన ‘గోల్డెన్‌ పాల్మ్‌’ని అందుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా పలు సినిమాలు పోటీపడగా... ఈ ఏడాది ఆ ఘనతను ఇరానియన్‌ దర్శకుడు జాఫర్‌ పనాహీ తెరకెక్కించిన ‘ఇట్‌ వజ్‌ జస్ట్‌ యాన్‌ ఆక్సిడెంట్‌’ చిత్రం అందుకుంది. ఈ చిత్రంలో వహీద్‌ మొబస్సెరీ, మరియమ్‌ అఫ్షారీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఓ రోడ్‌ ట్రిప్‌ నేపథ్యంలో పలు మలుపులతో ఆసక్తికరంగా సాగే చిత్రమిది. ‘అన్‌ సర్టైన్‌ రిగార్డ్‌’ విభాగంలో ‘మిస్టీరియస్‌ గేజ్‌ ఆఫ్‌ ది ఫ్లెమింగో’ చిత్రం అవార్డు దక్కించుకుంది. 1980ల కాలంలో ఎయిడ్స్‌ వ్యాధిపై సమాజంలో ఉన్న మూఢనమ్మకాలపై పోరాడే 12 ఏళ్ల బాలిక కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా వీక్షకులను కదిలించింది. ఫ్రాన్స్‌ దర్శకుడు డియెగో సస్పెడెస్‌ తెరకెక్కించారు. అలాగే, మన దేశం నుంచి ‘హోమ్‌ బౌండ్‌’ అనే చిత్రం అన్‌సర్టైన్‌ రిగార్డ్‌లో ప్రదర్శితమైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది భారత్‌ నుంచి ప్రదర్శనకు ఎంపికైన ఏకైక సినిమా ఇదే కావడం విశేషం. అయితే ఈ చిత్రానికి పురస్కారం దక్కలేదు. ఫ్రెంచ్‌ నటి జూలియట్‌ బినోచే.. భారతీయ దర్శకురాలు, ‘ఆల్‌ వియ్‌ ఇమాజిన్‌ ఆజ్‌ లైట్‌’ ఫేమ్‌ పాయల్‌ కపాడియా తదితరులు ఈ ఏడాది జ్యూరీ సభ్యులుగా వ్యవహరించారు.


ఈ వేడుకల ప్రారంభోత్సవంలో అలియా భట్‌ పాల్గొనాల్సి ఉండగా, భారత్‌-పాక్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆగిపోయారు. చివరి రోజు గూచి బ్రాండ్‌ చీరలో మెరిసి ప్రత్యేకాకర్షణగా నిలిచారు.

విజేతలు వీరే:

గోల్డెన్‌ పాల్మ్‌: ఇట్‌ వజ్‌ జస్ట్‌ యాన్‌ ఆక్సిడెంట్‌ (జాఫర్‌ పనాహీ)

గ్రాండ్‌ ప్రిక్స్‌: ద సెంటిమెంటల్‌ వాల్యూ (జొవాచిమ్‌ ట్రైయర్‌)

ఉత్తమ దర్శకుడు: క్లెబర్‌ మెన్‌డోన్హా ఫిల్హో (ద సీక్రెట్‌ ఏజెంట్‌)

ఉత్తమ నటుడు: వాఘ్నర్‌ మౌరా

(ది సీక్రెట్‌ ఏజెంట్‌)

ఉత్తమ నటి: నదియా మెలిటీ

(ది లిటిల్‌ సిస్టర్‌)

అన్‌సర్టైన్‌ రిగార్డ్‌: మిస్టీరియస్‌ గేజ్‌ ఆఫ్‌ ది ఫ్లెమింగో (డియెగో సస్పెడెస్‌)


Updated Date - May 26 , 2025 | 04:48 AM