మంచి మాస్ రోల్ చేశాను
ABN , Publish Date - May 25 , 2025 | 03:43 AM
‘‘నన్ను ఇష్టపడే ప్రతి ప్రేక్షకుడి కోసం ‘భైరవం’ చిత్రం చేశాను. భావోద్వేగాలతో పాటు వాణిజ్యహంగులు కలబోసిన చిత్రం ఇది. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ బలమైన మాస్ పాత్రని చేశాను. మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది....
‘‘నన్ను ఇష్టపడే ప్రతి ప్రేక్షకుడి కోసం ‘భైరవం’ చిత్రం చేశాను. భావోద్వేగాలతో పాటు వాణిజ్యహంగులు కలబోసిన చిత్రం ఇది. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ బలమైన మాస్ పాత్రని చేశాను. మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది. వంద శాతం వినోదాన్ని పంచుతుంది. తప్పకుండా అందరికీ నచ్చుతుంది’’ అని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అన్నారు. ఆయన కథానాయకుడిగా విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన చిత్రమిది. కేకే రాధామోహన్ నిర్మించారు. ఈనెల 30న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సాయి శ్రీనివాస్ మీడియాతో ముచ్చటించారు.
‘భైరవం’ చిత్రంలో పాత్రల తాలూకు భావోద్వేగాలను ప్రేక్షకులు అనుభూతి చెందుతారు. ఈ సినిమాలో హీరో కొలిచేది కాలభైరవుణ్ణి. అలా కథలో నుంచే ‘భైరవం’ టైటిల్ వచ్చింది. సరికొత్త అంశాలతో వినూత్న కథాంశంతో సాగుతుంది. గ్రామీణ నేపథ్యంలో మాస్ అంశాలతో ఓ సినిమా చేయాలనుకుంటున్న తరుణంలో ‘భైరవం’ కథ నా దగ్గరకు వచ్చింది. నాకు బాగా నచ్చింది. కథ విని ఉద్వేగానికి లోనయ్యా. పల్లె వాతావరణంలో రూపొందిన ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటుంది. దర్శకుడు విజయ్‌తో పనిచేయడం మంచి అనుభవం. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు పలు మార్పులు చేసి సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆయన మార్క్ బలంగా కనిపిస్తుంది. ప్రతి సన్నివేశం మనసులో నిలిచిపోయేలా ఉంటుంది. ముఖ్యంగా పతాక ఘట్టాలే సినిమాకు హైలెట్. సినిమా చూశాక విజయ్ కథకు తన పరిధిలో పరిపూర్ణంగా న్యాయం చేశారనే ఫీలింగ్ కలిగింది. వినోద భరితంగా నడిపిస్తూనే భావోద్వేగభరితంగా ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. పోరాట ఘట్టాలు చాలా బావుంటాయి.
నారా రోహిత్, మంచు మనోజ్ పాత్రలు కథలో చాలా కీలకం. అందరికీ గుర్తుండిపోయేలా వారి పాత్రలను దర్శకుడు తీర్చిదిద్దారు. డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో వారిద్దరూ అలరిస్తారు. అదితీ శంకర్ వెరీ నైస్ పర్సన్. నటనలో తనదైన శైలీ, హావభావాలతో మెప్పిస్తుంది. అలాగే తను మంచి సింగర్, డాన్సర్ కూడా. ఈ సినిమాతో ఆమె ప్రతిభకు తగ్గ గుర్తింపు దక్కుతుంది. శ్రీచరణ్ పాకాల అద్భుతమైన సంగీతం ఇచ్చారు. పాటలకు మంచి స్పందన లభిస్తోంది. రాధామోహన్ గారు నాకు చాలా ఇష్టమైన ప్రొడ్యూసర్.హీరోగా నాకు చక్కటి సంతృప్తిని మిగిల్చే సినిమా ఇచ్చారు. ప్రస్తుతం ‘హైందవ’, ‘టైసన్ నాయుడు’, ‘కిష్కింధపురి’ చిత్రాలు చేస్తున్నాను.