Balakrishna: అరవై ఐదేళ్ళ సంబరాలు ఎలా ఉండబోతున్నాయి...

ABN , Publish Date - Apr 18 , 2025 | 02:25 PM

నందమూరి బాలకృష్ణ మాస్ హీరో మాత్రమే కాదు... శాసనసభ్యుడు కూడా. దాంతో ఆయన బర్త్ డే గురించిన ప్లానింగ్స్ ఇప్పటి నుండే కాబోతున్నాయి.

నటసింహ బాలకృష్ణ బర్త్ డే అంటే అభిమానులకు పండగే... ఆ ఫెస్టివల్ కు ఫ్యాన్స్ లో మహదానందం నింపాలనే బాలయ్య కూడా ప్రయత్నిస్తుంటారు... ఈ సారి రాబోయే బాలయ్య బర్త్ డే ఫ్యాన్స్ కు ఓ స్పెషల్ అంటున్నారు... ఆ ముచ్చటేంటో చూద్దాం...

ఈ సారి బాలయ్యకు 65 ఏళ్ళు!

టాప్ స్టార్స్ బర్త్ డేస్ ను ఫ్యాన్స్ భలేగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. తమ అభిమాన హీరోల పుట్టినరోజుకు పలు సేవాకార్యక్రమాలు చేయడం చేస్తూ ఉంటారు ఫ్యాన్స్. ఈ ట్రెండ్ ఎప్పటి నుంచో ఉన్నదే. బాలకృష్ణ (Balakrishna) బర్త్ డే అయిన జూన్ 10వ తేదీన అభిమానులు ఊరూరా సంబరాలు చేసుకుంటూ ఆసుపత్రుల్లో రోగులకు పాలు, పండ్లు ఇవ్వడం, పేదవిద్యార్థులకు పుస్లకాల పంపిణీ చేయడం, రక్తదానం నిర్వహించడం, కొన్ని చోట్ల పేదవారికి అన్నదానం చేయడం లాంటివి చేస్తూనే ఉన్నారు. గతంలో అయితే బాలయ్య బర్త్ డేను ఆయన అభిమాన నిర్మాత భార్గవ్ ఆర్ట్స్ అధినేత యస్. గోపాల్ రెడ్డి (S. Gopalreddy) ప్రతి యేటా ఘనంగా నిర్వహించేవారు. ఆ వేడుకలను అభిమానులు ఈ నాటికీ తలచుకుంటూనే ఉన్నారు. బాలయ్య బర్త్ డేన ఆయన కొత్త సినిమాలను ఆరంభించడం, లేదా న్యూ ప్రాజెక్ట్స్ డీటెయిల్స్ ప్రకటించడం చేసేవారు. ఈ సారి బాలయ్య 65 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్నారు. అందువల్ల బాలయ్య జన్మదినోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహించాలని ఫ్యాన్స్ అభిలాష. ఊరూరా ఎవరికి వారు చేతనైన తీరున సామాజిక సేవాకార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. అలాగే ఈ బర్త్ డేకు రెండు ముచ్చట్లు అభిమానులను మురిపించనున్నాయి.


'అఖండ-2' టీజర్ రిలీజ్

ఈ సారి బాలకృష్ణ బర్త్ డేకు ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'అఖండ-2' (Akhanda -2)కు సంబంధించిన టీజర్ రిలీజ్ కానుందని తెలుస్తోంది. యాక్షన్ మూవీస్ తెరకెక్కించడంలోనే కాదు తన సినిమాల టీజర్, ట్రైలర్స్ ను కట్ చేసి ఆకట్టుకోవడంలోనూ మేటి అనిపించుకున్నారు బోయపాటి శ్రీను (Boyapati Srinu)... అందునా ఆయనకు అచ్చివచ్చిన బాలకృష్ణతో సినిమా కాబట్టి, ట్రైలర్ కట్ మరింత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని టాక్... అలా జూన్ 10వ తేదీ బాలయ్య బర్త్ డేను పురస్కరించుకొని ఓ రోజు ముందుగానే అంటే జూన్ 9 సాయంత్రం ఓ శుభముహూర్తాన 'అఖండ-2' టీజర్ జనం ముందుకు రానుంది.

మరో కొత్త సినిమా...

'అఖండ -2' టీజర్ తో పాటు బాలయ్య బర్త్ డేకు మరో విశేషం కూడా చోటు చేసుకోనుంది... బాలయ్యతో 'వీరసింహారెడ్డి' (Veerasimha Reddy) వంటి బంపర్ హిట్ తీసిన గోపీచంద్ మలినేని (Gopichand Malineni) ఆయనతో మరో సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సినిమాకు సంబంధించిన అనౌన్స్ మెంట్ జూన్ 10వ తేదీన వెలువడనుంది... ఈ రెండు ముచ్చట్లతో పాటు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించిన అసలైన మేటర్ కూడా ఆ రోజునే వినిపిస్తుందనీ ఇన్ సైడ్ టాక్... మరి రాబోయే బాలయ్య బర్త్ డేన ఇంకా ఏ యే అంశాలు అభిమానులకు ఆనందం పంచుతాయో చూడాలి.

Updated Date - Apr 18 , 2025 | 02:25 PM