Tollywood: ఏప్రిల్ సినిమాల కథేంటి...
ABN , Publish Date - Apr 29 , 2025 | 01:13 PM
ఏప్రిల్ రిజల్ట్ టాలీవుడ్‌ను పూర్తిస్థాయిలో నిరాశకు గురి చేసింది. మార్చి నెల ఫలితాలు మళ్లీ రిపీట్ అవుతాయని అనుకుంటే.. అంతా రివర్సైపోయింది. ఏప్రిల్ లో విడుదలైన ఏ సినిమా కూడా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది.
ఏప్రిల్ మాసం సినీ ప్రియులను నిరాశ పర్చింది. ఈనెలలో మూడు అనువాద చిత్రాలతో కలిపి మొత్తం 28 సినిమాలు థియేటర్లలో విడుదల అయ్యాయి. సమ్మర్ లో ఉత్కంఠ పోరు ఉంటుందనుకుంటే దానికి భిన్నమైన ఫలితాలు వెలువడ్డాయి . పైగా ఇలాంటి నెల కలలో కూడా మళ్లీ రావద్దని ప్రొడ్యూసర్లు, బయ్యర్లు మొక్కుకునేలా చేసిందీ మాసం. ఈ యేడాది ఏప్రిల్ ఇండస్ట్రీకి ఒక పీడకలను మిగిల్చింది. మార్చిలో 'మ్యాడ్ స్క్వేర్' (Mad Square), 'కోర్ట్' (Court) లాంటి చిన్న సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. దాంతో వేసవి సీజన్ కు శుభారంభం జరిగిందని అంతా భావించారు. కానీ ఏప్రిల్ ఆ ఆశలపై నీళ్ళు చల్లేసింది. ఈ నెలలో వచ్చిన సినిమాల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే.. కొత్త సినిమాలకు మార్నింగ్ షోకి కనీసం ఇరవై, ముప్పై మంది ప్రేక్షకులు కూడా రాకపోవడం థియేటర్ల యాజమాన్యాన్ని షాక్‌కు గురి చేసింది. చాలా మల్టీప్లెక్స్‌ల్లో, సింగిల్ థియేటర్లలో షోస్ క్యాన్సెల్ కావడం అనేది కామన్ అయిపోయింది.
ఏప్రిల్ ఫస్ట్ వీకెండ్ లో ''ఎల్.యు.ఎఫ్ (LYF), శారీ (Saaree), వృషభ (Vrusshabha), శివాజ్ఞ (Shivagna), 28 డిగ్రీస్ సెల్సియస్ (28 Degree Celsius)'' చిత్రాలు విడుదలయ్యాయి. రామ్ గోపాల్ వర్మ నిర్మించిన 'శారీ' విడుదలకు ముందుకు కాస్తంత హడావుడీ జరిగింది. కానీ థియేటర్లలో ఈ సినిమా వచ్చిన తర్వాత మాట్లాడుకున్న వారే కరువయ్యారు. అలానే 'పొలిమేర' దర్శకుడు డాక్టర్ విశ్వనాథ్ రూపొందించిన తొలి చిత్రం '28 డిగ్రీస్ సెల్సియస్' కూడా ఎలాంటి ప్రభావాన్ని బాక్సాఫీస్ బరిలో చూపించలేదు. ఇక సెకండ్ వీకెండ్ లో వచ్చిన సిద్దు జొన్నలగడ్డ 'జాక్' (Jack) ఫస్ట్ షో కే డౌన్ అయ్యింది. తమిళంలో రికార్డులు కొట్టిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (Good Bad Ugly) టాలీవుడ్‌లో ప్లాఫ్ టాక్ మూటగట్టుకుంది. యాంకర్ ప్రదీప్ 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ (Akkada Ammayi Ikkada Abbayi) కాస్తంత హైప్ తోనే వచ్చినా... జనం నుండి జీరో రెస్పాన్స్! ''ప్రేమకు జై, చెరసాల, కౌసల్య తనయ రాఘవ, నాన్నా మళ్ళీ రావా' వంటి సినిమాలు బొక్క బోర్లపడ్డాయి. నందమూరి కళ్యాణ్ రామ్ ఈసారి హిట్ అని గట్టిగా చెప్పుకున్న ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ ఫ్యాన్స్‌ని కూడా డిసప్పాయింట్ చేసింది. ‘ఓదెల 2’ బ్రేక్ ఈవెన్ అని హడావిడి చేసినా.. ప్రొడ్యూసర్‌కి లాభమే కానీ డిస్ట్రిబ్యూటర్లకు ఖాళీ చేతులు మిగిలాయన్నది ట్రేడ్ వర్గాల మాట. ''మధురం, డియర్ ఉమ, జగమెరిగిన సత్యం'' వంటి చిత్రాలూ అడ్రస్ లేకుండా పోయాయి.
ఏప్రిల్ చివరి వారంలో ఏకంగా 11 సినిమాలు థియేటర్లలో విడుదల అయ్యాయి. అందులో సారంగపాణి జాతకం (Sarangapani Jathakam)కి టాక్ బాగానే ఉన్నా... కలెక్షన్స్ ఆ టాక్‌ని రిఫ్లెక్ట్ చేయడం లేదు. ''సూర్యాపేట్ జంక్షన్ (Suryapet Junction), హలో బేబీ, శివశంభో, సర్వం సిద్థం'' ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాయి. మలయాళ డబ్బింగ్ మూవీ 'జింఖానా' (Gymkhana) మాత్రమే యూత్ సపోర్ట్‌తో డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది. కానీ బీ, సీ సెంటర్స్‌లో ఆ జోష్ మిస్ అయింది. మోహన్ లాల్ నటించిన మలయాళ చిత్రం ‘తుడరుమ్’ (Thudarum) అదే పేరుతో తెలుగులో డబ్ అయ్యింది. సినిమా బాగానే ఉందనే టాక్ వచ్చినా.. పబ్లిసిటీ లేక జనాలను థియేటర్లకు రప్పించలేకపోయింది. సంపూర్ణేష్ బాబు నటించిన ‘సోదరా’, త్రినాధరావు నక్కిన నిర్మించిన ‘చౌర్య పాఠం’ కూడా బాక్సాఫీస్ దగ్గర చేతులెత్తేశాయి. ఏప్రిల్ నెలలో వచ్చిన సినిమాలు తీవ్ర నిరాశకు గురిచేయడంతో ఇప్పుడు అందరూ మే 1న రాబోతున్న నేచురల్ స్టార్ నాని 'హిట్ -3' (Hit -3), సూర్య డబ్బింగ్ మూవీ 'రెట్రో' (Retro) మీదనే ఆశలు పెట్టుకున్నారు.
Also Read: Swathi Mutyam: 40 మంది జర్నలిస్టులకు చిరు సత్కారం
Also Read: Mega Star: చిరు... పవన్... మధ్యలో చెర్రీ
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి