సినీ థియేటర్ల బంద్‌పై విచారణ జరుగుతోంది
ABN , Publish Date - May 27 , 2025 | 03:21 AM
సినిమా థియేటర్ల బంద్ వ్యవహారంలో హోంశాఖ విచారణ చేస్తోందని.. నివేదిక రాగానే వివరాలు వెల్లడిస్తామని ఏపీ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గే్‌శ అన్నారు....
ఏపీ మంత్రి కందుల దుర్గేశ్
సినిమా థియేటర్ల బంద్ వ్యవహారంలో హోంశాఖ విచారణ చేస్తోందని.. నివేదిక రాగానే వివరాలు వెల్లడిస్తామని ఏపీ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గే్‌శ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని తన కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే నూతన ఫిల్మ్ పాలసీ తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఎగ్జిబిటర్లు, డిస్ర్టిబ్యూటర్లు, నిర్మాతలకు అండగా కూటమి ప్రభుత్వం ఉందన్నారు. తాము విచారణ మాత్రమే చేయమన్నామని, ఎవర్నీ అరెస్ట్ చేయమని చెప్పలేదని పేర్కొన్నారు. జూన్ 12న విడుదల కానున్న ‘హరిహర వీరమలు’్ల చిత్రం విషయంలోనే కొందరు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారో తెలియాల్సి ఉందన్నారు. సినిమాల విడుదల సమయంలో టికెట్ల ధరలు పెంచాలని నిర్మాతలు తమను కలిసి అడుగుతున్నారని, అందుకు తాము అంగీకరిస్తున్నామని అన్నారు. తమ సమస్యలు తామే పరిష్కరించుకుంటామని కొందరు అహంభావంతో మాటాడడం సరైన విధానం కాదన్నారు. సినిమా ప్రజలను ప్రభావితం చేసే మాధ్యమం అని, అందువల్ల ప్రభుత్వానికి సంబంధం ఉంటుందన్నారు. సినిమాటోగ్రఫీ శాఖ నిర్వహించిన వైసీపీకి చెందిన మాజీ మంత్రి వక్రభాష్యాలు చెబుతున్నారని, సినీ పరిజ్ఞానం లేకుండా అజ్ఞానంతో మాట్లాడడం సరికాదన్నారు.
రాజమహేంద్రవరం (ఆంధ్రజ్యోతి)