ఆ బాధ్యత దర్శక నిర్మాతలదే

ABN , Publish Date - Apr 29 , 2025 | 04:19 AM

‘కొవిడ్‌ సమయం నుంచి చాలా మంది ప్రేక్షకులు ఓటీటీలకు అలవాటు పడ్డారు. మార్పును ఎవరూ ఆపలేరు. సినిమా చాలా బాగుంది అని టాక్‌ వస్తే తప్ప ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు....

‘కొవిడ్‌ సమయం నుంచి చాలా మంది ప్రేక్షకులు ఓటీటీలకు అలవాటు పడ్డారు. మార్పును ఎవరూ ఆపలేరు. సినిమా చాలా బాగుంది అని టాక్‌ వస్తే తప్ప ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు. అలా చాలా బాగుంది అనిపించేలా సినిమాలు చేయడం దర్శక, నిర్మాతల బాధ్యత’ అని అన్నారు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌. శ్రీవిష్ణు హీరోగా, కేతిక శర్మ, ఇవానా కథానాయికలుగా కార్తిక్‌ రాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సింగిల్‌’. అల్లు అరవింద్‌ సమర్పణలో విద్యా కొప్పినీడి, భాను ప్రతాప్‌, రియాజ్‌ చౌదరి నిర్మించారు. మే 9న ప్రేక్షకుల ముందుకు వస్తోన్న సందర్భంగా సోమవారం ట్రైలర్‌ని రిలీజ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్‌ మాట్లాడుతూ ‘డైరెక్టర్‌ కార్తిక్‌ ఈ కథ చెబుతుంటే రెండు గంటల పాటు పగలబడి నవ్వుతూనే ఉన్నాను. సినిమాలో శ్రీ విష్ణు, వెన్నెల కిశోర్‌ కనిపించినప్పుడు నవ్వులు మామూలుగా ఉండవు. కుటుంబమంతా కలిసి థియేటర్స్‌లో ఎంజాయ్‌ చేసే సినిమా ఇది’ అని అన్నారు.


హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ ‘ఇంటిల్లిపాదిని కడుపుబ్బ నవ్వించాలనే ప్రయత్నంతో ఈ సినిమా చేశాం. స్ర్కీన్‌ప్లే, స్టోరీ చాలా కొత్త అనుభూతిని ఇస్తాయి’ అని అన్నారు. నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ ‘నవ్వించడమే లక్ష్యంగా పెట్టుకొని తీసిన సినిమా ఇది’ అని చెప్పారు.

Updated Date - Apr 29 , 2025 | 04:19 AM