ఆ నలుగురిలో నేను లేను

ABN , Publish Date - May 26 , 2025 | 04:50 AM

‘‘రెండు రోజుల నుంచి మీడియాలో ‘ఆ నలుగురు... ఆ నలుగురు’ అంటూ కొంచెం నెగిటివ్‌ టచ్‌ ఇచ్చి పదే పదే చెబుతున్నారు. ‘కబంద హస్తాలతో థియేటర్లను గుప్పిట పట్టార’ని అంటున్నారు. ఆ నలుగురిలో నేను లేను. ఆ నలుగురితో...

‘‘రెండు రోజుల నుంచి మీడియాలో ‘ఆ నలుగురు... ఆ నలుగురు’ అంటూ కొంచెం నెగిటివ్‌ టచ్‌ ఇచ్చి పదే పదే చెబుతున్నారు. ‘కబంద హస్తాలతో థియేటర్లను గుప్పిట పట్టార’ని అంటున్నారు. ఆ నలుగురిలో నేను లేను. ఆ నలుగురితో నాకు సంబంధం లేదు’’ అని నిర్మాత అల్లు అరవింద్‌ అన్నారు. పర్సంటేజీ విధానం అమలు చేయకుంటే జూన్‌ 1 నుంచి థియేటర్ల మూసివేస్తాం అంటూ ఎగ్జిబిటర్లు కొన్ని రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదలను అడ్డుకోవడానికి తెరవెనుక కొందరు సినీ పెద్దలు ప్రయత్నిస్తున్నారనీ, ఈ నిర్ణయం వెనుక ఉన్న ఆ నలుగురిలో అల్లు అరవింద్‌ హస్తం ఉందంటూ మీడియాలో ఉధృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు అల్లు అరవింద్‌ ఆదివారం మీడియా ముందుకొచ్చారు.

‘‘ఆ నలుగురు’ అని అనడం 15 ఏళ్ల క్రితం మొదలుపెట్టారు. కొవిడ్‌ సమయంలోనే ఆ నలుగురి వ్యాపారంలోంచి నేను బయటకు వచ్చాను. తెలంగాణలో నాకు ఉన్న ఏకైక థియేటర్‌ ‘ఏఏఏ’. అది తప్ప నాకు మరో థియేటర్‌ లేదు. అలాగే ఒక్క థియేటర్‌ కూడా తెలంగాణలో నాకింద లీజులో లేదు. ఆంధ్రాలో 15 థియేటర్లు లీజులో నడుపుతున్నాం. గడువు తీరాక వాటిని కూడా వదులుకోవాలనుకుంటున్నాం. పాత అలవాటు ప్రకారం అందరూ నన్ను కూడా ఆ నలుగురిలో కలుపుతున్నారు. ఇకపై దయచేసి ఆ నలుగురి గురించి చెప్పేటప్పుడు అందులో నన్ను కలపొద్దు’ అని అల్లు అరవింద్‌ కోరారు.


ఆ సమావేశాల్లో నేను పాల్గొనలేదు

‘థియేటర్ల మూసివేతపై నిర్వహించిన సమావేశాల్లో నేను పాల్గొనలేదు. ‘మేం థియేటర్లు మూసేస్తున్నాం, మీరు చర్చలకు రండి’ అని అనడం నాకు నచ్చలేదు. అది ఏకపక్ష నిర్ణయం. మా వాళ్లకు కూడా వెళ్లొద్దు అని చెప్పాను. ఏదైనా సమస్య ఉంటే ముందు ఛాంబర్‌లో, గిల్డ్‌లో చర్చించి పరిష్కరించుకోవాలి. కుదరకపోతే ప్రభుత్వాన్ని కూడా కలవాలి. అన్నీ దారులు మూసుకుపోతే అప్పుడు థియేటర్ల బంద్‌ నిర్ణయం తీసుకొని ఉండాల్సింది. అలాగే క్యూబ్‌లో నేను, యూఎ్‌ఫఓలో సురేశ్‌బాబు భాగస్వాములం కాదు’ అని అల్లు అరవింద్‌ వివరణ ఇచ్చారు.


పవన్‌కల్యాణ్‌ ఆవేదనలో అర్థం ఉంది

‘‘పవన్‌కల్యాణ్‌ ఆవేదనలో అర్థం ఉంది. ఆయన సినిమా వస్తుంటే మేం థియేటర్లు మూసేస్తున్నాం అనడం పవన్‌ కల్యాణ్‌ను బెదిరించడమే. ఆయన సినిమా విడుదలవుతున్న సమయంలో థియేటర్లను మూసేస్తాం అనే దుస్సాహసం చేయకూడదు. థియేటర్ల మూసివేతపై ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్‌ స్పందన సమంజసమే. పవన్‌ కల్యాణ్‌ మన ఇండస్ట్రీ నుంచి వె ళ్లారు. ఎవరికి ఏ సహాయం కావాలన్నా చేస్తున్నారు. అశ్వనీదత్‌ గారి సినిమా విడుదలైన సమయంలో టికెట్‌ ధరలను పెంచమని అడగడానికి మేం వెళ్లాం. ‘ఛాంబర్‌ తరపున వచ్చి సీఎం చంద్రబాబునాయుడు గారిని ఒకసారి కలవండి’ అని ఆ సమయంలో పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. ఆ తర్వాత ఏం జరిగిందో కానీ ఎవరూ ఆ విషయాన్ని పట్టించుకోలేదు. వెళ్లి కలసి ఉంటే బావుండేది’’ అని హితవు పలికారు.

మాది ప్రైవేట్‌ వ్యాపారం. ప్రభుత్వంతో మాకు సంబంధం లేదని కొందరు అంటున్నారు. అలాంటప్పుడు మనలో పెద్దపెద్దవాళ్లందరూ గత ప్రభుత్వంలో సీఎంను మాత్రం ఎందుకు క లవాల్సి వచ్చింది?

అల్లు అరవింద్‌

Updated Date - May 26 , 2025 | 04:50 AM