అప్పులు తీర్చడానికే నటుడినయ్యా

ABN, Publish Date - May 02 , 2025 | 01:54 AM

తమిళ హీరో అజిత్‌కుమార్‌ ఇటీవలే న్యూఢిల్లీలో పద్మభూషణ్‌ పురస్కారం అందుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. సినిమాల్లోకి యాక్టర్‌గా రావడం..

తమిళ హీరో అజిత్‌కుమార్‌ ఇటీవలే న్యూఢిల్లీలో పద్మభూషణ్‌ పురస్కారం అందుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. సినిమాల్లోకి యాక్టర్‌గా రావడం వెనుకున్న పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘‘అసలు నాకు సినిమాల్లోకి రావాలనే ఉద్దేశం ఏనాడూ లేదు. అనుకోకుండా యాక్టర్‌ అయ్యా. మొదట్లో నా నటన ఘోరంగా ఉండేది. కెరీర్‌ తొలినాళ్లలో నేను చేసిన సినిమాలకు వేరేవారు డబ్బింగ్‌ చెప్పేవారు. ఆ తర్వాత కఠోర సాధనతో నన్ను నేను చాలా మెరుగుపరుచుకున్నా. ఇప్పటికీ కొందరు మిమిక్రీ ఆర్టిస్టులు మొదట్లో నేను చేసిన పేలవ నటన ఆధారంగా మిమిక్రీ చేస్తుంటారు. నిజానికి నాకు రేసర్‌ కావాలనే అశ ఉండేది. రేసింగ్‌ కోసం డబ్బులు సమకూర్చుకునే పనిలో మోడలింగ్‌ అవకాశం వచ్చింది. ఆ క్రమంలోనే సినిమా అవకాశాలూ వచ్చాయి. ఎవరైనా ఏదైనా అడిగితే నిజాయితీగా సమాధానం చెప్పేవాడ్ని. అప్పట్లో ఓ విలేకరి ‘మీరు యాక్టింగ్‌ను ఎందుకు ఎంచుకున్నారు’ అని అడిగారు. ‘వ్యాపారంలో నష్టం వచ్చింది. నాకున్న అప్పులు తీర్చడానికి ఇండస్ట్రీలోకి వచ్చా’ అని తడుముకోకుండా చెప్పేశా’’.

Updated Date - May 02 , 2025 | 01:54 AM