దాదాసాహెబ్‌ బయోపిక్‌లో ఆమీర్‌ఖాన్‌

ABN , Publish Date - May 16 , 2025 | 04:18 AM

భారతీయ సినిమా పితామహుడు దాదా సాహెబ్‌ ఫాల్కే. ఆయన నిర్మించిన తొలి భారతీయ చిత్రం ‘రాజా హరిశ్చంద్ర’ 1913లో విడుదలైంది. ఆ తర్వాత ‘లంకా దహన్‌’, ‘శ్రీ కృష్ణ జన్మ’,...

భారతీయ సినిమా పితామహుడు దాదా సాహెబ్‌ ఫాల్కే. ఆయన నిర్మించిన తొలి భారతీయ చిత్రం ‘రాజా హరిశ్చంద్ర’ 1913లో విడుదలైంది. ఆ తర్వాత ‘లంకా దహన్‌’, ‘శ్రీ కృష్ణ జన్మ’, ‘కాళీయ మర్దన్‌’ వంటి విజయవంతమైన చిత్రాలను ఆయన తెరకెక్కించారు. కళామతల్లికి దాదాసాహెబ్‌ చేసిన సేవలకు గాను ఆయన పేరుతో కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డును నెలకొల్పి ఏటా అందజేస్తోంది. ఇప్పుడు ఆయన జీవిత విశేషాలతో ఓ చిత్రం రూపుదిద్దుకోనున్నది. ఇందులో బాలీవుడ్‌ నటుడు ఆమీర్‌ఖాన్‌ లీడ్‌ రోల్‌లో నటించనున్నారు. రాజ్‌కుమార్‌ హిరానీ తెరకెక్కించనున్నట్లు మేకర్స్‌ గురువారం అధికారికంగా ప్రకటించారు. ‘త్రీ ఇడియట్స్‌’, ‘పీకే’ వంటి బ్లాక్‌ బస్టర్‌ చిత్రాల తర్వాత ఆమీర్‌ఖాన్‌-రాజ్‌కుమార్‌ హిరానీ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రమిది. కాగా, తెలుగు దర్శకుడు రాజమౌళి సమర్పణలో కూడా ‘సాదాసాహెబ్‌ ఫాల్కే’ బయోపిక్‌ తెరకెక్కనున్నదని, ఇందులో జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రలో నటించనున్నారని సోషల్‌ మీడియాలో వార్తలు వైరల్‌ అయ్యాయి. అయితే ఈ ప్రాజెక్టు గురించి ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. అయితే ఈ రెండు వార్తలు ఒకే రోజున రావడం ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Updated Date - May 16 , 2025 | 04:18 AM