ఆ ప్రశ్నను రేకెత్తించే చిత్రమే 23
ABN , Publish Date - May 15 , 2025 | 02:58 AM
‘‘ఒకే తరహా నేరం చేసిన వ్యక్తుల్లో ఒకరికి తక్కువ శిక్ష ఎందుకు పడుతుంది? మరొకరికి ఎక్కువ శిక్ష ఎందుకు పడుతుంది? వారిలో ఒకరికి 24 గంటల్లో బెయిల్ వస్తుంది? అదే తప్పు చేసిన మరొకరికి రెండేళ్లయినా బెయిల్...
‘‘ఒకే తరహా నేరం చేసిన వ్యక్తుల్లో ఒకరికి తక్కువ శిక్ష ఎందుకు పడుతుంది? మరొకరికి ఎక్కువ శిక్ష ఎందుకు పడుతుంది? వారిలో ఒకరికి 24 గంటల్లో బెయిల్ వస్తుంది? అదే తప్పు చేసిన మరొకరికి రెండేళ్లయినా బెయిల్ దొరకదు. ఇలా ఎందుకు జరుగుతుంది? చట్టం అందరికీ సమానం అన్నప్పుడు అందరికీ ఒకేలా వర్తించాలి కదా. కానీ అలా జరగ డం లేదు. దీన్ని ఎవరో ఒకరు ప్రశ్నించాలి. జనాల్లో అలాంటి ఒక ప్రశ్నను రేకెత్తించే చిత్రమే ‘23’’ అని దర్శకుడు రాజ్ ఆర్ అన్నారు. ‘మల్లేశం’, ‘8 ఏఎం మెట్రో’ చిత్రాలతో ఆయన ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా రాజ్ ఆర్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘23’. వెంకట్ సిద్ధారెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా స్టూడియో 99 నిర్మించింది. తేజ, తన్మయి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ నెల 16న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా రాజ్ ఆర్ మీడియాతో మాట్లాడారు. ‘కొన్ని దశాబ్దాల క్రితం చిలకలూరిపేట, చుండూరు, జూబ్లీహిల్స్‌లో జరిగిన సంఘటనల ఆధారంగా అల్లుకున్న కథతో ‘23’ చిత్రాన్ని తెరకెక్కించాను. తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే. ఆ ఘటనల వల్ల ఎన్నో జీవితాలు నాశనం అయ్యాయి.
చాలా కుటుంబాలు రోడ్డునపడ్డాయి. ఆ మూడు సంఘటనలకూ ఓ ప్రేమజంటకూ ఉన్న సంబంధం ఏమిటి అనేది కథలో ఆసక్తికరంగా ఉంటుంది. కథాపరంగా ఇది కొంచెం టఫ్ సబ్జెక్ట్. ఏకాగ్రతతో చూడాల్సిన సినిమా ఇది. ఇందులో నటీనటులంతా అద్భుతంగా నటించారు. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’ అని రాజ్ ఆర్ అన్నారు.