War 2: ఫస్ట్ డే కలెక్షన్స్ పై గురి...

ABN , Publish Date - Jul 09 , 2025 | 05:10 PM

సినిమాకు క్రేజ్ అంటూ ఉంటే రికార్డులు బద్దలు కొట్టేయవచ్చు అన్నది కొందరి నమ్మకం. యశ్ రాజ్ ఫిలిమ్స్ అధినేత ఆ నమ్మకంతోనే ఉన్నట్టు కనిపిస్తోంది. తమ రాబోయే చిత్రం 'వార్ 2'తో పలు రికార్డులపై యశ్ రాజ్ ఫిలిమ్స్ గురి పెట్టినట్టు సమాచారం.

బాలీవుడ్ టాప్ స్టార్ హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ యన్టీఆర్ కాంబోలో వస్తోన్న 'వార్ 2'పై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ సినిమా హీరోల కారణంగానే 'వార్ 2' కు అనూహ్యమైన క్రేజ్ నెలకొన్నట్టు తెలుస్తోంది.అంతేకాదు ఇందులో హీరోయిన్ కియారా అద్వానీ అందాల విందు కూడా ఓ కారణమని రసిక ప్రేక్షకులు చెబుతున్నారు. అలాగే 'వార్' ఫ్రాంచైజ్ లో వచ్చిన గత చిత్రం హిట్ కావడంతో ఈ రెండో సినిమాకూ క్రేజ్ నెలకొందని మరికొందరి మాట. ఇలా ఎటు చూసినా 'వార్ 2' చిత్రానికి బోలెడు క్రేజ్ దక్కిందని పరిశీలకులు చెబుతున్నారు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఈ చిత్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ, నిర్మాత ఆదిత్యా చోప్రా 'వార్ 2' ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా దేశంలోని అన్ని ఐమ్యాక్స్ థియేటర్స్ ను క్యాప్చర్ చేశారు. అంతేకాదు విదేశాల్లోనూ పోటీ సినిమాల కంటే మంచి థియేటర్స్ ను పట్టేసినట్టు సమాచారం. ఇలా 'వార్ 2' కోసం ఎంతో శ్రద్ధ తీసుకుంటున్న మేకర్స్ మొదటి రోజు వసూళ్ళలోనూ 'వార్ 2'ను అగ్రస్థానంలో నిలిపే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది.


ప్రస్తుతం 'వార్ 2'కు ఉన్న క్రేజ్ దృష్ట్యా కేవలం భారతదేశంలోనే మొదటి రోజున వంద కోట్లు పోగవుతాయని ట్రేడ్ పండిట్స్ చెబుతున్నారు. హిందీ చిత్రాల్లో ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లో షారుఖ్ ఖాన్ 'జవాన్' 130 కోట్లతో అగ్రస్థానంలో నిలచింది. ఇక ఆల్ ఇండియాలో నంబర్ వన్ గా 'పుష్ప - 2' మూవీ 294 కోట్లు పోగేసింది. టాప్ టెన్ ఫస్ట్ డే గ్రాసర్స్ లో పదో స్థానంలో 'జవాన్' ఉంది. మిగిలిన తొమ్మిది సౌత్ స్టార్ మూవీస్ కావడం విశేషం!. 'వార్ 2' విషయానికి వస్తే సౌత్ టాప్ స్టార్స్ లో ఒకరైన యన్టీఆర్ నటించారు. ఆయనతో పాటు హృతిక్ రోషన్ కూడా ఉన్నారు. ఫస్ట్ డే టాప్ గ్రాసర్స్ లో హృతిక్ నటించిన సినిమా ఒక్కటీ లేకపోవడం గమనార్హం! యన్టీఆర్ 'దేవర' సినిమా మొదటి రోజు 141 కోట్లకు పైగా వసూలు చేసి ఎనిమిదో ప్లేస్ లో ఉంది. ఈ నేపథ్యంలో 'వార్ 2'కు యంగ్ టైగర్ ఎంతో ప్లస్ అవుతాడని, అందువల్ల కనీసం మొదటి రోజున 175 కోట్లు పోగేస్తుందని బాలీవుడ్ బాబులే చెబుతున్నారు. ఏకంగా టాప్ గ్రాసర్ 'పుష్ప-2'పై ఎందుకు గురిపెట్టలేదు అంటే 'వార్ 2' విడుదలవుతున్న ఆగస్టు 14న రజనీకాంత్ 'కూలీ' కూడా రిలీజ్ అవుతోంది. 'కూలీ' కూడా పాన్ ఇండియా మూవీ కావడం వల్ల ఇండియాలోనే పలు కేంద్రాలలో 'పుష్ప-2'కు దొరికినన్ని సినిమా హాళ్ళు 'వార్ 2'కు లభించడం లేదు. అందువల్లే 175 కోట్లకు గురిపెట్టారట.


'వార్ 2'కు అచ్చి వచ్చే అంశమేంటంటే - ఈ సినిమా తెలుగు, హిందీ వర్షన్స్ రెండూ విదేశాల్లో విశేషంగా అలరించే అవకాశం ఉంది. ముఖ్యంగా యన్టీఆర్ కారణంగా తెలుగు వర్షన్ కు అబ్రాడ్ లోనే బోలెడు వసూళ్ళు వచ్చేట్టున్నాయని ట్రేడ్ పండిట్స్ లెక్కలు వేస్తున్నారు. ఒక వేళ 'వార్ 2' మొదటి రోజున 175 కోట్లు మాత్రమే సాధిస్తే టాప్ టెన్ గ్రాసర్స్ లో ఐదో స్థానం సంపాదిస్తుందనీ చెబుతున్నారు. నాలుగో స్థానంలో ఉన్న 'కల్కి 2898 ఏడి' చిత్రం 182 కోట్లకు పైగా ఫస్ట్ డేన సంపాదించింది. దాని తరువాతి స్థానంలో ఉన్న 'సలార్' 165 కోట్లు పోగేసింది. అందువల్ల 'వార్ 2' 175 కోట్ల వసూలు చేస్తే టాప్ టెన్ లో ఐదో స్థానంతో సరిపుచ్చుకోవలసి వస్తుంది. ఇంతా చేసి అంతేనా అంటే ప్రస్తుతానికి అంతే అని సరిపుచ్చుకోవాలి. ఏమవుతుందో చూద్దాం.

Also Read: Sootravaakyam: ప్రపంచవ్యాప్తంగా 11న విడుదల

Also Read: Pooj Hegde: జిగేల్ రాణికి మళ్లీ చుక్కెదురు

Updated Date - Jul 09 , 2025 | 05:47 PM