Bollywood: హాస్యనటుడు సతీశ్ షా మరి లేరు...
ABN , Publish Date - Oct 25 , 2025 | 05:51 PM
ప్రముఖ హాస్యనటుడు సతీశ్ షా శనివారం అనారోగ్యంతో కన్నుమూశారు. పలు టీవీ సీరియల్స్ తో పాటు దాదాపు 250 చిత్రాలలో సతీశ్ షా నటించారు.
బుల్లితెర వీక్షకులను తనదైన హాస్యంతో ఉర్రూతలూగించారు సతీశ్ షా (Satish Shah). 1984లో 'యే జో హై జిందగీ'లో ఆయన నటనకు ఫిదా కాని భారతీయ వినోద ప్రియులు లేరంటే అతిశయోక్తి కాదు. ఆ తర్వాత టెలివిజన్ లో ప్రసారం అయిన 'ఫిల్మీ చక్కర్, ఘర్ జమై, టాప్ 10, సారాభాయ్ వర్సెస్ సారాభాయ్, కామెడీ సర్కస్' వంటి కార్యక్రమాలు, షోస్ లో పాల్గొన్నాడు. 1951, జూన్ 25న ముంబైలో జన్మించిన సతీష్ షా పూర్వీకులది కచ్ గుజరాతి. 1978లో 'అరవింద్ దేశాయ్ కి అజీబ్ దస్తాన్' సినిమాతో సతీష్ షా వెండితెరపైకి అడుగుపెట్టాడు. 1983లో వచ్చిన 'జానీ భీ దో యారో' (Jaane Bhi Do Yaaro) మూవీ అతనికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. దాదాపు 250 చిత్రాలలో హాస్య పాత్రలను పోషించిన సతీషా మృతి పట్ల మాధవన్ తో సహా పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. ఇటీవల ట్రాన్స్ ప్లాంట్ కూడా జరిగింది. ఆదివారం ఆయన అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.