మహ్మద్ రఫీతో కలసి మధురం పంచిన సుమన్ కళ్యాణ్ పూర్!

ABN , Publish Date - Apr 29 , 2025 | 06:14 PM

అభిమాన గాయనిని అనుకరిస్తూ ఆ ప్రభావం నుండి బయట పడలేకపోయిన గాయనీమణి, తరువాతి రోజుల్లో అవకాశాలను అందిపుచ్చుకోవడం విశేషమనే చెప్పాలి. ఇక్కడ మధురగాయకుడు మహ్మద్ రఫీ చెంతన కనిపిస్తున్న గాయని పేరు సుమన్ కళ్యాణ్ పూర్

అభిమాన గాయనిని అనుకరిస్తూ ఆ ప్రభావం నుండి బయట పడలేకపోయిన గాయనీమణి, తరువాతి రోజుల్లో అవకాశాలను అందిపుచ్చుకోవడం విశేషమనే చెప్పాలి. ఇక్కడ మధురగాయకుడు మహ్మద్ రఫీ (Md.Rafi) చెంతన కనిపిస్తున్న గాయని పేరు సుమన్ కళ్యాణ్ పూర్ (Suman Kalyanpur). ఆమె అభిమాన గాయని లతా మంగేష్కర్ (Lata Mangeshkar). చిన్నతనంలో లత పాటలు పాడుతూ, ఆమె పంథానే అనుకరిస్తూ సాగారు సుమన్. దాంతో సుమన్ పాట పాడినా, అందరూ లతా మంగేష్కర్ పాటే అనుకొనేవారు. స్వయంప్రతిభ ఉన్నా లతా మంగేష్కర్ వంటి మేరునగం ముందు సుమన్ కళ్యాణ్ పూర్ గానం మరింత చిన్నగా కనిపించేది. అయితే ఆ నాటి సంగీత దర్శకులు కొందరు సుమన్ లోని ప్రతిభను గమనించి ఆమెతోనూ పాటలు పాడించేవారు. అయితే సంగీతాభిమానులు సైతం పొరపాటు పడేలా ఆ పాటలను లత గానం చేసిందని భావించేవారు. చివరకు అప్పటి గ్రామ్ ఫోన్ కంపెనీవారు సైతం టైటిల్స్ వేసేప్పుడు అయోమయానికి లోనై పేరునే ప్రకటించేవారు కాదు. ఇలా చిత్ర విచిత్రాలు సాగుతోంటే, "నేనేం చేసేది... లతాజీ గానం నా గాత్రం కంటే కాస్త ముదురుగా ఉంటుంది... నాది చాలా లేతగా ఉంటుంది... ఇది గమనిస్తే చాలు ఎవరు ఏ పాట పాడారో అర్థమవుతుంది..." అంటూ వివరణ ఇచ్చుకొనేవారు సుమన్ కళ్యాణ్ పూర్.

ప్రతిభావంతులకు ఏదో ఒకరోజున అవకాశాలు తప్పకుండా వెదుక్కుంటూ వస్తాయని చెప్పవచ్చు. 1960లలో 'రాయల్టీ' విషయంలో మహ్మద్ రఫీ, లతా మంగేష్కర్ మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. దాంతో రఫీతో తాను కలసి పాట పాడనని లతా మంగేష్కర్ భీష్మించుకున్నారు. అందువల్ల సంగీత దర్శకులు రఫీ గానంతో సాగుతూ, ఆయనకు జోడీగా సుమన్ కళ్యాణ్ పూర్ ను ఎంచుకొనేవారు. అలా రఫీ-సుమన్ జోడీ దాదాపు వందకు పైగా యుగళగీతాలు పాడి అలరించారు. ప్రస్తుతం సుమన్ కళ్యాణ్‌ పూర్ వయసు 88 సంవత్సరాలు. భారత ప్రభుత్వం ఈ మధురగాయనిని 2023లో పద్మభూషణ్ తో గౌరవించింది. ఈ నాటికీ ఆ నాటి సుమన్ మాధుర్యాన్ని వింటూనే పరమానందం చెందుతున్నారు అభిమానులు.

Updated Date - Apr 29 , 2025 | 06:14 PM