Dhurandhar: దురంధర్.. తెలుగువారికి నచ్చుతాడా
ABN , Publish Date - Dec 15 , 2025 | 12:55 PM
ప్రస్తుతం సినిమాకు భాషతో సంబంధం లేదు. కథ బావుండి.. పాజిటివ్ టాక్ వచ్చింది అంటే చాలు.. ఏ భాషలో ఉన్నా కూడా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు.
Dhurandhar: ప్రస్తుతం సినిమాకు భాషతో సంబంధం లేదు. కథ బావుండి.. పాజిటివ్ టాక్ వచ్చింది అంటే చాలు.. ఏ భాషలో ఉన్నా కూడా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. ఈ మధ్యకాలంలో ప్రతి సినిమా పాన్ ఇండియా లెవెల్ లోనే రిలీజ్ అవుతుంది. అన్ని భాషల్లో సినిమాను రిలీజ్ చేస్తున్నారు. అయితే కొంతమంది మేకర్స్ మాత్రం తమ భాషలో సినిమాను రిలీజ్ చేసి మంచి విజయాన్ని అందుకుంటే వేరొక భాషలో డబ్ చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్య ధర్ (Adithya Dhar) కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం దురంధర్. అక్షయ్ ఖన్నా, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్ లాంటి స్టార్స్ నటించిన ఈ చిత్రంలో సారా అర్జున్ హీరోయిన్ గా నటించింది. ఎన్నో అంచనాల నడుమ డిసెంబర్ 5 న రిలీజ్ అయ్యిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. మొదట మిక్స్డ్ టాక్ అందుకున్నా.. రికార్డ్ కలక్షన్స్ రాబట్టి బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసింది. రూ. 140 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం కేవలం 10 రోజుల్లోనే రూ. 500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి రికార్డ్ సృష్టించింది.
దురంధర్ వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా. దేశభక్తి అంశాలతో కూడిన స్పై యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. ఇక స్టార్ క్యాస్టింగ్ ఉండడంతో సినిమాపై మరింత హైప్ పెరిగింది. ముఖ్యంగా అక్షయ్ ఖన్నా నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అయితే దురంధర్ కేవలం హిందీలో మాత్రమే రిలీజ్ అయ్యింది. అయినా సినిమా బావుంది అని తెలియడంతో కొంతమంది తెలుగు అభిమానులు భాషతో సంబంధం లేకుండా హిందీలోనే చూసారు. తాజాగా అభిమానుల కోరిక మేరకు డైరెక్టర్ కమ్ నిర్మాత ఆదిత్య ధర్ ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారని టాక్. అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్ 19 న దురంధర్ తెలుగు వెర్షన్ ను రిలీజ్ చేయనున్నారట.
ఇక ఇక్కడే పెద్ద సమస్య. దురంధర్.. హిందీ వారికి నచ్చినంత తెలుగువారికి నచ్చుతుందా.. ? అనేది డౌట్. ఎందుకంటే ఎంత దేశభక్తి సినిమా అయినా కూడా ఇందులో వయలెన్స్ చాలా అంటే చాలా ఎక్కువ ఉందని ట్రైలర్ చూస్తేనే అర్ధమవుతుంది. తెలుగువారు అంత వయలెన్స్ ను ఇష్టపడతారా అంటే.. యానిమల్, మార్కో నే ఉదాహరణ అని కొందరు చెప్పుకొస్తున్నారు. ఆ లెక్కన చూస్తే దురంధర్ తెలుగువారికి కూడా నచ్చుతాడు అని చెప్పుకొస్తున్నారు. మరి తెలుగులో దురంధర్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.