The Family Man Season 3 Review: ది ఫ్యామిలీ మ్యాన్ 3.. ఓటీటీ రివ్యూ! సిరీస్ ఎలా ఉందంటే?
ABN , Publish Date - Nov 23 , 2025 | 02:43 PM
ఇండియాస్ మోస్ట్ హైప్డ్, యాంటిసిపేటెడ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్(The Family Man). తెలుగు యువ దర్శక ద్వయం రాజ్(Raj), డీకే(DK) దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్ ఒకదాన్ని మించి మరోటి సంచలన విజయాలు సాధించాయి.
The Family Man Season 3 Review: ఇండియాస్ మోస్ట్ హైప్డ్, యాంటిసిపేటెడ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ (The Family Man). తెలుగు యువ దర్శక ద్వయం రాజ్(Raj), డీకే(DK) దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్ ఒకదాన్ని మించి మరోటి సంచలన విజయాలు సాధించాయి. దాంతో ఎన్నో అంచనాల నడుమ నాలుగేండ్ల తర్వాత ఈ సిరీస్‌లో మూడవ సీజన్ 7 ఎపిసోడ్లతో సుమారు ఆరు గంటల నిడివితో ఈ శుక్రవారం డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అయితే ఈ సారి సీజన్ కేవలం రాజ్, డీకేనే కాకుండా కొత్తగా మరో ఇద్దరు డైరెక్ట్ చేయడం విశేషం. మరి ఈ సీజన్ ఎలా ఉందో తెలుసుకుందాం పదండి.
కథ:
సెవన్ సిస్టర్‌గా పిలవబడే ఈశాన్య భారతంలోని రాష్ట్రాలలో అక్కడి వనరులు కాపాడాలని, స్థానికులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ, తమకంటూ ప్రత్యేక గుర్తింపు కావాలని కొంతమంది ప్రజలు రెబల్ గ్రూపుగా ఏర్పడి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటారు. ఇదే అదనుగా భావించిన చైనా, పాక్ దేశాలు రెబల్స్‌కు ఏ మాత్రం సంబంధం లేకుండానే.. వారిని బాధ్యులుగా చూపిస్తూ అక్కడ నిత్యం అశాంతి, కల్లోలం ఉండేలా ప్రయత్నాలు చేస్తుంటాయి. ఈ క్రమంలో చైనా ‘గువాన్-యు’ పేరుతో ఓ సీక్రెట్ ప్రాజెక్ట్ ప్రారంభిస్తుంది. ఈ ప్లాన్‌ను ముందుగానే పసిగట్టిన భారత ప్రభుత్వం 'ప్రాజెక్ట్ సహకార్'ను ముందుకు తెచ్చి, రెబల్ గ్రూపులతో చర్చలు జరిపి శాంతి స్థాపన చేయాలని ప్రయత్నిస్తుంది. ఈ బాధ్యతను టాస్క్ విభాగానికి అప్పగించడంతో టాస్క్ సీనియర్ అధికారి కుల్‌కర్ణి (దలిప్ తాహిల్), శ్రీకాంత్ తివారీ (మనోజ్ బాజ్ పాయి) నాగాలాండ్‌కు చేరుకుంటారు.
అయితే.. అదే సమయంలో అక్కడ చర్చలు సఫలమైతే ఇబ్బందులు తప్పవని, తమ వ్యాపారాలు దెబ్బ తింటాయని భావించిన లండన్‌లో నివసించే ఇండియాకు చెందిన ఓ బడా వ్యాపారవేత్త తన అసిస్టెంట్ మీరా ఎస్టిన్ (నిమ్రత్ కౌర్) ను రంగంలోకి దింపుతాడు. ఆమె నాగాలాండ్ కేంద్రంగా డ్రగ్స్ బిజినెస్ నడిపించే రుక్మాంగద (జైదీప్ అహ్లావత్) అనే స్మగ్లర్ సాయంతో శాంతి చర్చలను అడ్డుకునేందుకు కుట్ర పన్నుతుంది. అందులో భాగంగా వారు రెబల్స్ ముసుగులో టాస్క్ బృందంపై చేసిన దాడిలో కులకర్ణి, రెబల్ లీడర్ అక్కడిక్కడే చనిపోగా శ్రీకాంత్ తీవ్రంగా గాయపడి హాస్పిటల్ లో చేరుతాడు. అతను కోలుకుని బయటకు వచ్చే సమయానికి అతడినే హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ముద్ర వేస్తారు. పోలీసులు జరిపిన విచారణలో శ్రీకాంత్ ఫొన్ నుంచి వచ్చిన సిగ్నల్స్ ఆధారంగానే ఈ దాడి జరిగిందని, వారిరువురి మరణానికి కారణం అతనే అని నిర్థారిస్తారు. అంతేగాక అరెస్టు వారెంటు కూడా జారీ అవడంతో కుటుంబంతో కలిసి శ్రీకాంత్ పరారవుతాడు.
ఈ నేపథ్యంలో.. చర్చలను అడ్డుకోవడం వెనుక అసలు మాస్టర్ మైండ్ ఎవరిది? ఈ దాడితో రుక్మాకు కలిగే అసలు ప్రయోజనం ఏమిటి? తనపై ఉన్న ఆరోపణల నుంచి శ్రీకాంత్ ఎలా బయటపడతాడు? టాస్క్ రహస్యాలు బయటకు చెబుతున్నది ఎవరు? ఈ ప్రశ్నల జవాబుల చుట్టూ సీజన్ 3 తిరుగుతుంది. మొదటి రెండు సీజన్లు ఉగ్రవాదులు, ఎల్.టి.టి.ఈ. తో దేశ భద్రతకు ఏర్పడే ప్రమాదం వంటి ఘట్టాలతో సాగగా ఈసారి అందుకు భిన్నంగా కథానాయకుడినే ప్రభుత్వ దృష్టిలో నేరస్తుడిగా మారడం, అతని కోసం ప్రత్యేక టీమ్ రంగంలోకి దిగడం కొత్త పాయింట్.
విశ్లేషణ:
సిరీస్ ప్రారంభమే ఫ్యామిలీ పూజతో ప్రారంభించి వెంటనే కథలోకి తీసుకెళ్లారు. కథనం కాస్త నిదానంగా సాగినా నాగాలాండ్ ట్రాక్‌తో కథలో వేగం పెరుగుతుంది. ఆ పై ఫ్యామిలీ సైబర్ వలలో చిక్కుకోవడం, అందులో నుంచి బయట పడేందుకు శ్రీకాంత్, అతని మిత్రుడు JK చేసే పనులు నవ్వు తెప్పిస్తూ ఆసక్తికరంగా సాగుతూనే కాస్త లాగ్ చేసినట్లు అనిపిస్తుంది. ఇక హీరోకు, విలన్‌లకు తమ ఫ్యామిలీ ఎమోషన్స్‌ను కీ పాయింట్‌గా పెట్టి జరగబోయేది పర్సనల్ వార్‌గా మార్చిన విధానం బాగానే ఉంటుంది. కానీ, ఈసారి థ్రిల్ ని మిస్ చేశారు అని చెప్పొచ్చు. మొదటి రెండు సీజన్స్ లో శ్రీకాంత్ వేసే ఎత్తులు.. అతని కామెడీ ఇందులో కొద్దిగా తగ్గిందని చెప్పాలి. ఈసారి ఎక్కువ స్క్రీన్ ప్రజెన్స్ అంతా రుక్మా, మీరా తీసుకున్నారు. వారినే హైలైట్ చేసినట్లు కనిపిస్తుంది.
‘ఫర్జీ’ సిరీస్‌తో చేసిన క్రాస్ ఓవర్, విజయ్ సేతుపతి ఎంట్రీ ప్రేక్షకులకు మంచి సర్ప్రైజ్. అంతేగాక టికెట్ కలెక్టర్‌గా రాగ్ మయూర్, చివర్లో సందీప్ కిషన్ పాత్రలు తెలుగు వారిని ఆకట్టుకుంటాయి. కానీ, ఆరు ఎపిసోడ్స్ లో అంతగా ప్రభావం లేని కథలానే అనిపిస్తుంది. రెండు సీజన్స్ తో పోలిస్తే ఈసారి ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా సరిగ్గా చూపించలేదు. చివర్లో రుక్మా పారిపోవడం.. శ్రీకాంత్ మళ్లీ గాయాలతో పడిపోవడం.. ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ డీల్ ని ఓకే చేయడం.. లాంటివి చూపించి ఎండ్ చేశారు కానీ, ఒక ఎండింగ్ కు మాత్రం తీసుకురాలేదు. నాలుగో సీజన్ కు ఇదే ప్రారంభం అని ప్రేక్షకులు అనుకోవడమే తప్ప మేకర్స్ మాత్రం అది చెప్పలేదు. అయితే తెలుగు ఆడియోలో వారికి ఇతరులతో చెప్పించిన డబ్బింగ్ సెట్ అవలేదు. తెలుగమ్మాయి శ్రేయ ధన్వంతరికి మంచి రోల్ పడింది.
ఇక చివరి ఎపిసోడ్స్‌లో యాక్షన్, నాగా రెబల్స్‌తో జరిపిన మిషన్, చాలా సీన్లు ముందే ఊహించేలా ఉన్నా ఆసక్తికరంగా ఉంటుంది. అయితే క్లైమాక్స్ ఎలాంటి హింట్ ఇవ్వకుండానే, 4వ సీజన్ కోసం దాచినట్లుగా మధ్యలోనే హడావుడిగా ముగించిన ఫీల్ వస్తుంది. ఇదిలా ఉంటే.. ఒక్కచోట లిప్‌కిస్ తప్పితే ఈమారు ఎలాంటి అశ్లీలత, అసభ్యతల జోలికి పోకుండా సీజన్‌ను తీర్చిదిద్దడం అభినందనీయం. అయితే అక్కడక్కడ నాలుగైదు బూతులు మాత్రం పంటికింద రాయిలా తగులుతాయి. ఇక చివరలో బూతులతో వచ్చే ప్రాస మంచి నవ్వులు పంచుతుంది. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లవర్స్‌కు, కొత్తగా చూసే వారికి టైం వేస్ట్ అనే ఫీల్ అయితే రాదు. విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగానే ఉన్నాయి. ఈ సిరీస్ ఫ్యామిలీ అంతా కలిసి చూడవచ్చు. కాకపోతే ముందు రెండు సీజన్స్ అంత థ్రిల్ ఈ సీజన్ ఇవ్వలేదు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. రాజ్ అండ్ డీకే ఇంకాస్తా ఎంగేజింగ్ అయ్యేలా సీన్స్ రాసి ఉంటే ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 కూడా టాప్ రేంజ్ లో ఉండేది.
ట్యాగ్ లైన్: ఫ్యామిలీ మ్యాన్ 3 .. ఇంకాస్తా థ్రిల్ ఉంటే బావుండేది
రేటింగ్: 2.5/5