Tanushree Dutta: ఇంట్లో వాళ్లు వేధిస్తున్నారు
ABN , Publish Date - Jul 24 , 2025 | 05:35 AM
మీ టూ అంటూ ఏడేళ్ల క్రితం బాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన హీరోయిన్ తనుశ్రీ దత్తా
మీ టూ అంటూ ఏడేళ్ల క్రితం బాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన హీరోయిన్ తనుశ్రీ దత్తా, మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఏడుస్తూ పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అందులో తనను ఇంట్లో వాళ్లే వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘నా ఇంట్లోనే నేను వేధింపులకు గురవుతున్నాను. ఈ విషయంపై పోలీసులను సంప్రదించా. స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయమన్నారు. కానీ నా ఆరోగ్యం సహకరించట్లేదు. రేపో, ఎల్లుండో కుదుటపడ్డాక వెళ్తా. ఇంట్లో పని మనుషులు నా మాట వినరు. ఇంట్లోని వస్తువులను దొంగలిస్తుంటారు కూడా. నా పనులన్నీ నేనే చేసుకోవాల్సి వస్తోంది. నేను ఈ వేధింపులను తట్టుకోలేకున్నా.. ఇది 2018 మీ టూ సమయం నుంచి జరుగుతున్నాయి. వీటి వల్ల నా ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. పరిస్థితి చేయిదాటక ముందే ఎవరో ఒకరు నన్ను రక్షించండి’’ అని పేర్కొన్నారు. కాగా, 2018లో మీ టూ ఉద్యమం సమయంలో నటుడు నానా పటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని, అలాగే దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తనను ఓ సందర్భంలో వేధించారంటూ తనుశ్రీ దత్తా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. బాలకృష్ణ కథానాయకుడిగా తెరకెక్కిన ‘వీరభద్ర’ సినిమాలో తనుశ్రీ దత్తా నటించారు.