Sulakshana Pandit: 'సలక్షణ'నట, గాయని కన్నుమూత

ABN , Publish Date - Nov 07 , 2025 | 05:27 PM

ప్రముఖ గాయని, నటి సులక్షణ పండిట్ అనారోగ్యంతో ముంబైలో కన్నుమూశారు. 70, 80 దశకంలో ఆమె పలు చిత్రాలలో చక్కని పాత్రలు పోషించారు.

sulakshana Pandit

సీనియర్ గాయని, నటీమణి సులక్షణ పండిట్ (71) అనారోగ్యంతో కన్నుమూశారు. గురువారం రాత్రి ఆమెకు గుండెపోటు రావడంతో ముంబైలోని నానావతి హాస్పిటల్ కు తీసుకెళ్ళారు అయితే అప్పటికే ఆమె తుది శ్వాస విడిచారని అక్కడి వైద్యులు తెలిపారు.

ప్రముఖ సంగీత కుటుంబంలో జన్మించిన సులక్షణ పండిట్ (Sulakshana Pandit) బాల్యంలోనే గాయనిగా కెరీర్ ప్రారంభించారు. 1967లో వచ్చిన 'తఖ్ దీర్' సినిమాలోని సముందర్ పార్ సే' గీతాన్ని బాల గాయనిగా లతా మంగేష్కర్ తో కలిసి సులక్షణ పండిట్ గానం చేశారు. ఇక ఆ తర్వాత యుక్తవయసులో నటిగానూ సులక్షణ పండిట్ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 1975లో సంజీవ్ కుమార్ (Sanjeev Kumar) సరసన ఆమె నటించిన 'ఉల్జా' (Uljhan) చిత్రం చక్కని విజయం సాధించడంతో ఆమె వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం కలగలేదు.


1970, 80 దశకాలలో సంజీవ్ కుమార్, రాజేశ్‌ ఖన్నా, వినోద్ ఖన్నా, శశికపూర్, జితేంద్ర, శత్రుఘ్న సిన్హా వంటి అగ్ర కథానాయకుల సరసన సులక్షణ పండిట్ నటించారు. ఆమె కెరీర్ లో 'హేరా ఫేరీ, అప్నాపన్, ఖాందాన్, చెహ్రే పే చెహ్రా (Chehre Pe Chehra), ధరమ్ కాంటా (Dharam Khanta), వక్త్ కి దీవార్' వంటి సినిమాలు ఉన్నాయి. హిందీతో పాటు బెంగాలీ చిత్రాలలోనూ సులక్షణ పండిట్ నటించారు. అవివాహితగానే ఉన్న ఆమె పలు భాషా చిత్రాలలో పాటలు పాడారు. గజల్ సింగర్ గానూ ఆమెకు మంచి గుర్తింపు ఉంది. కిశోర్ కుమార్, శైలేందర్ సింగ్, యేసుదాస్, మహేంద్ర కపూర్, ఉదిత్ నారాయణ వంటి ప్రముఖ గాయకులతో సులక్షణ పండిట్ యుగళ గీతాలు పాడారు. చివరగా ఆమె 1996లో తన సోదరులు జతిన్ - లలిత్ స్వరపర్చిన 'ఖామోషీ: ది మ్యూజికల్' చిత్రంలో 'సాగర్ కినారే దో దిల్' పాటకు తన స్వరాన్ని అందించారు.

సులక్షణ పండిట్ మృతిపట్ల బాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు సంతాపాన్ని తెలిపారు.

Also Read: Indian Panorama: గోవాలో సంక్రాంతికి వస్తున్నాం....

Also Read: Sujeeth: సచిన్ తో సుజిత్.. ఫ్రేమ్ అదిరిపోయిందిగా

Updated Date - Nov 07 , 2025 | 06:25 PM