Sholay: 50 ఏళ్ళ 'షోలే'.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నాళ్లు ఆడిందో తెలుసా!

ABN , Publish Date - Aug 15 , 2025 | 07:34 AM

'షోలే' కంటే ముందు, తరువాత ఎన్నెన్నో సూపర్ డూపర్ హిట్స్ వచ్చాయి... 'షోలే'ను మించిన హిట్స్ నూ జనం చూశారు... అయినా 'షోలే' సినిమాకే స్పెషల్ గా ఫ్యాన్స్ ఉండడం విశేషం!

sholay

'షోలే' కంటే ముందు, తరువాత ఎన్నెన్నో సూపర్ డూపర్ హిట్స్ వచ్చాయి... 'షోలే'ను మించిన హిట్స్ నూ జనం చూశారు... అయినా 'షోలే' సినిమాకే స్పెషల్ గా ఫ్యాన్స్ ఉండడం విశేషం! అంతటి స్పెషాలిటీని సొంతం చేసుకున్న 'షోలే' ఆగస్టు 15తో యాభై ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది... దాంతో 'షోలే' ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు...

రమేశ్ షిప్పీ (Ramesh Sippy) దర్శకత్వంలో ఆయన తండ్రి జి.పి. షిప్పీ (GP Sippy) నిర్మించిన షోలే (Sholay) 1975 ఆగస్టు 15న విడుదలయింది. ఈ యేడాదితో యాభై ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న 'షోలే' సినిమాను ఇటీవలే 4కే టెక్నాలజీతో రూపొందించారు. అందులో డైరెక్టర్స్ కట్ ప్రకారం విలన్ చివరలో చనిపోతాడు. ఆ వర్షన్ కే మోడరన్ టెక్నాలజీ హంగులు అద్దారు. ఈ మధ్యే 4కేలోకి అనుసంధానం చేసిన 'షోలే'ను ఇటలీలో ప్రదర్శించారు. 3 గంటల 24 నిమిషాల డైరెక్టర్స్ కట్ ను ఈ యేడాది సెప్టెంబర్ 6న టొరంటో ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ లో ప్రదర్శించనున్నారు. దాంతో డైరెక్టర్స్ కట్ ను చూడాలని 'షోలే' చిత్రాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే 70 ఎమ్.ఎమ్., 35 ఎమ్.ఎమ్., సినిమాస్కోప్, 3డి వంటి వర్షన్స్ తో ప్రేక్షకులను అలరించిన 'షోలే' ఇప్పుడు 4కే లోనూ కనువిందు చేయనుంది. అయితే ఈ వర్షన్ ను మన దేశంలో ఎప్పుడు విడుదల చేస్తారో ఇంకా మేకర్స్ నిర్ణయించలేదు. అందువల్ల ప్రస్తుతం లభ్యమవుతున్న సినిమానే తిలకిస్తూ 'షోలే' అభిమానులు ఆనందించడం గమనార్హం!.

యాభై ఏళ్ళ క్రితం 'షోలే' విడుదలైనప్పటికే భక్తిరస చిత్రం 'జై సంతోషిమా' రిలీజై విజయవిహారం చేస్తోంది. దాంతో 'షోలే' వంటి యాక్షన్ మూవీవైపు ఎవరూ అంతగా దృష్టి సారించలేదు. మెల్లగా ఆర్డీ బర్మన్ స్వరాల్లో రూపొందిన 'షోలే' గీతాలు అలరిస్తూ ఉండడంతో ఈ సినిమా టాక్ స్ప్రెడ్ అయింది. అంతకు ముందు 'షోలే'ను చూసి ఎంతోమంది పెదవి విరిచారు. ఫ్లాప్ అనీ ప్రచారం చేశారు... రెండు వారాలయిన తరువాత అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ 'షోలే' ఆడుతున్న థియేటర్లన్నిటా 'హౌస్ ఫుల్' బోర్డ్స్ కనిపించసాగాయి. ముంబైలోని మినర్వా థియేటర్ లో ఈ సినిమా ఏక ధాటిగా మూడేళ్ళు ప్రదర్శితమయింది. తరువాత మరో రెండేళ్ళు ఒక్క ఆటతో రంజింప చేసింది. ధర్మేంద్ర (Dharmendra), సంజీవ్ కుమార్ (Sanjay kumar), హేమమాలిని (Hema Malini), అమితాబ్ బచ్చన్ ( Amitabh Bachchan), జయబాధురి, అంజాద్ ఖాన్ నటించిన 'షోలే'లోని చిన్నాచితకా పాత్రలు సైతం జనం మదిలో తిష్ట వేసుకోవడం విశేషం! అంజాద్ పోషించిన 'గబ్బర్ సింగ్' (Gabbar Singh) పాత్ర యావద్భారతాన్నీ విశేషంగా ఆకట్టుకుంది. ఓ యాక్టర్ విలన్ పాత్రతో దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ను సంపాదించడం 'షోలే'తోనే మొదలయింది.

sholay.jfif

'షోలే' చిత్రం సగటు సినిమా ప్రేక్షకుణ్ణి దేశవ్యాప్తంగా కట్టిపడేసింది.. తెలుగు నేలపైన అందునా ఉమ్మ‌డి ఆంధ్రప్రదేశ్ రాజధానిలో యన్టీఆర్ సొంత థియేటర్ రామకృష్ణ 70 ఎమ్.ఎమ్.లో 'షోలే' చిత్రం 80 వారాలకు పైగా ఆడి ఈ నాటికీ రికార్డ్ గా నిలిచే ఉంది. ఈ చిత్రంలో ఆనంద్ బక్షీ రాసిన అన్ని పాటలూ ఆదరణ పొందాయి. వాటిని మించి సలీమ్-జావేద్ రాసిన సంభాషణలు, కథ, కథనం కూడా ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానం సంపాదించాయి. ఇక తెలుగు నేల పైనే అనేక కేంద్రాలలో శతదినోత్సవం చూసిన 'షోలే' దేశవ్యాప్తంగా వందకు పైగా కేంద్రాలలో నూరు రోజులు నడిచింది. అనేక కేంద్రాలలో గోల్డెన్ జూబ్లీ జరుపుకుంది. అన్ని కేంద్రాలలో విజయవిహారం చేసిన సినిమా హిందీ చిత్రసీమలో ఈ నాటికీ మరోటి లేదని చెప్పవచ్చు. మరి రాబోయే 4కే వర్షన్ ప్రేక్షకులను ఎలా మురిపిస్తుందో చూద్దాం.

Updated Date - Aug 15 , 2025 | 07:34 AM