Shah Rukh Khan: కెరీర్ ఆరంభం నుంచి ఇప్పటికీ అదే ఫార్ములా
ABN , Publish Date - Nov 02 , 2025 | 02:03 PM
జాతీయ ఉత్తమ నటుడిగా తొలిసారి ‘జవాన్’ సినిమాకుగాను ఇటీవల అవార్డు అందుకున్న ‘బాలీవుడ్ బాద్‌షా’ షారుక్... ఈరోజు (నవంబర్ 2) 60వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా ‘కింగ్’ఖాన్ గురించి కొన్ని ఆసక్తికర ముచ్చట్లివి..
జాతీయ ఉత్తమ నటుడిగా తొలిసారి ‘జవాన్’ (Jawan) సినిమాకుగాను ఇటీవల అవార్డు అందుకున్న‘బాలీవుడ్ బాద్‌షా’ షారుక్ (Shah Rukh Khan)... ఈరోజు (నవంబర్ 2) 60వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా ‘కింగ్’ఖాన్ (king khan)గురించి కొన్ని ఆసక్తికర ముచ్చట్లివి...
ఐదు గంటలే నిద్రపోతా.. (Shah Rukh Khan@6)
స్టార్ల జీవితం పూలపాన్పు ఏమీ కాదు. షూటింగ్ పూర్తి చేసుకుని, తెల్లవారుఝామున 2 గంటలకు ఇంటికి వస్తా. ఉదయం 5 గంటలకు నిద్రపోయి, పది గంటలకు లేస్తా. అంటే రోజుకు 5 గంటలు మాత్రమే నిద్రపోతా. అలాగే రోజుకి ఒక్క పూట మాత్రమే తింటాను. ఐదు గంటల నిద్ర, ఒక పూట భోజనం.. ఇదే నా రోజువారీ దినచర్య. అంటే ఎంతగా కష్టపడతానో అర్థం చేసుకోవచ్చు.
స్క్రిప్ట్ మొత్తం చదవను..
నా స్క్రిప్ట్ సెలక్షన్ కాస్త భిన్నంగా ఉంటుంది. నిజానికి నా దగ్గరకు వచ్చిన కథలను ప్రతీ పేజీ చదవను. నా పాత్ర ఎలా ఉంది? అది ప్రేక్షకులపై ఎలాంటి ప్రభావం చూపనుంది? అనే విషయాలపైనే ప్రధానంగా దృష్టి పెడతా. కథలోని భావోద్వేగాన్ని అర్థం చేసుకుంటా. దర్శకుడి విజన్‌ను నమ్ముతా. ఇవన్నీ కుదిరితేనే సినిమా బాగా వస్తుందనేది నా నమ్మకం. కెరీర్ ఆరంభం నుంచి ఇదే ఫార్ములాను ఫాలో అవుతూ వస్తున్నా.

వాళ్లే నా బాస్‌లు...
నా కూతురు సుహానాఖాన్ మంచి మనసున్న అమ్మాయి. ప్రతిభావంతురాలు కూడా. తనకు ఆత్మవిశ్వాసం ఎక్కువ. ఒక్కోసారి వయసుకు మించిన పరిణతితో ఆలోచిస్తూ నన్ను ఆశ్చర్యపరుస్తుంది. తను నాన్న కూచీనే. ఇక నా కొడుకు ఆర్యన్‌ఖాన్ ఇటీవల ‘ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ వెబ్‌సిరీస్‌తో తన మార్క్ చూపించాడు. దర్శకుడిగా తనకేం కావాలో ఆర్యన్‌కు స్పష్టత ఉంది. అతడు పర్‌ఫెక్షనిస్ట్. ఇద్దరం కలిసి సినిమాలు చూస్తూ ఫిల్మ్ మేకింగ్ గురించి చర్చించుకుంటాం. ఇంట్లో వీళ్లద్దరే నాకు బాస్‌లు. నన్ను సరదాగా టీజ్ చేస్తూ ఆట పట్టిస్తుంటారు.
ఇంట్లోనే లైబ్రరీ
నేను పుస్తకాలు బాగా చదువుతా. ఆ ఇష్టంతోనే మా ఇంట్లో ప్రత్యేకంగా చిన్నపాటి లైబ్రరీ ఏర్పాటు చేసుకున్నా. అందులో వేలాది పుస్తకాలుంటాయి. షూటింగ్ లేకపోతే లైబ్రరీలోనే ఉంటా. ఫోన్ స్విచ్చాఫ్ చేసి, పుస్తకాలు చదువుతుంటా. సినిమాకి సంబంధించి ఏవైనా కొత్తకొత్త ఆలోచనలు వస్తే నోట్ చేసుకుంటా. డగ్లస్ ఆడమ్స్ రాసిన ‘ది హిచ్‌హైకర్స్ గైడ్ టు ది గెలాక్సీ’.. నా ఆల్ టైమ్ ఫేవరెట్ బుక్.
కాఫీ లవర్‌ని
నాకు బ్లాక్ కాఫీ అంటే ఎంతిష్టమో. పొద్దున్నే కాఫీ గొంతులో పడితే గానీ రోజు మొదలైనట్టుండదు. అదేంటోగానీ కాఫీ వాసన నాకు ఎక్కడ లేని ఉత్సాహాన్ని అందిస్తుంది. ఆ వాసన పీలిస్తేనే సగం కడుపు నిండిపోతుంది. రోజుకు కనీసం 25 నుంచి 30 కప్పుల బ్లాక్ కాఫీ తాగుతా. ఒక్కమాటలో చెప్పాలంటే కాఫీ నా జీవితంలో భాగమైపోయింది.

ఫుట్‌బాల్ ఇష్టం
నాకు ఆటలంటే పిచ్చి. ఫుట్‌బాల్‌కి పెద్ద ఫ్యాన్‌ని. ఎంత బిజీగా ఉన్నా సరే ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లను కచ్చితంగా చూస్తా. మాంచెస్టర్ యునైటెడ్, లివర్‌పూల్ ఫుట్‌బాల్ క్లబ్స్ నా ఫేవరెట్. ఎక్కువగా ఛారిటీ ఫుట్‌బాల్ మ్యాచ్‌లలో పాల్గొంటా. ఫిట్‌గా ఉండటానికి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి నాకు ఫుట్‌బాల్ చక్కగా సహాయపడుతుంది.
పర్సనల్ ఛాయిస్
నిద్రపోయే ముందు నా తల్లిదండ్రుల చిత్రపటాల వద్దకు వెళ్లి, ఆ రోజు ఎలా గడిచిందో వారితో పంచుకోవడం నాకు అలవాటు.
లాంగ్ డ్రైవ్‌లో ఎక్కువగా మెలోడీస్ వినడానికి ఇష్టపడతా. నా ప్లే లిస్ట్ మొత్తం కిషోర్ కుమార్, జగ్జీత్‌సింగ్ పాటలతో నిండి ఉంటుంది.
ఒత్తిడిలో ఉన్నప్పుడు.. ఎవరితోనూ వాదించను, అరవను. కాసేపు మౌనంగా ఉంటా. ఒంటరిగా కూర్చుంటా. నచ్చిన సంగీతం వింటా.
లగ్జరీ వాచ్‌లు, సన్‌గ్లాసెస్ సేకరించడం అంటే భలే ఇష్టం.
ఫేవరెట్ హాలిడే డెస్టినేషన్ లండన్. అది నాకు సెకండ్ హోమ్‌లాంటిది. వీలు దొరికినప్పుడల్లా పిల్లలతో సహా అక్కడ వాలిపోతా.
555 నా లక్కీ నంబర్. అందుకే నా కార్ల నంబర్ ప్లేట్లపై ఆ నంబరే ఉంటుంది.