Sara Arjun: బ్యాక్ టు బ్యాక్ క్రేజీ మూవీస్

ABN , Publish Date - Nov 18 , 2025 | 04:29 PM

బాలనటిగా మెప్పించిన సారా అర్జున్ ఇప్పుడు హీరోయిన్ గా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. దురంధర్ సినిమాలో రణవీర్ సింగ్ సరసన సారా నటించింది. అలానే ఆమె నటించిన తెలుగు సినిమా యుఫోరియా సైతం డిసెంబర్ లోనే జనం ముందుకు వస్తోంది.

Sara Arjun

సారా అర్జున్ (Sara Arjun) అనగానే తెలుగువారికి ఠక్కున గుర్తొచ్చే సినిమా విక్రమ్ (Vikram) నటించిన తమిళ అనువాద చిత్రం 'నాన్న' (Nanna). తమిళంలో 'దైవ తిరుమగళ్' (Deiva Thirumagal) పేరుతో రూపుదిద్దుకున్న ఈ సినిమా బాలనటిగా సారా అర్జున్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. అప్పటి నుండి పలు వాణిజ్య ప్రకటనల్లో నటించి, రాణించింది సారా అర్జున్. ఆమె తండ్రి రాజ్ అర్జున్ నటుడు కావడంతో ఆమెకు ఫిల్మ్ ఎంట్రీ సులభతరమైంది. తమిళంతో పాటు హిందీలోనూ బాలనటిగా నటించి మెప్పించింది సారా అర్జున్. తమిళంలో ఈ చిన్నారి నటించిన 'శైవం' సినిమా తెలుగులోనూ 'దాగుడు మూతల దండాకోర్' పేరుతో రీమేక్ అయ్యింది. ఇక్కడ కూడా తన పాత్రను సారా అర్జునే చేసింది. ఆపైన పలు చిత్రాలలో బాలనటిగా మెప్పించిన సారా యుక్త వయసులో మణిరత్నం (Maniratnam) తెరకెక్కించిన 'పొన్నియన్ సెల్వన్' (Ponniyin Selvan) రెండు భాగాల్లోనూ నటించింది.


విశేషం... ఏమంటే ఈ యేడాది నాయికగా బాలీవుడ్ లోకి ఓ క్రేజీ ప్రాజెక్ట్ తో సారా అర్జున్ ఎంట్రీ ఇస్తోంది. 'ఉరి: ది సర్జికల్ స్ట్రైక్' మూవీతో డెబ్యూ డైరెక్టర్ గా జాతీయ అవార్డును అందుకున్న ఆదిత్య ధర్ తాజా చిత్రం 'దురంధర్' (Dhurandhar) లో రణవీర్ సింగ్ (Ravneer Singh) సరసన సారా అర్జున్ నటిస్తోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ మంగళవారం విడుదలైంది. ఈ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలోనూ సారా సెంటర్ ఆఫ్ ది ఎట్రాక్షన్ గా నిలిచింది.


sara2.jpg

డిసెంబర్ 5న సారా అర్జున్ నటించిన 'దురంధర్' విడుదల అవుతుంటే.... అదే నెల 25న ఆమె తెలుగులో నటించిన 'యుఫోరియా' (Euphoria) మూవీ విడుదల కాబోతోంది. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ (Gunasekhar) స్వీయ దర్శకత్వంలో నిర్మించిన 'యుఫోరియా'లో భూమిక (Bhumika) ప్రధాన పాత్ర పోషించగా, సారా అర్జున్ ఇందులో అత్యంత కీలకమైన పాత్రను చేసింది. పతాక సన్నివేశంలో సారా అర్జున్ స్క్రీన్ ప్రెజెన్స్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. మరి ఈ రెండు సినిమాల తర్వాత అటు హిందీలో, ఇటు తెలుగులో సారా అర్జున్ బిజీ హీరోయిన్ అవుతుందేమో చూడాలి.

Also Read: Kayadu Lohar: టాస్మాక్ స్కామ్.. హద్దులు దాటారు

Also Read: OTT Movies: ఈ వారం.. రాబోతున్న‌ ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు

Updated Date - Nov 18 , 2025 | 04:35 PM