Saif Ali Khan: ఎవరిని నుండి సంక్రమించిన ఆస్తి... ఎలా పోయింది...

ABN , Publish Date - Jul 08 , 2025 | 06:51 PM

బాలీవుడ్ స్టార్ హీరో పెద్ద కష్టం వచ్చింది. వారసత్వంగా వచ్చిన వేల కోట్ల రూపాయల ఆస్తి అతని కుటుంబం నుండి చేజారినట్టే. పదేళ్లుగా కొనసాగుతున్న ఆస్తి వివాదానికి ఇకనైనా శుభం కార్డు పడుతుంది అనుకుంటే.. సైఫ్ కు మళ్లీ కొత్త సవాల్ ఎదురైంది. ఆస్తితో పాటు అతను చారిత్రక వారసత్వాన్ని సైతం దూరం చేసుకునే పరిస్థితి దాపురించింది.

మధ్యప్రదేశ్ హైకోర్టు తాజా తీర్పుతో సైఫ్ అలీఖాన్ కుటుంబం నుండి రూ. 15,000 కోట్ల విలువచేసే రాజభవనాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశం ఏర్పడింది. ఇది ఇప్పుడు ఎనిమీ ప్రాపర్టీగా పరిగణించబడిందని కోర్టు తేల్చింది.


హర్యానాలోని గురుగ్రామ్ సమీపంలో ఉన్న పటౌడి ప్యాలెస్ సైఫ్ అలీ ఖాన్‌కు చెందిన రాజభవనం. 1935లో సైఫ్ తాత నవాబ్ ఇఫ్తిఖార్ అలీ ఖాన్ పటౌడి తన భార్య, భోపాల్ రాజకుమారి సజీదా సుల్తాన్ కోసం దీన్ని నిర్మించారు. సుమారు 10 ఎకరాల్లో విస్తరించి, 150కి పైగా గదులను కలిగి ఉన్న ఈ భవనాన్ని 2014లో సైఫ్ సుమారు రూ. 800 కోట్లతో తిరిగి కొనుగోలు చేశాడు. ప్రస్తుతం ఇది కుటుంబ నివాసంగా, పలు సినిమాల షూటింగ్‌లకు వేదికగా ఉపయోగపడుతోంది. ఇటీవల ఇందులోనే 'యానిమల్' మూవీ షూటింగ్ కూడా చేశారు. ఇదే అసలు వివాదానికి కేంద్ర బిందువు.

సైఫ్ అలీ ఖాన్ తాతయ్య హమీదుల్లా ఖాన్, భోపాల్ చివరి నవాబ్. ఆయన పెద్ద కూతురు అబిదా సుల్తాన్ 1950లో పాకిస్తాన్‌కు వలస వెళ్లడంతో, భారత ప్రభుత్వం ఆమెకు చెందిన ఆస్తులను 'ఎనిమీ ప్రాపర్టీ'గా ప్రకటించింది. ఈ ఆస్తులలో భోపాల్‌లోని ఫ్లాగ్‌స్టాఫ్ హౌస్, నూర్ ఉస్ సబా ప్యాలెస్, దార్ ఉస్ సలాం, అహ్మదాబాద్ ప్యాలెస్, హబీబీస్ బంగ్లా, కొహెఫిజా భవనం తదితర ప్యాలెస్‌లు ఉన్నాయి. వీటి మొత్తం విలువ సుమారు రూ. 15,000 కోట్లు! హమీదుల్లా ఖాన్ మరణానంతరం, ఆయన చిన్న కూతురు సజీదా సుల్తాన్ (సైఫ్ అలీ ఖాన్ ముత్తాత) భారత ప్రభుత్వంచే అధికార వారసురాలిగా 1962లో గుర్తించబడింది. ఆపై ఆమె కుమారుడు మన్సూర్ అలీ ఖాన్ పటౌడికి, తరువాత ఆయన కుమారుడైన సైఫ్‌కు ఈ ఆస్తి వారసత్వంగా వచ్చింది.


పటౌడీ కుటుంబానికి చెందిన ఈ విలాసవంతమైన భవనం, గతంలో భోపాల్ చివరి పాలకుడైన నవాబ్ హమీదుల్లా ఖాన్‌కు చెందినది. ఈ భవనాన్ని సైఫ్ అలీ ఖాన్ తన తండ్రి, భారత క్రికెట్ దిగ్గజం మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ నుంచి వారసత్వంగా పొందారు. 2000 సంవత్సరంలో ట్రయల్ కోర్టు ముస్లిం పర్సనల్ లా ప్రకారం సైఫ్ అలీ ఖాన్, ఆయన తల్లి షర్మిలా టాగోర్, సోదరీమణులు సోహా, సబా అలీ ఖాన్‌లను ఈ భవనానికి హక్కుదారులుగా గుర్తించింది. అప్పట్లో ఇది వారి ఆస్తిపై ఉన్న హక్కులను ధృవీకరించినట్లయింది. అయితే ఈ వారసత్వ హక్కులకు ఒక కీలకమైన మలుపు ఏర్పడింది. హమీదుల్లా ఖాన్ మొదటి కుమార్తె అబీదా సుల్తాన్ 1950లో పాకిస్తాన్ వెళ్లి అక్కడి పౌరసత్వం తీసుకున్నారు. దీంతో భారత ప్రభుత్వం ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ (Enemy Property Act) ప్రకారం ఆ ఆస్తినిగా గుర్తించింది. ఈ చట్టం ప్రకారం భారత విభజన సమయంలో లేదా ఆ తరువాత పాకిస్తాన్ వెళ్లిన వ్యక్తులు భారత పౌరసత్వాన్ని వదిలి వెళ్లినట్లయితే వారి ఆస్తులను భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకునే హక్కు ఉంటుంది.

అబీదా సుల్తాన్ భారత పౌరసత్వాన్ని వదిలి వెళ్లిన నేపథ్యంలో 2014లో ప్రభుత్వం ఈ భోపాల్ రాజభవనాన్ని ఎనిమీ ప్రాపర్టీగా ప్రకటించింది. 2024 డిసెంబర్‌లో మధ్యప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక స్టేను ఎత్తివేసి, సైఫ్ అలీ ఖాన్ పిటిషన్‌ను తోసిపుచ్చింది. అప్పటి నుంచి కుటుంబానికి అప్పీల్ చేసుకునే అవకాశం ఉండగా, వారు అప్పీల్ దాఖలు చేయలేదు. దీంతో ప్రభుత్వానికి ఆస్తిని స్వాధీనం చేసుకునే మార్గం సుగమమైంది. ఇక తాజా తీర్పుతో పటౌడీ కుటుంబానికి చెందిన మరో చారిత్రక ఆస్తి వారి చేజారిపోయింది. ఎనిమీ ప్రాపర్టీగా కోర్టు కూడా ధృవీకరించడంతో భోపాల్ పరిపాలన యంత్రాంగం ఈ రాజభవనాన్ని తమ అదుపులోకి తీసుకునేందుకు సిద్ధమవుతోంది.

Updated Date - Jul 08 , 2025 | 06:51 PM