Bollywood: వెండితెరపైకి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బయోపిక్
ABN , Publish Date - Jun 17 , 2025 | 12:44 PM
చిన్న వయసులోనూ చనిపోయిన బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ప్రేమకథ వెండితెరపై ఆవిష్కృతం కాబోతోంది.
మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ (Sushanth Singh Rajput) కన్నుమూసి చూస్తుండగానే ఐదేళ్ళు గడిచిపోయింది. 2020 జూన్ 14న కోట్లాది మంది అభిమానులను విడిచి పెట్టి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వెళ్ళిపోయాడు. భౌతికంగా అతను లేకపోయినా... సినిమా రూపంలో అతను చిరంజీవే! సుశాంత్ మరణాన్ని గమనిస్తే... బాలీవుడ్ లోని చీకటి కోణాలు అనేకం బయటపడతాయి.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి బాలీవుడ్ (Bollywood) లోని కొందరు టాప్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ కారణమే విమర్శలు అప్పట్లో బాగా వచ్చాయి. నెపోకిడ్స్ ను ప్రోత్సహించడానికి ఆసక్తి చూపించే సదరు దర్శక, నిర్మాతలు స్వయంశక్తితో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన వారిని నిరుత్సాహపర్చే వారని, కష్టపడి వారు ఓ స్థాయికి చేరుకున్నా స్టార్ డమ్ వారికి దక్క కుండా కుట్రలు చేసే వారనే ఆరోపణలు వచ్చాయి. అయితే... సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆకస్మిక మరణం వెనుక అతని గర్ల్ ప్రెండ్ రియా చక్రవర్తి (Rhea Chakraborty) హస్తం ఉందని కొందరు అప్పట్లో విమర్శలు గుప్పించారు.
సుశాంత్ తెలుగువారికి హిందీ, అనువాద చిత్రాల ద్వారా పరిచయం తప్పితే... అతను ఏ తెలుగు స్ట్రయిట్ చిత్రంలోనూ నటించలేదు. కానీ అతని ప్రియురాలు రియా చక్రవర్తి మాత్రం 2012లో తన కెరీర్ ను 'తూనీగ తూనీగ' అనే తెలుగు సినిమాతోనే మొదలు పెట్టింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం వెనుక ఆమె హస్తం ఉందనే ఆరోపణల కారణంగా పోలీసు విచారణను సైతం రియా ఎదుర్కొవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడిప్పుడే ఆ పీడకల నుండి ఆమె బయట పడి తిరిగి తన కెరీర్ ను బిల్డప్ చేసుకునే పనిలో పడింది. అయితే తాజాగా సుశాంత్ రాజ్ పుత్ వర్థంతి సందర్భంగా ప్రముఖ దర్శకుడు, స్క్రీన్ ప్లే రైటర్ రుమీ జఫ్రీ తాను సుశాంత్ - రియా ప్రేమకథ ఆధారంగా ఓ సినిమా చేయబోతున్నట్టు తెలిపాడు.
ఈ విషయమై జఫ్రీ మాట్లాడుతూ, 'నేనింకా సుశాంత్ మా మధ్య ఉన్నట్టుగానే ఫీల్ అవుతున్నాను. అతను ఏ క్షణం ఖాళీగా ఉండేవాడు కాదు. సూపర్ యాక్టివ్. ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూనే ఉండేవాడు. అతని హైపర్ యాక్టివ్ నెస్ చూస్తే మాకే భయం వేసేది. రియాతో అతనికి ఉన్న అనుబంధం చాలా ప్రత్యేకమైంది. ఆమె కోసం ప్రాణాలను సైతం అర్పించేంత గొప్ప ప్రేమ అతనిది. ఆమె అప్పుడప్పుడూ సుశాంత్ ను కూల్ డౌన్ చేస్తూ ఉండేది. నిజానికి సుశాంత్ బ్రతికి ఉండగానే ఆ ప్రేమకథను తెరకెక్కించాలని నాకు అనిపించేది. కానీ దురదృష్టవశాత్తు అతను ఇవాళ మా మధ్య లేదు. అయినా... వాళ్ళిద్దరి ప్రేమకథను సిల్వర్ స్క్రీన్ పై ప్రెజెంట్ చేయాలని అనుకుంటున్నాను' అని చెప్పాడు. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని, ఇందులో సుశాంత్ పాత్రకు ఇటీవల వచ్చిన 'జిగ్రా' మూవీలో అలియా భట్ తమ్ముడిగా నటించిన వేదాంగ్ రైనా ను తీసుకోబోతున్నట్టు తెలిపాడు.
రుమీ జఫ్రీ గతంలో గోవిందా, డేవిడ్ ధావన్ కాంబినేషన్ లో వచ్చిన పలు చిత్రాలకు వర్క్ చేశాడు. అలానే అమితాబ్ బచ్చన్ 'చెహ్రే' మూవీతో పాటు సల్మాన్ ఖాన్, ప్రియాంక చోప్రా నటించిన 'గాడ్ తుస్సీ గ్రేట్ హో' ను డైరెక్ట్ చేశాడు.
Also Read: Vijay Sethupathi: పూరి మూవీలో సంయుక్త
Also Read: Rashmika Mandanna: రిజెక్షన్ నుంచి నేషనల్ క్రష్ వరకు