Dhurandhar: 'దురంధర్'కి షాక్‌.. ఆ దేశాల్లో బ్యాన్‌! తీవ్ర‌ ఆర్థిక నష్టం

ABN , Publish Date - Dec 13 , 2025 | 07:46 AM

బాలీవుడ్ స్టార్  రణవీర్ సింగ్ (Ranveer Singh) నటించిన తాజా చిత్రం 'దురంధర్'(Dhurandhar) బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది.

Dhurandhar

బాలీవుడ్ స్టార్  రణవీర్ సింగ్ (Ranveer Singh) నటించిన తాజా చిత్రం 'దురంధర్'(Dhurandhar) బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. ఈ చిత్రం భారతదేశంలో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తూ, మొదటి వారాంతం కంటే కూడా వీక్‌డేస్‌లో ఎక్కువ వసూళ్లు సాధించి ట్రేడ్ పండితులను ఆశ్చర్యపరిచింది. ఈ చిత్రం ఇప్పటివరకు దేశంలోనే రూ.218 కోట్లు వసూల్లు చేసినట్లు తెలుస్తోంది. ఓవర్సీస్ మార్కెట్‌ లో కూడా ఈ చిత్రం దూసుకుపోతున్న తరుణంలో, చిత్ర బృందానికి ఊహించని పెద్ద షాక్ తగిలింది. రణవీర్ సింగ్ సినిమాకు వసూళ్ల పరంగా కీలకమైన గల్ఫ్ దేశాలన్నింటిలో 'దురంధర్' చిత్రాన్ని నిషేధించారు. సినిమాను అక్కడ విడుదల చేయడానికి చిత్ర బృందం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, గల్ఫ్ దేశాల సెన్సార్ బోర్డుల  నుండి వారికి ఎటువంటి క్లియరెన్స్ లభించలేదు. దీంతో గల్ఫ్ దేశాలనై బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా,  యూఎఈలలో ప్రదర్శనకు నోచుకోలేదు. ఈ నిర్ణయానికి ప్రధాన కారణం.. సినిమాలో పాకిస్తాన్‌(Pakistan)కు వ్యతిరేకమైన అంశాలు, దాని రాజకీయ వైఖరిని (Political Stance) విమర్శించే కంటెంట్ ఉండటమే అని తెలుస్తోంది.


గల్ఫ్ దేశాలు భారతీయ చిత్రాలకు అత్యంత ముఖ్యమైన ఓవర్సీస్ మార్కెట్‌లలో ఒకటి. పెద్ద బడ్జెట్ సినిమాల లాభాల్లో ఈ ప్రాంతం కీలక పాత్ర పోషిస్తుంది. ఈ దేశాలలో నిషేధం కారణంగా 'దురంధర్' చిత్రానికి కలెక్షన్ల పరంగా పెద్ద ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉంది. దేశభక్తి, రాజకీయ నేపథ్యం లేదా మతపరమైన అంశాలున్న భారతీయ చిత్రాలపై గల్ఫ్ సెన్సార్ బోర్డులు కఠినంగా వ్యవహరిస్తున్నాయని ఈ తాజా ఉదంతం మరోసారి స్పష్టం చేసింది. గతంలో 'ఫైటర్'(Fighter), 'స్కై ఫోర్స్'(Sky Force), 'ది డిప్లొమాట్'(The Diplomat), 'ఆర్టికల్ 370' (Article 370), 'టైగర్ 3'(Tiger 3), 'ది కాశ్మీర్ ఫైల్స్' వంటి పెద్ద చిత్రాలు కూడా ఇటువంటి నిషేధాన్ని ఎదుర్కొన్నాయి.

ఇక ఆదిత్య ధర్ (Aditya Dhar) దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్‌ టైనర్‌ లో అక్షయ్ ఖన్నా(Akshaye Khanna), సంజయ్ దత్(Sanjay Dutt), అర్జున్ రాంపాల్( Arjun Rampal), ఆర్ మాధవన్(R Madhavan), రాకేష్ బేడీ(Rakesh Bedi), సారా అర్జున్(Sara Arjun) వంటి భారీ తారాగణం ముఖ్య పాత్రలు పోషించారు. 'దురంధర్' చిత్రం దేశీయంగా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించినప్పటికీ, గల్ఫ్ నిషేధం కారణంగా మొత్తం వసూళ్లపై దాని ప్రభావం ఎలా ఉంటుందనేది ఇప్పుడు సినీ పరిశ్రమలో చర్చనీయాంశమైంది.

Updated Date - Dec 13 , 2025 | 08:18 AM