Ravi Kishan: ప్రతి రోజు భార్య కాళ్లు మొక్కుతా...

ABN , Publish Date - Jul 22 , 2025 | 02:18 PM

ఆడవాళ్లు మగవాళ్లు సమానమే అని అందరూ అంటారు. కానీ దాన్ని ప్రాక్టికల్ గా పాటించి చూపేవాళ్ళు అరుదు. కొందరైతే ఆడవాళ్లు చేసే పనుల్ని కూడా చేయరు. కానీ ఆ సీనియర్ పొలిటీషియన్, సినిమా నటుడు ఎవరు చేయని పని చేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు.

భారతీయ సంప్రదాయంలో పండగలు లేదా పూజల సమయంలో భార్యలు తమ భర్తల పాదాలకు నమస్కరించడం ఒక ఆచారం. కానీ ఈ రోజుల్లో ఈ ఆచారం చాలా అరుదైపోయింది. చాలా మంది భర్తలు దీన్ని ఆశించం లేదు కూడా. భార్యలు కూడా ఈ ఆచారాన్ని పాటించడం చాలా వరకూ మానేశారు. భార్యల సంగతి అటుంచితే భర్త తన భార్య పాదాలను తాకడం అయితే అరుదైన విషయం. దీనికి సంప్రదాయం లేదా మత నియమం ఏమీ లేదు. ప్రేమతో లేదా కృతజ్ఞతతో ఇలా చేసే వాళ్లు కూడా చాలా తక్కువ. అయితే ఓ సీనియర్ నటుడు తాను ఈ ఆచారాన్ని పాటిస్తున్నానని చెప్పి షాకిచ్చాడు.


భోజ్‌పురి నటుడు, తెలుగు, హిందీ సినిమాల్లో చక్కని గుర్తింపు తెచ్చుకున్న రవి కిషన్ (Ravi Kishan) తన భార్య కాళ్లను మొక్కుతానని చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇటీవల కపిల్ శర్మ షో (The Kapil Sharma Show)లో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని బయటపెట్టారు. ప్రస్తుతం 'సన్ ఆఫ్ సర్దార్' (Son Of Sardaar)కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న 'సన్ ఆఫ్ సర్దార్ పార్ట్ 2 '(Son Of Sardaar2)లో కీలక పాత్రలో రవికిషన్ కనిపించబోతున్నాడు. ఆగస్ట్ 1 న ఈ మూవీ విడుదల కానున్న తరుణంలో జరుగుతున్న ప్రమోషన్స్ లో భాగంగా రవి కిషన్ ఈ విషయాన్ని బయటపెట్టాడు. తన చిన్ననాటి స్నేహితురాలు ప్రీతి కిషన్ (Preeti Kishan)ని ఆయన పెళ్లి చేసుకున్నారు. అప్పటికీ ఆయన సినీ రంగంలో ఇంకా పేరు సంపాదించలేదు. ఆ కష్ట సమయంలో ప్రీతి ఆయనకు అండగా నిలిచిందట. ఆమె సపోర్ట్ గురించి రవి కిషన్ ఎమోషనల్‌గా మాట్లాడారు. ఆమె పట్ల తనకున్న కృతజ్ఞతా భావాన్ని ప్రకటించడానికి రవి కిషన్ ఓ ప్రత్యేక ఆచారాన్ని పాటిస్తారట.

ప్రతి రాత్రి ప్రీతి నిద్రపోయిన తర్వాత... ఆమె పాదాలను నెమ్మదిగా తాకి... తన గౌరవాన్ని, కృతజ్ఞతను చూపిస్తానని రవి కిషన్ చెప్పుకొచ్చారు. ఇలా చేయడం వల్ల తనకు మనశ్శాంతి కలుగుతుందని వెల్లడించారు. ఈ విషయాన్ని విన్న ప్రేక్షకులు చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. రవి కిషన్ ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పడం, ఆమె పట్ల చూపే గౌరవాన్ని చాటడం అందరినీ ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ అయింది. చాలామంది రవి కిషన్ చర్యను ప్రేమ, వినయం, భార్యాభర్తల మధ్య కృతజ్ఞతకు ఓ అద్భుతమైన ఉదాహరణ అని మెచ్చుకుంటున్నారు. విశేషం ఏమంటే రవికిషన్ కేవలం నటుడు మాత్రమే కాదు... లోక్ సభ సభ్యుడు కూడా.

Read Also: Ustaad Bhagat singh: ఉస్తాద్‌లో రాశీఖన్నా అఫీషియల్‌.. దర్శకుడి ట్వీట్‌ వైరల్‌

Read Also: MM Keeravani Surprise: అప్పుడు రాజమౌళి కోసం.. ఇప్పుడు పవన్‌ కోసం.. ఫ్యాన్స్‌కి పండగే

Updated Date - Jul 22 , 2025 | 02:46 PM