Dhurandhar: బాక్సాఫీస్ దుమ్ము దులుపుతోన్న ‘దురంధర్’.. పది రోజుల్లో రూ. 500 కోట్లు!
ABN , Publish Date - Dec 16 , 2025 | 07:26 AM
రణ్‌వీర్‌సింగ్, అక్షయ్ ఖన్నా నటించిన ‘దురంధర్’ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీసు దుమ్ము దులుపుతోంది.
రణ్‌వీర్‌సింగ్ (Ranveer Singh), అక్షయ్ ఖన్నా (Akshaye Khanna) నటించిన ‘దురంధర్’ (Dhurandhar) చిత్రం బాలీవుడ్ బాక్సాఫీసు దుమ్ము దులుపుతోంది. ఈ నెల 5న విడుదలైన ఈ యాక్షన్ స్పై డ్రామా రోజురోజుకీ కలెక్షన్లు పెంచుకుంటూ ఇప్పుడు పది రోజుల్లో ఏకంగా రూ. 556 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. మరికొన్ని రోజుల్లో రూ. వెయ్యి కోట్లు వసూలు చేసినా ఆశ్చర్యపడనక్కర్లేదని ట్రేడ్ పండితులు అంటున్నారు. మూడో వారంలోకి అడుగు పెడుతున్నా కలెక్షన్లు ఏ మాత్రం తగ్గడం లేదని చెబుతున్నారు.
సోమవారం సైతం బుక్ మై షో లో గంటకు 20 వేల టికెట్లు తెగడం చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈ నెలలో థియేటర్లకు కానీ, ఓటీటీలో కానీ వచ్చే సినిమాలు ఏవీ లేకపోవడం కూడా ఈ కలెక్షన్ల సునామీకి ఓ కారణం. ‘ఈ రోజుల్లో ఇంత నిడివి (మూడున్నర గంటలు) ఉన్న సినిమాను ఎవరు చూస్తారబ్బా’ అని విసుక్కున్న వాళ్లే ‘దురంధర్’ చిత్రాన్ని చూడడానికి థియేటర్లకు పోటెత్తుతున్న ప్రేక్షకులను చూసి నివ్వెరపోతున్నారు. కథాంశం బాగుంటే నిడివి ఎక్కువైనా ప్రేక్షకులు పట్టించుకోరని ‘దురంధర్’ చిత్రంతో మరోసారి రుజువైంది.
2025లో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన చిత్రాల్లో ‘దురంధర్’ ది ప్రస్తుతానికి నాలుగో స్థానం. ‘కాంతార చాప్టర్ 1’ , ‘ఛావా’, ‘సయారా’ చిత్రాలు మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. సుమారు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో రెండు పార్టులుగా రూపొందింన ఈ చిత్రం రిలీజ్ అయి పది రోజులు పూర్తి చేసుకోగా రూ556 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి వెయ్యు కోట్ల వైపు పరుగులు పెడుతోంది. ఈ నెలాఖరు వరకు కూడా అంతగా ఎఫెక్ట్ చేసే పెద్ద సినిమాల రిలీజ్ లేక పోవడం ఈ సినిమాకు ఇంకా బాగా కలిసొచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఈ చిత్రం వరుస అపజయాలతో సతమతమవుతున్న హీరో రణ్‌వీర్ సింగ్‌కు ‘దురంధర్’ చిత్రం భారీ ఉపశమనం. ఈ సినిమాలో మరో కీలక పాత్ర పోషించిన అక్షయ్ ఖన్నాకు కూడా ఈ సినిమా మంచి పేరు తీసుకు వచ్చింది.