Ranveer Singh: రిషబ్‌ శెట్టి అద్భుతమైన నటుడని చెప్పడమే నా ఉద్దేశం..

ABN , Publish Date - Dec 02 , 2025 | 12:39 PM

రిషబ్‌శెట్టి నటించి, దర్శకత్వం వహించిన ‘కాంతార చాప్టర్‌ 1’ సినిమాపై బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ చేసిన కామెంట్స్‌కు కన్నడిగులు హర్ట్‌ అయిన సంగతి తెలిసిందే!

రిషబ్‌శెట్టి(Rishab Shetty) నటించి, దర్శకత్వం వహించిన ‘కాంతార చాప్టర్‌ 1’ సినిమాపై బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌(Ranveer singh) చేసిన కామెంట్స్‌కు కన్నడిగులు (Kananda Fans) హర్ట్‌ అయిన సంగతి తెలిసిందే! ఇటీవల గోవాలో జరిగిన ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (IFFI-2025) ముగింపు వేడుకల్లో రణ్‌వీర్‌ సింగ్‌ పాల్గొన్నారు. కాంతార సినిమాలో రిషబ్‌ నటన అవుట్‌ స్టాండింగ్‌ అంటూ ప్రశంసించారు. అయితే ఈ చిత్రంలో రిషబ్‌ శెట్టి చేసిన గులిగా దైవం సోదరి చౌండీ పాత్రను ఫీమేల్‌ ఘోస్ట్‌ (ఆడ దెయ్యం) అని రణ్‌వీర్‌ అంటూ ఆ క్యారెక్టర్‌ మాదిరి కళ్లను వంకరగా పెట్టి నాలుక బయటకు చూపిస్తూ ఆ పాత్రను అనుకరించాడు. ‘హీరో పాత్రలోకి దెయ్యం ప్రవేశించినప్పుడు సన్నివేశాలు చాలా బాగున్నాయి’ అని అన్నాడు. అలాగే కాంతార 3లో నేను ఉండాలని కోరుకుంటున్నారా? అయితే రిషబ్‌ని అడగండి అంటూ మాట్లాడారు. అతని మాటలకు రిషబ్‌ సైతం ఆనందించారు, సరదాగా నవ్వుకున్నారు. అయితే కన్నడిగులు మాత్రం ఆగ్రహానికి లోనయ్యారు. ఆ ప్రాంత ఇలవేల్పును అలా పోల్చడం సరికాదని రణ్‌వీర్‌సింగ్‌ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. అయితే దీనిపై రిషబ్‌ ఎక్కడా మాట్లాడలేదు.

కన్నడిగులు మాత్రం రణ్‌వీర్‌ను ట్రోల్‌ చేస్తూనే ఉన్నారు. దీంతో రణ్‌వీర్‌సింగ్‌ స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ పోస్ట్‌ పెట్టి క్షమాపణ చెప్పారు. ‘రిషబ్‌ శెట్టి అద్భుతమైన నటుడు అని హైలైట్‌ చేయడమే నా మాటల్లోని ఉద్దేశ్యం. ఒక నటుడిగా మరో నటుడిని అటువంటి అద్భుతమైన నటనను చూసి మెచ్చుకోకుండా ఎలా ఉండగలం. అలాంటి సన్నివేశాన్ని చేయడానికి ఎంత కష్టపడాల్సి వచ్చిందో నాకు తెలుసు. ఆయన నటన అంటే ఎంతో గౌరవం ఉంది. నేను ఎల్లప్పుడూ మన దేశంలోని ప్రతి సంస్కృతి, సంప్రదాయం, నమ్మకాన్ని గౌరవిస్తూనే ఉన్నాను. నా మాటల వల్ల ఎవరినైనా బాధపెట్టి ఉంటే మనస్ఫూర్తిగా  క్షమాపణ కోరుతున్నాను’ అని తన  పోస్ట్‌లో పేర్కొన్నారు.

 

Updated Date - Dec 02 , 2025 | 12:41 PM