Ranbir Kapoor: ధూమ్ 4 కన్ఫర్మ్ చేసిన యానిమల్ హీరో.. ?

ABN , Publish Date - Jun 02 , 2025 | 05:20 PM

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్(Ranbir Kapoor) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. యానిమల్ సినిమా తరువాత తెలుగువారికి కూడా రణబీర్ సుపరిచితుడుగా మారాడు.

Dhoom 4

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్(Ranbir Kapoor) ప్రస్తుతం వరుస సినిమాలతో  బిజీగా ఉన్న విషయం తెల్సిందే. యానిమల్ సినిమా తరువాత తెలుగువారికి కూడా రణబీర్ సుపరిచితుడుగా మారాడు. ఈ సినిమా తరువాత నుంచి ఈ కుర్ర హీరో ఏ సినిమా చేసినా  దానికోసం అభిమానులు  వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రణబీర్.. రామాయణం(Ramayan) సినిమాతో బిజీగా ఉన్నాడు.

బాలీవుడ్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రామాయణంలో రణబీర్  రాముడిగా కనిపించబోతుండగా.. సాయిపల్లవి(Sai Pallavi) సీతగా, యష్(Yash) రావణుడిగా కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి లీక్ అయిన ఫోటోలు సోషల్ మీడియాను ఏ రేంజ్ గా షేక్ చేశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక రామాయణం కాకుండా రణబీర్ యానిమల్ పార్క్, బ్రహ్మాస్త్ర 2 సినిమాలు చేస్తున్నాడు. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో  లవ్ అండ్ వార్ అనే సినిమా కూడా లైన్లో ఉంది.

ఇక ఇవి మాత్రమే కాకుండా తాజాగా మరో హిట్ ప్రాంఛైజీలో కనిపించబోతున్నాడని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఏ ప్రేక్షకుడు అంత త్వరగా మర్చిపోలేని సినిమాల్లో ధూమ్(Dhoom) సిరీస్ లు ఒకటి. హిందీ ప్రేక్షకులే కాదు  తెలుగు ప్రేక్షకులు కూడా ఈ ధూమ్ ప్రాంఛైజీని అంత త్వరగా మర్చిపోలేరు. ముఖ్యంగా ధూమ్ 2.. ఎన్ని  రికార్డులు బద్దలు కొట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. YRF స్పై యూనివర్స్ లో ఎన్ని సినిమాలు వచ్చినా.. ధూమ్ చాలా ప్రత్యేకంగా నిలిచిపోయింది.

ధూమ్.. జాన్ అబ్రహం, ధూమ్ 2 హృతిక్ రోషన్, ధూమ్ 3..ఆమీర్ ఖాన్ హీరోలుగా కనిపించారు. ఇక ఇప్పుడు మేకర్స్ ధూమ్ 4 కి సిద్ధమవుతున్నారు. ఈసారి  YRF ని షేక్ చేయడానికి రణబీర్ దిగుతున్నాడు. ధూమ్ 4 లో రణబీర్ హీరోగా చేస్తున్నాడని బాలీవుడ్ మీడియా కన్ఫర్మ్ చేసింది. భారతీయ యాక్షన్ సినిమాలో కొత్త అధ్యాయానికి తెరలేపిన ఈ ప్రాంఛైజీని ఆదిత్య చోప్రా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.

ఇప్పటికే ఆదిత్య చోప్రా, రచయిత శ్రీధర్ రాఘవన్ కలిసి స్క్రిప్ట్ ను ఫినిష్ చేసే పనిలో ఉన్నారట. అయాన్ ముఖర్జీ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం అయాన్ వార్ 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే ధూమ్ 4 ను పట్టాలెక్కించనున్నాడని, 2027 లో ధూమ్ 4 రిలీజ్ కానున్నట్లు బాలీవుడ్ మీడియా చెప్పుకొస్తుంది. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. 

Updated Date - Jun 02 , 2025 | 05:20 PM