Bollywood: హాస్యనటుడు, దర్శకుడు అస్రాని మృతి

ABN , Publish Date - Oct 21 , 2025 | 07:42 AM

ఐదు దశాబ్దాల సినీ ప్రయాణంలో మూడు వందలకు పైగా చిత్రాలలో నటించిన బాలీవుడ్, గుజరాతీ నటుడు అస్రాని అక్టోబర్ 20న తుది శ్వాస విడిచారు. ఆయన ఆరు చిత్రాలకు దర్శకత్వం వహించారు.

Actor Asrani

ప్రముఖ బాలీవుడ్, గుజరాతీ నటుడు గోవర్ధన్ అస్రానీ (84) (Govardhan Asrani) అక్టోబర్ 20వ తేదీ అనారోగ్యంతో హాస్పిటల్ కన్నుమూశారు. జైపూర్ లో సింధీ కుటుంబానికి చెందిన అస్రానీ తండ్రి చేస్తున్న కార్పెట్ వ్యాపారం చేయడం ఇష్టంలేక సినిమాల్లోకి వచ్చారు. పూణె ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ లో నటనలో శిక్షణ తీసుకుని ఆ తర్వాత గుజరాతీ, హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టారు. దాదాపు ఐదు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఆయన మూడు వందలకు పైగా చిత్రాలలో నటించారు. ఆరు చిత్రాలకు దర్శకత్వం వహించారు. కొన్ని చిత్రాలలో హీరోగానూ యాక్ట్ చేశారు. తన సహ నటి మంజు బన్సాల్ ను ఆయన ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. వివాహానంతరం కూడా వీరిద్దరూ కలిసి పలు చిత్రాలలో నటించారు.


1975లో విడుదలైన 'షోలే' (Sholay) సినిమాలో జైలర్ పాత్రను చేసి రక్తికట్టించారు అస్రాని. 'హమ్ ఆంగ్రేజోన్ కే జమానే కే జైలర్ హై' అంటూ ఆయన చెప్పిన డైలాగ్ అప్పట్లో అందరి నోట్లలో నానింది. తెలుగు దర్శకులు తాతినేని రామారావు (Thathineni Ramarao), దాసరి నారాయణరావు (Dasari Narayana Rao), కె. రాఘవేంద్రరావు (K. Raghavendra Rao) తెరకెక్కించిన పలు హిందీ చిత్రాలలో అస్రానీ, కాదర్ ఖాన్, శక్తికపూర్ ముగ్గురూ కలిసి నటించి ఉత్తరాది ప్రేక్షకులను మెప్పించారు.

కెరీర్ ప్రారంభంలో హృషికేష్‌ ముఖర్జీ ఆ తర్వాత ప్రియదర్శన్ అస్రానిని బాగా ప్రోత్సహించారు. ఒక్క రాజేశ్ ఖన్నా (Rajesh Khanna) తోనే దాదాపు పాతిక చిత్రాలలో స్నేహితుడిగా నటించారు అస్రాని. 1970, 80లలో రెండు వందలకు పైగా చిత్రాలలో వినోదాన్ని పంచే పాత్రలను పోషించి, బాలీవుడ్ లో తనదైన ముద్రను వేశారు. పూణే ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ లో శిక్షణ తీసుకున్న ఆయన 1988 నుండి 1993 వరకూ అదే సంస్థకు డైరెక్టర్ గా సేవలు అందించారు.

as1.jpg


గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ని జుహులోని ఓ హాస్పిటల్ లో చేర్చారు. అక్కడే చికిత్స తీసుకుంటూ సోమవారం ఆయన తుది శ్వాస విడిచారు. శాంతాక్రజ్ లోని శ్మశాన వాటికలో అస్రాని అంత్యక్రియలను నిర్వహించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

'మేరే అప్నే, కోషిష్, పరిచయ్, బావర్చి, అభిమాన్, దో ల్కడే దోనే కడ్కే, బందీష్‌, చుప్కే చుప్కే, బాలికా వధు, హీరాలాల్ పన్నాలాల్, పతీ పత్నీ ఔర్ వో, హేరా ఫేరీ, చుప్ చుప్ కే, హల్చల్, భూల్ భులైయ్యా, కమాల్ ధమాల్ మలమాల్' వంటి చిత్రాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. రామానాయుడు హిందీలో వెంకటేశ్‌ తో తెరకెక్కించిన 'తక్దీర్ వాలా'లోనూ అస్రాని నటించి మెప్పించారు. అస్రాని మృతికి పలువురు బాలీవుడ్ నటీనటులు, సాంకేతిక నిపుణులు సంతాపం తెలిపారు.

Updated Date - Oct 21 , 2025 | 07:46 AM